Asia cup 2025: అభిషేక్‌ విధ్వంసం.. ఫైనల్లో టీమిండియా | India Beat Bangladesh In Asia Cup 2025 Super 4 Match, Check Out Highlights And Score Details | Sakshi
Sakshi News home page

Asia Cup 2025: అభిషేక్‌ విధ్వంసం.. సత్తా చాటిన బౌలర్లు.. ఫైనల్లో టీమిండియా

Sep 24 2025 11:43 PM | Updated on Sep 25 2025 9:13 AM

India beat bangladesh in Asia cup 2025 super 4 match

ఆసియా కప్‌ 2025లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 24) జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్‌ ఫైనల్‌కు చేరడమే కాకుండా శ్రీలంకను టోర్నీ నుంచి ఎలిమినేట్‌ చేసింది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య రేపు జరుగబోయే మ్యాచ్‌లో విజేత ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్‌) మంచి ఆరంభాన్ని ఇచ్చినా టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.

అభిషేక్‌ క్రీజ్‌లో ఉండగా భారత్‌ స్కోర్‌ 200 పరుగులు దాటుతుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔట్‌ కావడంతో పరిస్థితి తారుమారైంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బంతులు వృధా చేసి (11 బంతుల్లో 5) ఔటయ్యాడు. అంతకుముందే శివమ్‌ దూబే (2) నిరాశపరిచాడు.

తిలక్‌ వర్మ (7 బంతుల్లో 5) కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. హార్దిక్‌ పాండ్యా (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ.. వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. అక్షర్‌ పటేల్‌ (15 బంతుల్లో 10 నాటౌట్‌) దారుణంగా ఆడాడు. చివరి ఓవర్‌లో బంతులు వృధా చేసి భారత్‌ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమయ్యేలా చేశాడు.

తొలి 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసిన భారత్‌.. చివరి 9 ఓవర్లలో కేవలం 56 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.

అనంతరం 169 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బరిలోకి దిగిన భారత్‌.. ఆది నుంచే ప్రత్యర్ధిపై ఒత్తిడి తెచ్చింది. బుమ్రా (4-0-18-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-29-2), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-18-3), అక్షర్‌ పటేల్‌ (4-0-37-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. వీరి ధాటికి బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. 

బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ సైఫ్‌ హసన్‌ (69) ఒంటరిపోరాటం చేశాడు. అతనితో పాటు పర్వేజ్‌ హొస్సేన్‌ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సెప్టెంబర్‌ 26న జరిగే నామమాత్రపు మ్యాచ్‌లో భారత్‌.. శ్రీలంకతో తలపడుతుంది. సెప్టెంబర్‌ 28న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement