ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న అభిషేక్‌ తల్లి వ్యాఖ్యలు.. ఆరెంజ్‌ ఆర్మీ మస్త్‌ ఖుష్‌ | SRH Abhishek Sharma Mother Breaks Internet With Reaction To Son Century | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న అభిషేక్‌ తల్లి వ్యాఖ్యలు.. ఆరెంజ్‌ ఆర్మీ మస్త్‌ ఖుష్‌

Published Sun, Apr 13 2025 2:03 PM | Last Updated on Sun, Apr 13 2025 2:57 PM

SRH Abhishek Sharma Mother Breaks Internet With Reaction To Son Century

Photo Courtesy: BCCI/IPL

క్రికెట్‌ ప్రేమికుల్లో.. ముఖ్యంగా ఆరెంజ్‌ ఆర్మీలో ఎక్కడ చూసినా అభిషేక్‌ శర్మ నామస్మరణే.. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ పంజాబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనలోని మాస్టర్‌ క్లాస్‌ను వెలికి తీసి విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.

గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న తన వైఫల్యాలకు తెర దించుతూ బీస్ట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయి.. భారీ సెంచరీ సాధించాడు. కేవలం నలభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న అభిషేక్‌.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా, ఓవరాల్‌గా మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

మొత్తంగా ఈ మ్యాచ్‌లో యాభై ఐదు బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ శర్మ .. పద్నాలుగు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 141 పరుగులు సాధించాడు. తద్వారా ఐపీఎల్‌ మ్యాచ్‌ ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగానూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ ఆల్‌టైమ్‌ రికార్డు సాధించాడు.

ఇలా తన సుడిగాలి ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను గెలిపించి.. తిరిగి విజయాల బాట పట్టించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్‌ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సహచర ఆటగాళ్లు, సన్‌రైజర్స్‌ ఫ్యామిలీతో పాటు అతడి కుటుంబం కూడా సంతోషంలో తేలియాడుతోంది.

కావ్యా మారన్‌తో కలిసి సంబరాలు 
ఇక అభి తల్లిదండ్రులు మంజు శర్మ, రాజ్‌కుమార్‌ శర్మ.. తమ కుమారుడి సెంచరీ పూర్తి కాగానే రైజర్స్‌ యజమాని కావ్యా మారన్‌తో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రైజర్స్‌ విజయానంతరం అభిషేక్‌ శర్మ తల్లి మంజు శర్మ పుత్రోత్సాహంతో పొంగిపోయారు.

జైత్రయాత్ర కొనసాగుతుంది
‘‘ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు.. నేను కూడా ఎంతో ఆనందంగా ఉన్నాను.. మొత్తం హైదరాబాద్‌ అంతా సంతోషంతో నిండిపోయింది.. మనం మ్యాచ్‌ గెలిచాం.. ఇన్నాళ్లు కాస్త మనకు బ్రేక్‌ పడింది... ఇకపై అలాంటిదేమీ ఉండబోదు.. జైత్రయాత్ర కొనసాగుతుంది’’ అని మంజు శర్మ ఆరెంజ్‌ ఆర్మీకి మాటిచ్చారు.

ఈ మేరకు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నాయి. అమ్మ ఆశిర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమే అంటూ ఆరెంజ్‌ ఆర్మీ ఫుల్‌ ఖుషీ అయిపోతూ.. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్‌ చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2025లో ఆరంభ మ్యాచ్‌లో గెలిచిన సన్‌రైజర్స్‌.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది.

అయితే, సొంత మైదానం ఉప్పల్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటింది. తమదైన దూకుడు శైలితో పంజాబ్‌ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని.. 18.3 ఓవర్లలోనే ఊదేసింది. తద్వారా శ్రేయస్‌ అయ్యర్‌ సేనపై కమిన్స్‌ బృందం ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకోగలిగింది.

ఐపీఎల్‌-2025: సన్‌రైజర్స్‌ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్‌
👉టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌.. మొదట బ్యాటింగ్‌
👉పంజాబ్‌ కింగ్స్‌ స్కోరు: 245/6 (20)
👉హైదరాబాద్‌ స్కోరు: 247/2 (18.3)
👉ఫలితం: పంజాబ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ గెలుపు

చదవండి: అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement