
టీమిండియా వైస్ కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధనకు (Smriti Mandhana) హండ్రెడ్ లీగ్ (The Hundred League) ఫ్రాంచైజీ సథరన్ బ్రేవ్ (Southern Brave) షాకిచ్చింది. గత కొంతకాలంగా తమకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంధనను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. గత సీజన్‌లో మంధన విఫలం కావడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. మంధన గత సీజన్‌లో 5 మ్యాచ్‌ల్లో కేవలం 60 పరుగులు మాత్రమే సాధించింది. గత సీజన్‌లో విఫలమైనా మంధనకు హండ్రెడ్ లీగ్‌లో మంచి రికార్డు ఉంది. 2022, 2023 సీజన్లలో ఆమె మంచి స్ట్రయిక్ రేట్‌తో వరుసగా 211, 238 పరుగులు చేసింది.
ఆసక్తికరంగా మంధన ఆర్సీబీ టీమ్ మేట్ అయిన డానీ వ్యాట్‌ను (ఇంగ్లండ్ ఓపెనర్) సథరన్ బ్రేవ్ తొలి రీటెన్షన్‌గా దక్కించుకుంది. వ్యాట్‌తో పాటు లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మయా బౌచియర్, ఫ్రేయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కార్టీన్ కోల్‌మన్, రిహన్నా సౌత్‌బైలను కూడా రీటైన్ చేసుకుంది. రిటెన్షన్ జాబితాను సథరన్ బ్రేవ్ ఇవాళ ప్రకటించింది.
మంధన ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో బిజీగా ఉంది. ఈ సీజన్‌లో ఆమె 4 మ్యాచ్‌ల్లో 122 పరుగులు చేసింది. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. మంధన ఈ సీజన్‌లో తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. ఫలితంగా భారం మొత్తం ఎల్లిస్ పెర్రీపై పడుతుంది. పెర్రీ ఈ సీజన్‌లో విశేషంగా రాణిస్తుంది. నిన్న యూపీతో జరిగిన మ్యాచ్‌లో పెర్రీ అజేయమైన 90 పరుగులు చేసినా ఆర్సీబీ ఓటమిపాలైంది. నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్‌లో యూపీ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఆర్సీబీ ఓటమిపాలైంది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్, ఢిల్లీపై విజయాలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉన్నట్లు కనిపించింది. అయితే ఆతర్వాతి మ్యాచ్‌ల్లో వరుసగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ చేతుల్లో ఓడింది. అయినా ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ముంబై, యూపీ, ఢిల్లీ, గుజరాత్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 25) జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ, గుజరాత్ తలపడనున్నాయి.