ఎగిరి గంతులేసిన కావ్యా.. అభిషేక్‌ తల్లిని హగ్‌ చేసుకుని మరీ! వీడియో | Kavya Maran Hugs Abhishek Sharma Mother After His Century Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఎగిరి గంతులేసిన కావ్యా మారన్‌.. అభిషేక్‌ తల్లిని హగ్‌ చేసుకుని మరీ! వీడియో

Published Sun, Apr 13 2025 9:10 AM | Last Updated on Sun, Apr 13 2025 10:54 AM

Kavya Maran Hugs Abhishek Sharma Mother After His Century Video Goes Viral

Photo Courtesy: BCCI

అభిషేక్‌ శర్మ... వరుస వైఫల్యాలకు చెక్‌ పెడుతూ అభిమానులను ఉర్రూతలూగించాడు.. ఉప్పల్‌లో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ పరుగుల దాహం తీర్చుకున్నాడు.. నలభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ‘‘ఇది ఆరెంజ్‌ ఆర్మీ కోసం’’ అంటూ రాసిన పేపర్‌ చూపిస్తూ ఫ్యాన్స్‌ సంతోషం కోసం తాము ఎంతగా శ్రమిస్తున్నామో శతకనాదంతో చాటిచెప్పాడు.

పంజాబ్‌ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ అభిషేక్‌ తన చేతికే బ్యాట్‌ మొలిచిందా అన్నట్లు అలవోకగా అలా షాట్లు బాదుతూ.. ప్రేక్షకులకు పైసా వసూల్‌ ప్రదర్శన ఇచ్చాడు. అతడలా ఫోర్లు, సిక్స్‌లు కొడుతుంటే పంజాబ్‌ బ్యాటర్లు అలా చూస్తూ ఉండిపోయారే తప్ప అతడి దూకుడుకు కళ్లెం వేయలేకపోయారు.

ఈ క్రమంలో మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ శర్మ 141 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా పద్నాలుగు ఫోర్లు, పది సిక్సర్లు ఉండటం విశేషం. అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో ప్రవీణ్‌ దూబేకు క్యాచ్‌ ఇవ్వడంతో అభి తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అయితే, క్రీజులో ఉన్నంత సేపు చక్కటి షాట్లతో అలరించిన అభిషేక్‌ను చూస్తూ అభిమానులు మురిసిపోయారు.

ఎగిరి గంతులేస్తూ.. అభిషేక్‌ ల్లి ఆలింగనం చేసుకుని
ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు యజమాని కావ్యా మారన్‌ ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి. అభి సెంచరీ పూర్తి చేసుకోగానే ఆమె సంబరాలు అంబరాన్నంటాయి. సీట్లో నుంచి లేచి ఎగిరి గంతులేస్తూ కావ్య.. కరతాళధ్వనులతో అభిని అభినందించింది. పక్కనే ఉన్న రైజర్స్‌ మద్దతుదారులతో కరచాలం చేసిన కావ్య.. అభిషేక్‌ ల్లి ఆలింగనం చేసుకుని సంతోషాన్ని పంచుకుంది. 

ఎన్నాళ్లకెన్నాళ్లకు..
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కావ్యా కళ్లలో ఆనందం.. ఈరోజు అభిషేక్‌ శర్మదే.. సన్‌రైజర్స్‌ది... ఆరెంజ్‌ ఆర్మీకి కన్నుల విందు అందించారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కాగా ఐపీఎల్‌-2025లో తమ ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలిచిన సన్‌రైజర్స్‌ .. ఆ తర్వాత వరుసగా నాలుగు ఓటములు చవిచూసింది.

ఈ క్రమంలో శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో తలపడ్డ ప్యాట్‌ కమిన్స్‌ బృందం తమదైన శైలిలో కమ్‌బ్యాక్ ఇచ్చింది. సొంత మైదానం ఉప్పల్‌లో టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన రైజర్స్‌.. బౌలర్లు పెద్దగా రాణించకపోవడంతో భారీగానే పరుగులు ఇచ్చుకుంది.

పంజాబ్‌ ఫటాఫట్‌
పంజాబ్‌ బ్యాటర్లలో ఓపెనర్లు ప్రియాన్ష్‌ ఆర్య (13 బంతుల్లో 36), ప్రభ్‌సిమ్రన్‌సింగ్‌ (23 బంతుల్లో 42) దంచికొట్టగా.. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (36 బంతుల్లో 82)తో చెలరేగాడు. మిగతా వాళ్లలో నేహల్‌ వధేరా (27), మార్కస్‌ స్టొయినిస్‌ (11 బంతుల్లో 34 నాటౌట్‌) రాణించారు.

రైజర్స్‌ రైట్‌ రైట్‌
ఇక లక్ష్య ఛేదనను దూకుడుగా ఆరంభించిన సన్‌రైజర్స్‌ 18.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లలో ట్రవిస్‌ హెడ్‌ (37 బంతుల్లో 66) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. అభిషేక్‌ శర్మ (55 బంతుల్లో 141) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ (14 బంతుల్లో 21), ఇషాన్‌ కిషన్‌ (6 బంతుల్లో 9) కలిసి జట్టు విజయాన్ని ఖరారు చేశారు.

చదవండి: IPL 2025: చ‌రిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి క్రికెట‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement