IPL 2025: కేకేఆర్‌ కెప్టెన్‌గా నేను రెడీ! | IPL 2025 Will Definitely Do It: Venkatesh Iyer On Leading KKR | Sakshi
Sakshi News home page

IPL 2025: కేకేఆర్‌ కెప్టెన్‌గా నేను రెడీ!

Published Tue, Feb 25 2025 4:21 PM | Last Updated on Tue, Feb 25 2025 4:44 PM

IPL 2025 Will Definitely Do It: Venkatesh Iyer On Leading KKR

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)-2025 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాలో వెంకటేశ్‌ అయ్యర్‌(Venkatesh Iyer) మూడో స్థానంలో ఉన్నాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(KKR) తరఫున గతేడాది రాణించిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ను.. వేలంపాటకు ముందు ఫ్రాంఛైజీ వదిలేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రూ. 2 కోట్ల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చిన అతడి కోసం కేకేఆర్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పోటీపడ్డాయి.

ఈ క్రమంలో ఏకంగా రూ. 23.75 కోట్లకు కోల్‌కతా వెంకటేశ్‌ అయ్యర్‌ను తమ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ కెప్టెన్సీ రేసులో ఈ మధ్యప్రదేశ్‌ క్రికెటర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ  సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌కు పగ్గాలు అప్పగించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉందనే వార్తలు వస్తున్నాయి.

కెప్టెన్‌ అనే ట్యాగ్‌ అవసరం లేదు
ఈ విషయంపై వెంకటేశ్‌ అయ్యర్‌ స్వయంగా స్పందించాడు. నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మనసులోని మాటను వెల్లడించాడు. కెప్టెన్‌గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా.. నేను వందశాతం సిద్ధంగా ఉన్నాను. నిజానికి కెప్టెన్సీ అనేది ఒక ట్యాగ్‌ మాత్రమే.

నాయకుడిగా ఉండటం అనేది మాత్రం గొప్ప విషయం. డ్రెసింగ్‌రూమ్‌లో లీడర్‌ ఉండాలంటే కెప్టెన్‌ అనే ట్యాగ్‌ అవసరం లేదని నేను నమ్ముతాను. మన ప్రదర్శనతో సహచర ఆటగాళ్లకు స్ఫూర్తినివ్వాలి. మైదానం లోపలా, వెలుపలా రోల్‌ మోడల్‌లా ఉండాలి. మధ్యప్రదేశ్‌ జట్టులో నేను ప్రస్తుతం అదే పాత్ర పోషిస్తున్నాను.

గళం విప్పే స్వేచ్ఛ ఉన్నపుడే
మధ్యప్రదేశ్‌ జట్టుకు నేనేమీ కెప్టెన్‌ను కాదు. అయితే, నా అభిప్రాయాలకు, సూచనలకు అక్కడి నాయకత్వం విలువనిస్తుంది. నాకు అలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. మనం జట్టులోకి కొత్తగా వచ్చామా.. మనల్ని వాళ్లు రూ. 20 లక్షలు లేదంటే రూ. 20 కోట్లు పెట్టి కొనుగోలు చేశారా అన్నది ముఖ్యం కాదు.. 

జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా మన గళం విప్పే స్వేచ్ఛ ఉన్నపుడే అంతా బాగుంటుంది’’ అని వెంకటేశ్‌ అయ్యర్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు.

కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌లో కేకేఆర్‌ తరఫున క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు వెంకటేశ్‌ అయ్యర్‌. మొదట కేకేఆర్‌ అతడిన  రూ.20లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే, ఆ ఎడిషన్‌లో అద్బుతంగా రాణించడంతో 2022 వేలానికి ముందు రూ. 8 కోట్లకు అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది. 

ఆ తర్వాత మరో రెండేళ్ల పాటు తమ జట్టుకే ప్రాతినిథ్యం వహించిన వెంకటేష్‌ను ఐపీఎల్‌-2025 వేలంలోకి విడిచిపెట్టి.. భారీ ధరకు తిరిగి జట్టులో చేర్చుకుంది. కాగా ఐపీఎల్‌లో వెంకటేష్ ఇప్పటివరకు ఆడిన 50 మ్యాచ్‌లలో 1326 పరుగులు చేశాడు.

శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో
ఇదిలా ఉంటే.. గతేడాది శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో కేకేఆర్‌ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, వేలానికి ముందు అతడు జట్టును వీడగా.. పంజాబ్‌ కింగ్స్‌ ఏకంగా రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. 

దీంతో కేకేఆర్‌ కెప్టెన్సీ పోస్టు ఖాళీ కాగా.. వెంకటేశ్‌ అయ్యర్‌తో పాటు అజింక్య రహానే కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 22న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కేకేఆర్‌- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌-2025 సీజన్‌కు తెరలేవనుంది. 

చదవండి: Ind vs NZ: ‘కివీస్‌తో మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి ఇవ్వండి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement