పాక్‌కు ‘పంచ్‌’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు | PM Narendra Modi Govt Fires On Pakistan For Pahalgam Terror Attack | Sakshi
Sakshi News home page

పాక్‌కు ‘పంచ్‌’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు

Published Thu, Apr 24 2025 1:11 AM | Last Updated on Thu, Apr 24 2025 1:11 AM

PM Narendra Modi Govt Fires On Pakistan For Pahalgam Terror Attack

సీసీఎస్‌ భేటీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

దౌత్య సంబంధాలకు కత్తెర.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు  

సింధూ ఒప్పందం సస్పెన్షన్‌.. అటారీ సరిహద్దు మూత

దౌత్య సిబ్బంది బహిష్కరణ 

సీసీఎస్‌ భేటీలో నిర్ణయాలు.. పహల్గాం దాడికి ఖండన..

మోదీ సారథ్యంలో లోతుగా చర్చ.. ఉగ్రవాదాన్ని పోషిస్తోందంటూ పాకిస్తాన్‌పై ధ్వజం 

దాడికి దీటైన ప్రతీకారం తప్పదని సంకేతాలు

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై మంగళవారం ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని భారత్‌ అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీని వెనక పాకిస్తాన్‌ హస్తం స్పష్టంగా కనిపిస్తోందంటూ మండిపడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలకు దిగింది. పాకిస్తాన్‌ పౌరులకు భారత్‌లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక పాక్‌తో దౌత్య సంబంధాలకు చాలావరకు కత్తెర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమా వేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ మేరకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

సింధూ నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది తగ్గింపు తదితరాలు వీటిలో ఉన్నాయి. దీంతో పాక్‌తో ఇప్పటికే క్షీణించిన దౌత్య సంబంధాలు మరింత అట్టడుగుకు దిగజారాయి. ఈ చర్యలతోనే సరిపెట్టకుండా ఉగ్ర ముష్కరులకు, వారిని ప్రేరేపిస్తున్న పొరుగు దేశానికి దీటుగా బదులిచ్చేందుకు కూడా కేంద్రం సమాయత్తమవుతోంది. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై సీసీఎస్‌ భేటీలో రెండున్నర గంటలకు పైగా లోతుగా చర్చ జరిగింది. 

విమానాశ్రయంలోనే మోదీ సమీక్ష 
మంగళవారం రాత్రి సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వెనుదిరిగిన ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీతో విమానాశ్రయంలోనే సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పలు అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సాయంత్రం ఆరింటికి మోదీ సారథ్యంలో సీసీఎస్‌ అత్యవసరంగా సమావేశమైంది. 

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జైశంకర్, దోవల్, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సింగ్, విక్రం మిస్రీ, ప్రధాని ముఖ్య కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత దాస్, అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీసీఎస్‌ సభ్యురాలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అమెరికా పర్యటనలో ఉండటంతో హాజరు కాలేదు. దాడిపై ప్రతిస్పందన ఎలా ఉండాలన్నదే ప్రధాన అజెండాగా భేటీ జరిగింది. దాడి జరిగిన తీరు తదితరాలను అమిత్‌ షా వివరించారు. 25 మంది భారతీయులు, ఒక నేపాల్‌ జాతీయుడు మృతి చెందినట్టు చెప్పారు. 

శిక్షించి తీరతాం: మిస్రీ 
పహల్గాం దాడిని సీసీఎస్‌ అత్యంత తీవ్రంగా ఖండించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. దాడికి తెగబడ్డ ముష్కరులతో పాటు దాని సూత్రధారులను కూడా కఠినంగా శిక్షించి తీరాలని సీసీఎస్‌ తీర్మానించింది’’ అని వెల్లడించారు. ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్‌ రాణా మాదిరిగానే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టడం ప్రకటించారు. 

‘‘జమ్మూ కశ్మీర్‌లో విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ ప్రాంతమంతా ఆర్థికాభివృద్ధితో కళకళలాడుతున్న వేళ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రపూరిత దాడి ఇది. దాని వెనక దాగున్న సీమాంతర లింకులపై సీసీఎస్‌ లోతుగా చర్చించింది. ప్రపంచ దేశాలన్నీ దాన్ని అత్యంత తీవ్ర పదజాలంతో ఖండించిన తీరును ప్రశంసించింది. ఉగ్రవాదంపై రాజీలేని పోరులో భారత్‌కు ఆ దేశాల మద్దతుకు ఇది ప్రతీక అని పేర్కొంది. పాక్‌పై తీసుకున్న చర్యల జాబితాను చదివి వినిపించారు. 

పాక్‌పై చర్యలివే... 
– సార్క్‌ వీసా మినహాయింపు పథకం (ఎస్‌వీఈఎస్‌) కింద పాక్‌ జాతీయులకు భారత వీసాల జారీ నిలిపివేత. ఇప్పటికే జారీ చేసిన వీసాల రద్దు. వాటిపై ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్తానీలు 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశం. 
– ఉగ్రవాదానికి పాక్‌ మద్దతివ్వడం మానుకునేదాకా 1960లో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్‌. 
– భారత్, పాక్‌ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజాబ్‌లోని అటారీ సరిహద్దు తక్షణం మూసివేత. దానిగుండా పాక్‌కు వెళ్లినవారు తిరిగొచ్చేందుకు మే 1 దాకా గడువు. 
– ఢిల్లీలోని పాక్‌ హై కమిషన్‌ నుంచి రక్షణ, త్రివిధ దళాల సలహాదారు, వారి ఐదుగురు సహాయక సిబ్బంది బహిష్కరణ. వారంలోపు భారత్‌ వీడాలని ఆదేశం. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌ నుంచి భారత రక్షణ, త్రివిధ దళాల సలహాదారుల ఉపసంహరణ. 
– ఇరుదేశాల హై కమిషన్లలో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement