నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్‌ కోహ్లి | Should Go To: Kohli Unhappy After Getting Man Of The Match vs PBKS | Sakshi
Sakshi News home page

PBKS vs RCB: నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్‌ కోహ్లి

Published Mon, Apr 21 2025 1:02 PM | Last Updated on Mon, Apr 21 2025 1:23 PM

Should Go To: Kohli Unhappy After Getting Man Of The Match vs PBKS

Photo Courtesy: BCCI

పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (PBKS vs RCB) స్టార్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) అదరగొట్టాడు. ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ దూకుడు శైలికి భిన్నంగా సంయమనంతో ఆడి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అద్భుత అర్ధ శతకంతో మెరిసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

పంజాబ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 54 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 73 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లి 135 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్‌ చేస్తే.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (Devdutt Padikkal) మాత్రం వేగంగా ఆడాడు.

ఈ కేరళ బ్యాటర్‌ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 61 పరుగులు సాధించాడు. ఇక ఆఖర్లో జితేశ్‌ శర్మ సిక్స్‌తో ఆర్సీబీ గెలుపును ఖరారు చేశాడు. ఈ నేపథ్యంలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్న అనంతరం విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

నాకెందుకు?.. ఈ అవార్డుకు అతడే అర్హుడు
‘‘మాకు ఇది అతి ముఖ్యమైన మ్యాచ్‌. రెండు పాయింట్లు కూడా ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించే క్రమంలో ఎంతో ఉపయోగపడతాయి. సొంత మైదానం వెలుపలా మేము అద్భుతంగా ఆడుతున్నాం.

ఈ విషయం ఇక్కడ మరోసారి నిరూపితమైంది. అయితే, ఈరోజు దేవ్‌ ఇన్నింగ్స్‌ వల్లే ఇది సాధ్యమైంది. అతడు భిన్న రీతిలో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. నాకు అభిప్రాయం ప్రకారం ఈ అవార్డుకు అతడే అర్హుడు.

కానీ నాకెందుకు ఇచ్చారో తెలియడం లేదు’’ అంటూ కోహ్లి పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘నేను క్రీజులో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నా పర్లేదు.. ఆ తర్వాత వేగం పెంచి.. ఆఖరిదాకా క్రీజులో ఉండాలనేదే మా వ్యూహం.

మాకు మంచి జట్టు లభించింది
ఈ సీజన్‌లో మాకు మంచి జట్టు లభించింది. వేలంలో మా వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. డేవిడ్‌, టిమ్‌, పాటిదార్‌.. అందరూ తమ పాత్రలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇక రొమారియో షెఫర్డ్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ కూడా ఉండటం మాకు సానుకూలాంశం’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.

కాగా మూడు రోజుల క్రితం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌ ఆర్సీబీని ఓడించింది. అందుకు బదులుగా పంజాబ్‌ సొంత మైదానం ముల్లన్‌పూర్‌లో ఆర్సీబీ ఆదివారం నాటి మ్యాచ్‌లో శ్రేయస్‌ సేనపై ప్రతీకారం తీర్చుకుంది. ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. 

తద్వారా ఈ సీజన్‌లో ఎనిమిదింట ఐదో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది. మరోవైపు.. పంజాబ్‌ కూడా ఎనిమిదింట ఐదు విజయాలు సాధించినా రన్‌రేటు పరంగా వెనుకబడి నాలుగో స్థానంలో ఉంది.

ఐపీఎల్‌-2025: పంజాబ్‌ వర్సెస్‌ ఆర్సీబీ
👉టాస్‌: ఆర్సీబీ.. మొదట బౌలింగ్‌
👉పంజాబ్‌ స్కోరు: 157/6 (20)
👉ఆర్సీబీ స్కోరు: 159/3 (18.5)
👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించిన ఆర్సీబీ.

చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్‌ అయ్యర్‌!.. వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement