మైదానంలోనే మాక్సీ, స్టొయినిస్‌తో గొడవ.. స్పందించిన ట్రవిస్‌ హెడ్‌ | SRH vs PBKS: Head Breaks Silence On Altercation With Maxwell And Stoinis | Sakshi
Sakshi News home page

మాక్సీ, స్టొయినిస్‌తో గొడవ.. స్పందించిన ట్రవిస్‌ హెడ్‌! బెస్ట్‌, వరస్ట్‌ అంటూ..

Published Sun, Apr 13 2025 10:51 AM | Last Updated on Sun, Apr 13 2025 11:31 AM

SRH vs PBKS: Head Breaks Silence On Altercation With Maxwell And Stoinis

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- పంజాబ్‌ కింగ్స్‌ (SRH vs PBKS) మధ్య శనివారం నాటి మ్యాచ్‌ ఆద్యంత ఆసక్తికరంగా సాగింది. ఇరుజట్లు ఉప్పల్‌ మైదానంలో పరుగుల వరద పారిస్తూ.. టీ20 ప్రేమికులకు అసలైన మజా అందించాయి. అయితే, విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన సన్‌రైజర్స్‌ సొంతగడ్డపై పంజాబ్‌పై పైచేయి సాధించి విజయంతో ఈ హోరాహోరీ పోరును ముగించింది.

ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్లు, పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాళ్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (Glenn Maxwell), మార్కస్‌ స్టొయినిస్‌ (Marcus Stoinis).. సహచర ఆటగాడు, సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ అయిన ట్రవిస్‌ హెడ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. పంజాబ్‌ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ ఓపెనర్లు హెడ్‌, అభిషేక్‌ శర్మ ఆది నుంచే దూకుడుగా ఆడారు.

మాక్సీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు
ఈ క్రమంలో తొమ్మిదో ఓవర్లో పంజాబ్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ బంతితో రంగంలోకి దిగాడు. అతడి బౌలింగ్‌లో మొదటి బంతిని ఎదుర్కొన్న హెడ్‌ ఒక పరుగు తీయగా.. మరో బంతికి అభి కూడా సింగిల్‌తో సరిపెట్టుకున్నాడు.

అయితే, ఆ తర్వాత హెడ్‌ గేరు మార్చాడు. మాక్సీ వేసిన మూడో బంతిని 78 మీటర్ల సిక్సర్‌గా మలిచిన ఈ కంగారూ బ్యాటర్‌.. మరుసటి బంతిని మరోసారి మిడ్‌ వికెట్‌గా తరలించి.. 84 మీటర్ల మేర భారీ సిక్సర్‌ నమోదు చేశాడు. దీంతో మాక్సీ విసుగెత్తిన మాక్సీ హెడ్‌ను చూస్తూ ఏదో అన్నాడు. ఆ తర్వాత రెండు బంతులను డాట్‌ చేశాడు.

మాక్సీ, స్టొయినిస్‌తో గొడవ.. స్పందించిన ట్రవిస్‌ హెడ్‌
ఈ క్రమంలో ఓవర్‌ ముగిసిన అనంతరం మాక్స్‌వెల్‌కు హెడ్‌ కూడా గట్టిగానే బదులిచ్చాడు. ఇద్దరూ కలిసి వాగ్వాదానికి దిగగా.. అంపైర్‌ వారిని నవ్వుతూనే సున్నితంగా మందలించాడు. ఇంతలో స్టొయినిస్‌ కూడా మధ్యలోకి వచ్చాడు. హెడ్‌తో అతడూ కాసేపు వాదించి వెళ్లిపోయాడు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ కాగా.. ‘‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు... ఇప్పుడు తమ సహచర ప్లేయర్‌నే స్లెడ్జింగ్‌ చేసేంతగా ఎదిగిపోయారు’’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాక్సీ- స్టొయినిస్‌తో ‘గొడవ’పై ట్రవిస్‌ హెడ్‌ స్పందించాడు.

బెస్ట్‌, వరస్ట్‌ అంటూ..
పంజాబ్‌పై సన్‌రైజర్స్‌ విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘మన గురించి బాగా తెలిసిన వాళ్లే.. మనలోని అధమస్థాయి, అత్యుత్తమ వ్యక్తిత్వాన్ని బయటకు తీయగలరు కదా!.. మా మధ్య వాగ్వాదం అంత తీవ్రమైనది కాదు.. 

ఏదో సరదాగా అలా టీజ్‌ చేసుకున్నాం అంతే’’ అని ట్రవిస్‌ హెడ్‌.. సహచర ఆటగాళ్లతో తనకున్న అనుబంధం గురించి చెప్పాడు. కాగా ట్రవిస్‌ హెడ్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టొయినిస్‌ అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియా తరఫున అగ్రశ్రేణి ఆటగాళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో ట్రవిస్‌ హెడ్‌ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు. యజువేంద్ర చహల్‌ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మరోవైపు అభిషేక్‌ శర్మ విధ్వంసకర శతకం (55 బంతుల్లో 141)తో విరుచుకుపడి సన్‌రైజర్స్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్‌-2025: హైదరాబాద్‌ వర్సెస్‌ పంజాబ్‌
👉పంజాబ్‌ స్కోరు: 245/6 (20)
👉హైదరాబాద్‌ స్కోరు: 247/2 (18.3)
👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో హైదరాబాద్‌ చేతిలో పంజాబ్‌ చిత్తు
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అభిషేక్‌ శర్మ.

చదవండి: అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్‌
ఎగిరి గంతులేసిన కావ్యా మారన్‌.. అభిషేక్‌ తల్లిని హగ్‌ చేసుకుని మరీ! వీడియో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement