హతవిధీ! | Pakistan beat India by 180 runs, win ICC Champions Trophy 2017 | Sakshi
Sakshi News home page

హతవిధీ!

Published Mon, Jun 19 2017 3:32 AM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM

హతవిధీ!

హతవిధీ!

తొలిసారి టైటిల్‌ నెగ్గిన పాకిస్తాన్‌
180 పరుగులతో ఓడిన టీమిండియా
భారత బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యం
ఫఖర్‌ జమాన్‌ సెంచరీ
నిప్పులు చెరిగిన ఆమిర్‌


భరించలేని భంగపాటు. దాయాది చేతిలో దారుణ ఓటమి. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్‌ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడింది. అనిశ్చితికి మారుపేరైన పాక్‌ మ్యాచ్‌ ఆద్యంతం తిరుగులేని పట్టుదల ప్రదర్శిస్తే, సూపర్‌స్టార్లతో నిండిన టీమిండియా మాత్రం పేలవమైన ఆటతీరుతో ఉసూరుమనిపించింది. వాళ్ల బ్యాట్స్‌మెన్‌ చెలరేగిన పిచ్‌పైనే మన పరుగుల వీరులు మూకుమ్మడిగా చేతులెత్తేశారు. ఒకరి వెనక ఒకరు పెవిలియన్‌ బాటపట్టారు. ఫలితం... ఏకంగా 180 పరుగుల తేడాతో దారుణ పరాభవం!! చిరకాల ప్రత్యర్థికి కనీస పోటీ కూడా ఇవ్వకుండానే మనవాళ్లు చాప చుట్టేసిన తీరును తట్టుకోలేక సగటు అభిమాని గుండె బద్దలైంది.

ఎన్నో ఆశలు, ఎన్నో అంచనాలు... ఎన్నో కోరికలు, మరెన్నో ఉద్వేగాలు... అన్నీ ఒక్క దెబ్బకు కూలిపోయాయి... తమ జట్టు చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేస్తుందని, మళ్లీ చాంపియన్‌గా నిలుస్తుందని భావించిన కోట్లాది మంది భారత అభిమానుల గుండెలు బద్దలైపోయాయి. రెండు వారాల క్రితం మన చేతుల్లో ఘోరంగా ఓడిన జట్టు మనకు అసలు పోటీనే కాదనుకున్నాం... కానీ అదే పాకిస్తాన్‌ అంతకంటే దారుణంగా దెబ్బ తీసింది. చివరకు మన బృందానికి పరాభవమే మిగిలింది.


 339 పరుగుల భారీ లక్ష్యం.. ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ మూడో బంతికే డకౌట్‌... ఫర్వాలేదు ఛేజింగ్‌ హీరో కోహ్లి ఉన్నాడనుకున్నాం. కానీ అతనూ నమ్మకాన్ని వమ్ము చేశాడు... ఇక టోర్నీ హీరో శిఖర్‌ ధావన్‌పై భారం అనుకునేలోపే అతనూ నిష్క్రమించాడు. యువరాజ్, ధోనిలాంటి సీనియర్ల భుజాలపై బాధ్యత ఉన్నా... అది వారి శక్తికి మించిన పనే అయింది. 17 ఓవర్లు ముగిసేసరికి 72/6. ఇక కుర్రాడు హార్దిక్‌ పాండ్యా సిక్సర్ల మోత తప్ప చెప్పుకునేదేమీ లేక టీమిండియా తలవంచింది.

అనూహ్యాన్ని ఊహించండి... పాకిస్తాన్‌ గురించి అందరూ చెప్పే మాట. చివరకు పాక్‌ తమ పేరును నిలబెట్టుకుంటూ  అదే చేసి చూపించింది. ఆడుతున్న జట్లలో చివరి ర్యాంక్,  తొలి మ్యాచ్‌లో భారీ ఓటమి... ఇక చేసేదేమీ లేదని అనిపించిన వేళ ఆ జట్టు ఉవ్వెత్తున ఎగసింది. దక్షిణాఫ్రికా, శ్రీలంక, సెమీస్‌లో ఫేవరెట్‌ ఇంగ్లండ్‌పై అద్భుత  విజయాలు... అయినా ఐసీసీ టోర్నీ ఫైనల్లో భారత్‌తో మ్యాచ్‌ అంటే ఉండే ఉద్రిక్తత, ఒత్తిడి వేరు. కానీ ఆ జట్టు దీనిని ఛేదించింది.  తొలిసారి చాంపియన్స్‌ ట్రోఫీలో  చాంపియన్‌గా అవతరించింది.  

లండన్‌: పాతికేళ్ల తర్వాత పాకిస్తాన్‌ జట్టు తమ వన్డే క్రికెట్‌ చరిత్రలో మరో అద్భుత విజయాన్ని అందుకుంది. తొమ్మిదేళ్లుగా తమ దేశంలో క్రికెట్‌కు దూరమైన అభిమానులకు అపురూపమైన కానుక అందించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన ఆ జట్టు 2017 చాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడి ఓవల్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 180 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫఖర్‌ జమాన్‌ (106 బంతుల్లో 114; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. అజహర్‌ అలీ (71 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్‌), హఫీజ్‌ (37 బంతుల్లో 57 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేయగా, బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 46; 4 ఫోర్లు) రాణించాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తీవ్ర ఒత్తిడికి లోనై భారత్‌ కుప్పకూలింది. కోహ్లి సేన కేవలం 30.3 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్‌ పాండ్యా (43 బంతుల్లో 76; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒక్కడే దూకుడుగా ఆడే ప్రయత్నం చేయగా... మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు.

ఆమిర్‌ (3/16) భారత్‌ పతనాన్ని శాసించగా, హసన్‌ అలీ (3/19) కూడా చెలరేగాడు. ఏ మాత్రం పోరాటపటిమ కనబర్చలేకపోయిన టీమిండియా దాదాపు 20 ఓవర్లు మిగిలి ఉండగానే తలవంచడం విషాదం. టోర్నీలో అత్యధిక పరుగులు (338) చేసిన శిఖర్‌ ధావన్‌కు ‘గోల్డెన్‌ బ్యాట్‌’ అవార్డు దక్కగా, అత్యధిక వికెట్లు (13) తీసిన పాక్‌ పేసర్‌ హసన్‌ అలీ ‘గోల్డెన్‌ బాల్‌’తో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డు కూడా అందుకున్నాడు.

భారీ భాగస్వామ్యం...
తొలి ఓవర్‌ మెయిడిన్‌... తర్వాతి రెండు ఓవర్లలో కూడా మొత్తం 7 పరుగులే... టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు లభించిన ఆరంభం ఇది. బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో ఫఖర్, కీపర్‌కు సునాయాస క్యాచ్‌ ఇచ్చినా అది నోబాల్‌ కావడంతో బతికిపోయాడు. ఈ ఉత్కంఠ క్షణాలను దాటిన తర్వాత ఇక పాకిస్తాన్‌ వెనుదిరిగి చూడలేదు. ఫఖర్, అజహర్‌ తొలి వికెట్‌కు 128 పరుగులు జత చేశారు. అశ్విన్‌ ఓవర్లో స్వీప్‌ షాట్‌తో బౌండరీ కొట్టిన ఫఖర్‌ 92 బంతుల్లో కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో హఫీజ్, ఇమాద్‌ ఏకంగా 9.46 రన్‌రేట్‌తో అభేద్యంగా 71 పరుగులు జోడించారు.

టపటపా..: గతంలో 300కు పైగా భారీ స్కోర్లను అలవోకగా ఛేదించిన భారత్‌ ముందు ఈ లక్ష్యం కష్టమే అయినా అసాధ్యంగా ఏమీ కనిపించలేదు. కానీ ఆమిర్‌ ఒక్కసారిగా మ్యాచ్‌ను మార్చేశాడు. అతని తొలి ఓవర్లో రోహిత్‌ (0) డకౌట్‌. రెండో ఓవర్లో కోహ్లి (5) ఖేల్‌ ఖతం. అంతకుముందు బంతికే కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను అజహర్‌ అలీ వదిలేసినా... అది çకలిసిరాలేదు. శిఖర్‌ ధావన్‌ (21; 4 ఫోర్లు) వికెట్‌ కూడా ఆమిర్‌కే. ఆ తర్వాత యువరాజ్‌ (22; 4 ఫోర్లు), ధోని (4) కూడా వెనుదిరగడంతో భారత్‌ మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది. జడేజాతో సమన్వయ లోపంతో పాండ్యా రనౌట్‌ కావడంతో భారత్‌ ఓటమి ఖాయమైంది.

3 ఐసీసీ మూడు టోర్నీలూ గెలుచుకున్న మూడో జట్టు పాకిస్తాన్‌. వన్డే వరల్డ్‌ కప్, టి20 ప్రపంచ కప్, చాంపియన్స్‌ ట్రోఫీలను పాక్‌ కంటే ముందు భారత్, వెస్టిండీస్‌ గెలుచుకున్నాయి.180ఒక ఐసీసీ టోర్నీలో ఫైనల్లో ఇదే అతి పెద్ద పరాజయం.

తుది ఫలితం మాకు నిరాశ కలిగించినా ఫైనల్‌ చేరడం సంతృప్తినిచ్చింది. మేం ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోలేదు కానీ పాకిస్తాన్‌ మరింత పట్టుదలతో ఆడింది. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లో కూడా వారు దూకుడు కనబర్చారు. తమదైన రోజున పాక్‌ ఎవరినైనా ఓడించగలదని మళ్లీ రుజువైంది. టోర్నీలో వారు కోలుకున్న తీరు అద్భుతం. హార్దిక్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. బుమ్రా నోబాల్‌లాంటి చిన్న పొరపాట్లు కూడా ఒక్కోసారి పెద్దగా మారిపోతాయి. మా బలం (ఛేజింగ్‌)పై నమ్మకముంది. కానీ ఈసారి అది సరిపోలేదు. అయితే మేం ఓడింది ఒక్క మ్యాచ్‌ మాత్రమే. తప్పులు సరిదిద్దుకొని ముందుకు వెళతాం.
–విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌   

స్కోరు వివరాలు
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: అజహర్‌ అలీ రనౌట్‌ 59; ఫఖర్‌ జమాన్‌ (సి) జడేజా (బి) పాండ్యా 114; బాబర్‌ ఆజమ్‌ (సి) యువరాజ్‌ (బి) జాదవ్‌ 46; షోయబ్‌ మాలిక్‌ (సి) జాదవ్‌ (బి) భువనేశ్వర్‌ 12; హఫీజ్‌ నాటౌట్‌ 57; ఇమాద్‌ వసీమ్‌ నాటౌట్‌ 25; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 338.

వికెట్ల పతనం: 1–128, 2–200, 3–247, 4–267.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10–2–44–1, బుమ్రా 9–0–68–0, అశ్విన్‌ 10–0–70–0, పాండ్యా 10–0–53–1, జడేజా 8–0–67–0, జాదవ్‌ 3–0–27–1.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ ఎల్బీడబ్ల్యూ (బి) ఆమిర్‌ 0; శిఖర్‌ ధావన్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) ఆమిర్‌ 21; కోహ్లి (సి) షాదాబ్‌ ఖాన్‌ (బి) ఆమిర్‌ 5; యువరాజ్‌ సింగ్‌ ఎల్బీడబ్ల్యూ (బి) షాదాబ్‌ ఖాన్‌ 22; ధోని (సి) ఇమాద్‌ వసీమ్‌ (బి) హసన్‌ అలీ 4; జాదవ్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) షాదాబ్‌ ఖాన్‌ 9; పాండ్యా రనౌట్‌ 76; జడేజా (సి) బాబర్‌ ఆజమ్‌ (బి) జునైద్‌ ఖాన్‌ 15; అశ్విన్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) హసన్‌ అలీ 1; భువనేశ్వర్‌ నాటౌట్‌ 1; బుమ్రా (సి) సర్ఫరాజ్‌ (బి) హసన్‌ అలీ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (30.3 ఓవర్లలో ఆలౌట్‌) 158.

వికెట్ల పతనం: 1–0, 2–6, 3–33, 4–54, 5–54, 6–72, 7–152, 8–156, 9–156, 10–158. బౌలింగ్‌: ఆమిర్‌ 6–2–16–3, జునైద్‌ 6–1–20–1, హఫీజ్‌ 1–0–13–0, హసన్‌ అలీ 6.3–1–19–3, షాదాబ్‌ 7–0–60–2, ఇమాద్‌  0.3–0–3–0, ఫఖర్‌ జమాన్‌ 3.3–0–25–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement