
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్ విధించిన 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. పటిష్ట పంజాబ్ బ్యాటర్లను తమ బౌలర్లు అద్బుత రీతిలో కట్టడి చేసినా.. బ్యాటర్ల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా ఓటమిని చవిచూసింది.
ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని.. తన తప్పు వల్లే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయామని అంగీకరించాడు. బౌలర్లు ఎంతో కష్టపడినా.. చెత్త బ్యాటింగ్ వల్ల పంజాబ్ ముందు తలవంచాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
తప్పంతా నాదే..
‘‘మైదానంలో ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఓటమి అన్నింటికంటే ఎక్కువగా బాధిస్తోంది. ఇందుకు పూర్తిగా నేనే బాధ్యుడిని. షాట్ ఎంపికలో పొరపాటు చేశాను. అయితే, అదృష్టవశాత్తూ బాల్ స్టంప్స్‌ను మిస్ అయింది. కానీ లెగ్ బిఫోర్ వికెట్ విషయంలో నాకు స్పష్టత లేదు.
అతడు కూడా నాతో అదే అన్నాడు
అంపైర్ ఎల్బీడబ్ల్యూ (LBW) ఇచ్చిన తర్వాత మరో ఎండ్‌లో ఉన్న అంగ్‌క్రిష్‌తో చర్చించాను. అతడు కూడా అంపైర్స్ కాల్ నిజమవుతుందేమోనని చెప్పాడు. అందుకే ఆ సమయంలో నేను చాన్స్ తీసుకోవాలని అనుకోలేదు. నాకు కూడా పూర్తి స్పష్టత లేదు కాబట్టి రివ్యూకు వెళ్లలేదు.
నిర్లక్ష్య ఆట తీరు వల్లే ఓటమి
మా బ్యాటింగ్ విభాగం ఈ రోజు అత్యంత చెత్తగా ఆడింది. సమిష్టిగా విఫలమయ్యాం. బౌలర్లు ఎంతో కష్టపడి పటిష్ట బ్యాటింగ్ లైనప్‌ను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కానీ మేము మాత్రం వారి కష్టానికి ప్రతిఫలం లేకుండా చేశాం. మా నిర్లక్ష్య ఆట తీరే మా ఓటమికి కారణం.
ఇప్పుడు నా మనసులో ఎన్నో భావాలు చెలరేగుతున్నాయి. సులువుగా ఛేదించగల లక్ష్యాన్ని కూడా మేము దాటలేకపోయాం. మా వాళ్లతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఇంకా సగం టోర్నీ మిగిలే ఉంది. ఏదేమైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి’’ అని అజింక్య రహానే పేర్కొన్నాడు.
రివ్యూకు వెళ్లకుండా తప్పు చేశాడు
కాగా కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదవ ఓవర్‌ను పంజాబ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ వేశాడు. అతడి బౌలింగ్‌లో నాలుగో బంతికి స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రహానే విఫలం కాగా.. బంతి ప్యాడ్‌ను తాకినట్లు కనిపించింది. దీంతో పంజాబ్ అప్పీలు చేయగా.. అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు.
అయితే, రీప్లేలో మాత్రం ఇంపాక్ట్ అవుట్‌సైడ్ ఆఫ్‌గా తేలింది. ఒకవేళ రహానే గనుక రివ్యూకు వెళ్లి ఉంటే నాటౌట్‌గా ఉండేవాడు. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. నిజానికి అప్పటికి కేకేఆర్‌కు ఇంకా రెండు రివ్యూలు మిగిలే ఉండటం గమనార్హం. ఇలా స్వీయ తప్పిదం కారణంగా జట్టు ఓడిపోవడాన్ని తట్టుకోలేక రహానే పైవిధంగా స్పందించాడు.
ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ కేకేఆర్
వేదిక: మహరాజ యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ముల్లన్‌పూర్, చండీగడ్
టాస్: పంజాబ్.. బ్యాటింగ్
పంజాబ్ స్కోరు: 111 (15.3)
కేకేఆర్ స్కోరు: 95 (15.1)
ఫలితం: 16 పరుగుల తేడాతో కేకేఆర్‌పై పంజాబ్ గెలుపు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యజువేంద్ర చహల్ (4/28).
చదవండి: IPL 2025:చరిత్ర సృష్టించిన పంజాబ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి జట్టుగా
𝘈𝘴 𝘥𝘦𝘭𝘪𝘨𝘩𝘵𝘧𝘶𝘭 𝘢𝘴 𝘪𝘵 𝘤𝘢𝘯 𝘨𝘦𝘵 🤌
Ajinkya Rahane & Angkrish Raghuvanshi ignite the #KKR chase with some beautiful sixes 💜
Updates ▶️ https://t.co/sZtJIQoElZ#TATAIPL | #PBKSvKKR pic.twitter.com/YQxJJep9z3— IndianPremierLeague (@IPL) April 15, 2025
The moment where Yuzvendra Chahal turned the game 🪄#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/D2O5ImOSf4
— IndianPremierLeague (@IPL) April 15, 2025