
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (110) మెరుపు సెంచరీతో సత్తా చాటగా.. ఆష్లే గార్డ్‌నర్ (50), తహిళ మెక్‌గ్రాత్ (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి (10-2-26-4) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. దీప్తి శర్మ ఓ వికెట్ పడగొట్టింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ బ్యాటర్ ఎల్లిస్ పెర్రీ (4) సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమైంది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 45.1 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. స్మృతి మంధన (105) సూపర్ సెంచరీతో అదరగొట్టినప్పటికీ.. ఆమెకు మరో ఎండ్ నుంచి ఎవరూ సహకరించలేదు. మంధన ఔటైన అనంతరం భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
మంధనతో పాటు హర్లీన్ డియోల్ (39) కాసేపు క్రీజ్‌లో గడిపింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. భారత ఇన్నింగ్స్‌లో మంధన, హర్లీన్‌తో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (12), జెమీమా రోడ్రిగెజ్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్ (10-1-30-5) టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టింది. అలానా కింగ్, మెగాన్ షట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ఓ వికెట్ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment