నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్‌ | Pehle Merese Pucho Na: Shreyas Iyer Loses Cool Lashes Out Umpire Why | Sakshi
Sakshi News home page

నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్‌ అయ్యర్‌

Published Sun, Apr 13 2025 1:10 PM | Last Updated on Sun, Apr 13 2025 1:35 PM

Pehle Merese Pucho Na: Shreyas Iyer Loses Cool Lashes Out Umpire Why

Photo Courtesy: BCCI/JioHotstar

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు చేదు అనుభవమే మిగిలింది. ధనాధన్‌ బ్యాటింగ్‌తో దంచికొట్టినా.. ఆతిథ్య జట్టు ఓపెనింగ్‌ జోడీ ‘ట్రావిషేక్‌’ (Travis Head- Abhishek Sharma)  చెలరేగడంతో శ్రేయస్‌ అయ్యర్‌ సేనకు పరాజయం తప్పలేదు. ఈ విధ్వంసకర బ్యాటర్లను కట్టడి చేసేందుకు పంజాబ్‌ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు.

భావోద్వేగాల డోలికల్లో
ఫలితంగా రైజర్స్‌ చేతిలో పంజాబ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాళ్లు భావోద్వేగాల డోలికల్లో తేలిపోయారు. ముఖ్యంగా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన తర్వాత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer- 36 బంతుల్లో 82) ముఖం సంతోషంతో వెలిగిపోయింది.

ఇక లోయర్‌ ఆర్డర్‌లో మార్కస్‌ స్టొయినిస్‌ (11 బంతుల్లో 34 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి.. స్కోరును 230 దాటించిన వేళ పంజాబ్‌ శిబిరంలో నవ్వులు పూశాయి. అయితే, ఈ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు.

 

ఆకాశమే హద్దుగా
పంజాబ్‌ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. పంజాబ్‌ ఫీల్డర్ల తప్పిదాలను క్యాష్‌ చేసుకుని మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలుపుతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.

ట్రవిస్‌ హెడ్‌ 37 బంతుల్లో 66 పరుగులతో దుమ్ములేపగా.. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో ఏకంగా 14 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 141 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో హెన్రిచ్‌ క్లాసెన్‌ (14 బంతుల్లో 21*), ఇషాన్‌ కిషన్‌ (6 బంతుల్లో 9*) కలిసి రైజర్స్‌ గెలుపును ఖరారు చేశారు. దీంతో పంజాబ్‌ ఆటగాళ్ల ముఖాలు వెలిసిపోయాయి.

ముందు నన్ను అడగాలి కదా!
ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా బౌలర్ల వైఫల్యం, ఫీల్డర్ల తప్పిదాల కారణంగా పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కోపం నషాళానికి అంటింది. ముఖ్యంగా గ్లెన్‌ మాక్స్‌వెల్‌, అంపైర్‌ చేసిన పనితో అతడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ను స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మాక్సీ వేశాడు.

అయితే, ఆ ఓవర్లో లెగ్‌ సైడ్‌ దిశగా సంధించిన ఫ్లాటర్‌ డెలివరీ (రెండో బంతి) అంపైర్‌ వైడ్‌గా ప్రకటించడం మాక్సీకి రుచించలేదు. దీంతో అతడు రివ్యూ (డీఆర్‌ఎస్‌) తీసుకోవాలనే ఉద్దేశంతో ‘T’ సంజ్ఞ చూపించాడు. అంపైర్‌ అందుకు అంగీకరించగా.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు కోపం వచ్చింది.

సాధారణంగా ఫీల్డింగ్‌ టీమ్‌ రివ్యూ విషయంలో ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ కెప్టెన్‌ నిర్ణయం తర్వాతే స్పందిస్తాడు. కానీ ఇక్కడ అలా జరుగలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రేయస్‌ అయ్యర్‌.. ‘‘అంపైర్‌.. ముందు నన్ను అడగాలి కదా.. నన్ను.. నన్ను అడగాలి కదా!’’ అంటూ తనవైపు వేలు చూపిస్తూ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఐపీఎల్‌-2025: హైదరాబాద్‌ వర్సెస్‌ పంజాబ్‌
👉వేదిక: రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, ఉప్పల్‌, హైదరాబాద్‌
👉టాస్‌: పంజాబ్‌.. తొలుత బ్యాటింగ్‌
👉పంజాబ్‌ స్కోరు: 245/6 (20)
👉హైదరాబాద్‌ స్కోరు: 247/2 (18.3)
👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో హైదరాబాద్‌ చేతిలో పంజాబ్‌ చిత్తు
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అభిషేక్‌ శర్మ.

చదవండి: అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్‌
నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్‌ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement