PBKS Vs KKR: చెత్తగా బ్యాటింగ్‌ చేశాం.. నిజమే కదా!: శ్రేయస్‌తో రహానే చాట్‌ వైరల్‌ | "Kya Faaltu Batting Kari...": Ajinkya Rahane Chat With Shreyas Iyer During KKR Vs PBKS Match, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

PBKS Vs KKR: చెత్తగా బ్యాటింగ్‌ చేశాం.. నిజమే కదా!: శ్రేయస్‌తో రహానే చాట్‌ వైరల్‌

Published Wed, Apr 16 2025 12:11 PM | Last Updated on Wed, Apr 16 2025 12:48 PM

Kya Faaltu Batting Kari: Rahane Chat With Shreyas Iyer Goes Viral

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ అంటేనే పరుగుల వరద. తాజా సీజన్‌లోనూ ఇప్పటికే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) మిగిలిన జట్లకు సాధ్యం కాని రీతిలో 286 పరుగులతో సవాల్‌ విసిరింది. రాజస్తాన్‌ రాయల్స్‌పై ఈ మేర భారీ స్కోరు సాధించి.. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు నమోదు చేసింది.

ఇక పంజాబ్‌ కింగ్స్‌ విషయానికొస్తే.. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడ్డ శ్రేయస్‌ సేన.. 245 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరైన రైజర్స్‌ ఆ లక్ష్యాన్ని సునాయాసంగానే ఛేదించడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.

111 పరుగులకే ఆలౌట్‌ అయినప్పటికీ
అయితే, తాజా మ్యాచ్‌లో మాత్రం పంజాబ్‌ అత్యల్ప స్కోరు నమోదు చేసినా.. సంచలన విజయం సాధించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)తో మ్యాచ్‌లో 111 పరుగులకే ఆలౌట్‌ అయినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకుంది. అసాధారణ రీతిలో కేకేఆర్‌ను 95 పరుగులకే ఆలౌట్‌ చేసి.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలుపు బావుటా ఎగురవేసింది.

 

కేకేఆర్‌ స్వీయ తప్పిదాల కారణంగా మ్యాచ్‌ను చేజార్చుకోగా.. ఊహించని విజయం దక్కినందుకు పంజాబ్‌ జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. నిజానికి పంజాబ్‌ విధించిన 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కేకేఆర్‌కు అంత కష్టమేమీ కాదనిపించింది.

రివ్యూకు వెళ్లకుండా
ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్‌ అజింక్య రహానే, అంగ్‌క్రిష్‌ రఘువన్షీ చక్కగా ఆడుతూ మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. కానీ చహల్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ విషయంలో రివ్యూకు వెళ్లకుండా రహానే వెనుదిరగగా..  ఆ తర్వాత కేకేఆర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ వేగంగా పతనమైంది.

ఎంత చెత్తగా బ్యాటింగ్‌ చేశామో!.. నిజమే కదా!
పంజాబ్‌ స్పిన్నర్‌ చహల్‌ అంగ్‌క్రిష్‌ (37), రింకూ సింగ్‌ (2), రమణ్‌దీప్‌ సింగ్‌ (2)లను పెవిలియన్‌కు పంపగా.. వెంకటేశ్‌ అయ్యర్‌ (7)ను మాక్స్‌వెల్‌, ఆండ్రీ రసెల్‌ (17)ను మార్కో యాన్సెన్‌ అవుట్‌ చేయడంతో కేకేఆర్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఇక పంజాబ్‌ చేతిలో అనూహ్య ఓటమి తర్వాత కేకేఆర్‌ ఆటగాళ్లు.. శ్రేయస్‌ సేనతో కరచాలనం చేస్తున్న వేళ.. రహానే చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. పంజాబ్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ను ఆలింగనం చేసుకోవడానికి ముందు.. ‘‘ఎంత చెత్తగా బ్యాటింగ్‌ చేశామో!.. నిజమే కదా!’’ అంటూ రహానే తమ జట్టు ప్రదర్శన తీరు పట్ల నవ్వుతూనే అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌-2025: పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
👉వేదిక: ముల్లన్‌పూర్‌, చండీగడ్‌
👉టాస్‌: పంజాబ్‌ కింగ్స్‌.. తొలుత బ్యాటింగ్‌
👉పంజాబ్‌ కింగ్స్‌ సోరు: 111 (15.3)
👉కోల్‌కతా నైట్‌ రైడర్స్ స్కోరు: 95 (15.1)
👉ఫలితం: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను పదహారు పరుగుల తేడాతో ఓడించిన పంజాబ్‌ కింగ్స్‌
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: యజువేంద్ర చహల్‌ (నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు).

చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement