![Rajat Patidar Named RCB Captain Ahead Of IPL 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/patidar.jpg.webp?itok=4HDuTvKg)
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నూతన కెప్టెన్‌ను ప్రకటించింది. వచ్చే సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్ (Rajat Patidar) వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారికంగా వెల్లడించింది. 31 ఏళ్ల పాటిదార్ గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీలో కీలక ప్లేయర్‌గా వ్యవహిరిస్తున్నాడు.
తొలుత ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి మళ్లీ బాధ్యతలు చేపడతాడని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారమంతా ఊహాగానాలే అని తేలిపోయింది. విరాట్‌కు కెప్టెన్సీ చేసే ఉద్దేశం లేకనే పాటిదార్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. పాటిదార్.. గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
పాటిదార్‌కు రంజీల్లో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. పాటిదార్ కొన్ని సందర్భాల్లో ఆర్సీబీ కెప్టెన్‌గానూ (తాత్కాలిక) వ్యవహరించాడు. తాజా పరిణామంతో పాటిదార్ ఆర్సీబీ ఎనిమిదో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతంలో రాహుల్ ద్రవిడ్ (2008), కెవిన్ పీటర్సన్ (2009), అనిల్ కుంబ్లే (2009), డేనియల్ వెటోరీ (2011), విరాట్ కోహ్లి (2011), షేన్ వాట్సన్ (2017), ఫాప్ డుప్లెసిస్ (2022) ఆర్సీబీ కెప్టెన్లుగా వ్యవహరించారు.
2022 నుంచి 2024 వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్‌ను మెగా వేలంలో తిరిగి రీటైన్ చేసుకోకపోవడంతో 2025 సీజన్‌కు ముందు ఆర్సీబీ కెప్టెన్ లేకుండా ఉండింది.
2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పాటిదార్ అప్పటినుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నాడు. పాటిదార్.. తనదైన శైలిలో విధ్వంసం సృష్టించి ఆర్సీబీ మిడిలార్డర్‌లో డ్యాషింగ్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాటిదార్.. స్పిన్ మరియు పేస్ బౌలింగ్‌ను సమర్దవంతంగా ఎదుర్కొంటాడు. ఐపీఎల్ కెరీర్‌లో 27 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్ 158.85 స్ట్రయిక్‌రేట్‌తో 799 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీలు ఉన్నాయి.
పాటిదార్‌ను ఇటీవల ముగిసిన మెగా వేలానికి ముందు ఆర్సీబీ రూ. 11 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంది. ఆర్సీబీ రీటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో పాటిదార్ ఒకడు. పాటిదార్ కాకుండా ఆర్సీబీ విరాట్ కోహ్లి, యశ్ దయాల్‌ను రీటైన్ చేసుకుంది.
కాగా, ఐపీఎల్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా సాధించని విషయం తెలిసిందే. 2009, 2011, 2016లో రన్నకప్‌గా నిలిచిన ఈ జట్టు.. 2015, 2020, 2021, 2022, 2024 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment