
యువ ఆటగాడు రజత్ పాటీదార్ సుదీర్ఘ కాలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. రజత్‌ను ఆశీర్వదించాలని ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా పిలుపునిచ్చాడు. గత సీజన్‌లో డు ప్లెసిస్ ఆర్‌సీబీ కెప్టెన్‌గా వ్యవహరించగా... ఈ సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీ సారథ్య బాధ్యతలను రజత్ పాటీదార్‌కు అందించింది.
విరాట్ మాటల్లో..
‘రజత్ పెద్ద బాధ్యతలు అందుకున్నాడు. సుదీర్ఘ కాలం అతడు సారథిగా కొనసాగుతాడు. జట్టును నడిపంచేందుకు అతడికి తగిన వనరులు అందుబాటులో ఉన్నాయి’ అని విరాట్ అన్నాడు. ఇక లీగ్ ఆరంభం (2008) నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి... ఇదంతా ఆర్‌సీబీ అభిమానుల ప్రేమాభిమానాల వల్లే సాధ్యమైందని అన్నాడు. ‘18 సంవత్సరాలుగా ఆర్‌సీబీకి ఆడుతున్నా.
ఇదో అద్భుతమైన అనుభూతి. ప్రతి సీజన్‌కు ముందు అదే ఉత్సాహం నన్ను మరింత ఉత్తేజపరుస్తోంది. జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ఈ బృందంతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్ గెలిచాక అంతర్జాతీయ స్థాయిలో ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ఆ తర్వాత తొలిసారి ఐపీఎల్ ఆడనున్నాడు.
గౌరవం.. ఆనందం.. సక్రమంగా నిర్వర్తిస్తా: పాటీదార్
బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని రజత్ పాటీదార్ అన్నాడు. ‘విరాట్, డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన జట్టుకు సారథిగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది.
వీళ్ల ఆటను చూస్తూనే పెరిగా. చిన్నప్పటి నుంచే ఆర్‌సీబీ అంటే ప్రత్యేక అభిమానం. కెప్టెన్సీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా’ అని ఆర్‌సీబీ జట్టు సోమవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాటీదార్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment