
న్యూఢిల్లీ : భారత్‌లోని పాక్ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది.
జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న ఐదు సంచలన నిర్ణయాల అమలుకు భారత్ వడివడిగా అడుగువేస్తోంది. వేగంగా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా గురువారం పాక్ పౌరులకు జారీ చేసిన అన్నీ వీసాలను భారత్ రద్దు చేసింది. వాటిలో వైద్య వీసాలు కూడా ఉన్నాయి. పాకిస్తానీలకు వీసా సేవలను నిలిపివేసింది.
కొద్ది సేపటిక్రితం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులకు చెల్లుబాటయ్యే అన్నీ వీసాలను ఏప్రిల్ 27 రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన అన్నీ వైద్య వీసాలు ఏప్రిల్ 29 మంగళవారం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. సవరించిన సమయపాలన ఆధారంగా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని పాకిస్తానీలు వారి వీసాల గడువు ముగిసేలోపు వెళ్లిపోవాలని పేర్కొంది.