వడోదరా వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (డిసెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన (91) తృటిలో సెంచరీ చేజార్చుకుంది.
మరో ఓపెనర్ ప్రతీక రావల్ (40), హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగెజ్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో భారత టెయిలెండర్లు తడబడ్డారు. లేకపోతే టీమిండియా ఇంకా భారీ స్కోర్ చేసుండేది. విండీస్ స్పిన్నర్ జైదా జేమ్స్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటింది. హేలీ మాథ్యూస్ 2, డియోండ్రా డొట్టిన్ ఓ వికెట్ పడగొట్టింది.
కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకోగా.. ప్రస్తుతం వన్డే సిరీస్ సాగుతుంది. డిసెంబర్ 24, 27 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment