భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు వన్డే సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు మంధనతో పాటు బెలిండ క్లార్క్ (1997), మెగ్ లాన్నింగ్ (2016), ఆమీ సాటర్త్‌వైట్ (2016), సోఫీ డివైన్ (2018), సిద్రా అమీన్ (2022), నాట్ సీవర్ బ్రంట్ (2023), లారా వోల్వార్డ్ట్ (2024) పేరిట సంయుక్తంగా ఉండేది. వీరంతా ఓ క్యాలెండర్ ఇయర్‌లో తలో మూడు వన్డే సెంచరీలు చేశారు.
తాజాగా మంధన తన తోటి వారందరినీ అధిగమించి ఈ ఏడాది నాలుగో వన్డే సెంచరీ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో మంధన ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది మంధన సౌతాఫ్రికాపై రెండు (117, 136), న్యూజిలాండ్ (100), ఆస్ట్రేలియాపై (105) తలో సెంచరీ చేసింది. మంధన ఈ ఏడాది చేసిన సెంచరీల్లో మూడు స్వదేశంలో సాధించినవి కాగా.. ఒకటి ఆస్ట్రేలియాలో చేసింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో మంధన 109 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 105 పరుగులు చేసింది. ఈ సెంచరీ మంధనకు వన్డేల్లో తొమ్మిదవది. ఆసీస్‌తో మ్యాచ్‌లో మంధన సెంచరీతో కదంతొక్కినా టీమిండియా ఓటమిపాలైంది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. మంధన ఔట్ కాగానే చకచకా వికెట్లు కోల్పోయింది. 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 215 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమితో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్ 0-3 తేడాతో కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment