ఒక్కరికీ కామన్‌ సెన్స్‌ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్‌ ఫైర్‌ | Should Have Used Common Sense: Sehwag Slams Kohli Patidar Other RCB Batters | Sakshi
Sakshi News home page

ఒక్కరికీ కామన్‌ సెన్స్‌ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్‌ ఫైర్‌

Published Sat, Apr 19 2025 1:52 PM | Last Updated on Sat, Apr 19 2025 2:16 PM

Should Have Used Common Sense: Sehwag Slams Kohli Patidar Other RCB Batters

కోహ్లి (PC: BCCI)- సెహ్వాగ్‌ (Instagram)

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) బ్యాటర్ల తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ (Virender Sehwag) ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు పారేసుకున్నారని.. ఒక్కరు కూడా బుద్ధిని ఉపయోగించలేకపోయారంటూ ఘాటుగా విమర్శించాడు.

హోం గ్రౌండ్‌లో వరుస పరాజయాలు 
కాగా సొంత మైదానంలో ఇతర జట్లు ఇరగదీస్తుంటే ఆర్సీబీ మాత్రం.. హోం గ్రౌండ్‌లో వరుస పరాజయాలు నమోదు చేస్తోంది. తాజాగా చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాటిదార్‌ సేన ఓటమిపాలైంది. వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఈ పోరును 14 ఓవర్లకు కుదించారు.

పెవిలియన్‌కు క్యూ 
ఈ క్రమంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే వరుసగా షాకులు తగిలాయి. పంజాబ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (4), విరాట్‌ కోహ్లి (Virat Kohli- 1) వెనువెంటనే వెనుదిరిగారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (23) నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా చహల్‌ అతడిని పెవిలియన్‌కు చేర్చాడు.

 

 డేవిడ్‌ మెరుపుల వల్ల
మిగిలిన వాళ్లలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (4), జితేశ్‌ శర్మ (2), కృనాల్‌ పాండ్యా (1) పూర్తిగా విఫలం కాగా.. ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఆర్సీబీ 14 ఓవర్లలో 95 పరుగులు చేయగలిగింది.

ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడినా నేహాల్‌ వధేరా ధనాధన్‌ ఇన్నింగ్స్‌ (19 బంతుల్లో 33 నాటౌట్‌) కారణంగా.. పంజాబ్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ల తీరుపై వీరేంద్ర సెహ్వాగ్‌ విమర్శలు గుప్పించాడు.

ఒక్కరికీ కామన్‌ సెన్స్‌ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?
‘‘ఆర్సీబీ బ్యాటింగ్‌ మరీ తీసికట్టుగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు నిర్లక్ష్యపు షాట్లు ఆడారు. ఒక్కరంటే ఒక్కరు కూడా.. మంచి బంతికి అవుట్‌ కాలేదు. అంతా సాధారణ బంతులే ఆడలేక పెవిలియన్‌ చేరారు.

ఆర్సీబీ బ్యాటర్లలో ఒక్కరైనా కామన్‌ సెన్స్ ఉపయోగించి ఉంటే బాగుండేది. వాళ్ల చేతిలో గనుక వికెట్లు ఉండి ఉంటే స్కోరు 14 ఓవర్లలో కనీసం 110- 120గా ఉండేది. తద్వారా విజయం కోసం పోరాడే పరిస్థితి ఉండేది. కానీ వీళ్లు మాత్రం చేతులెత్తేశారు.

సొంత మైదానంలో ఆర్సీబీ గెలవలేకపోతోంది. పాటిదార్‌ ఇందుకు పరిష్కారాన్ని కనుగొనాలి. నిజానికి ఆర్సీబీ బౌలర్లు బాగానే ఆడుతున్నారు. కానీ బ్యాటర్లే చిత్రంగా ఉన్నారు. సొంత మైదానంలో అందరూ వరుసగా విఫలమవుతున్నారు’’ అని క్రిక్‌బజ్‌ షోలో సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. 

ఇటు కోహ్లి.. అటు భువీ
కాగా ఈ సీజన్‌లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ నాలుగు గెలిచి పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లోనూ ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు 249 పరుగులు సాధించాడు. 

ఇక కోహ్లి ఓపెనింగ్‌ జోడీ అయిన ఫిల్‌ సాల్ట్‌ 212 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. కెప్టెన్‌ పాటిదార్‌ ఇప్పటికి 209 పరుగులు సాధించాడు. బౌలర్లలో ఆర్సీబీ తరఫున భువనేశ్వర్‌ కుమార్‌ టాప్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో భువీ ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు తీశాడు.

చదవండి: సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్‌ ద్రవిడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement