
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కొత్త వివాదం తలెత్తింది. భారత జెండాను కలిగి ఉన్నాడన్న కారణంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియం నుండి ఓ వ్యక్తిని బయటకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో పాకిస్తాన్ భద్రతా సిబ్బంది భారత జెండాను లాక్కొని, జెండాను పట్టుకున్న వ్యక్తిని స్టేడియంలో నుండి బయటికి ఊడ్చుకెళ్లారు. ఫిబ్రవరి 22వ తేదీన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్ అయిన సెకెన్లలో వైరలైంది. భారత జెండా కలిగి ఉన్న వ్యక్తి పాకిస్తాన్ పౌరుడే అయినప్పటికీ భారత అభిమాని అని తెలుస్తుంది. సదరు వ్యక్తిని పాక్ భద్రతా సిబ్బంది కొట్టి అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ వీడియోపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నుంచి ఎలాంటి స్పందన లేదు. భారత జెండా పట్టుకున్న వ్యక్తి పేరు, వివరాలు కూడా తెలియరాలేదు.
ఈ వీడియో నిజమైతే మరెన్ని వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. భద్రతా సిబ్బంది నిజంగానే భారత అభిమానిపై దాడి చేసుంటే పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత అభిమానులు ఈ వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్నారు. క్రికెట్‌ను క్రికెట్ లాగే చూడాలి. క్రికెట్‌ను ఇతరత్రా విషయాలతో ముడి పెట్టకూడదని అంటున్నారు.
ఇదిలా ఉంటే, 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు (ఛాంపియన్స్ ట్రోఫీ) ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్.. పట్టుమని 10 రోజులు కూడా టోర్నీలో నిలువలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైన ఆరు రోజుల్లోనే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిన్నటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ కథ ముగిసింది.
ఈ టోర్నీలో పాక్ వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమితో పాక్‌తో పాటు బంగ్లాదేశ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు అర్హత సాధించాయి. ఈ టోర్నీలో పాక్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.
గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్తులు ఖరారు కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేదు. మరోవైపు ఈ టోర్నీలో భారత్, న్యూజిలాండ్ ప్రయాణం జోరుగా సాగుతుంది. ఇరు జట్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను మట్టికరిపించాయి. ఈ రెండు జట్ల మధ్య నామమాత్రపు పోరు మార్చి 2న జరుగనుంది.
గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 25) జరగాల్సిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పటివరకు సౌతాఫ్రికా, ఆసీస్ తలో మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆసీస్‌తో పోలిస్తే సౌతాఫ్రికా మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంది.
ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. ఈ రెండు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలో ఓడాయి. సౌతాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్‌ను.. ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను మట్టికరిపించాయి. టోర్నీలో రేపు ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment