
బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం
ఆసియా కప్ 2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది.
భారత్ తరఫున అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మరోసారి విధ్వంసం సృష్టించగా.. బంగ్లాదేశ్ తరఫున సైఫ్ హసన్ (69) ఒంటరిపోరాటం చేశాడు.
ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
15.2వ ఓవర్- 109 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి సైఫుద్దీన్ (4) ఔటయ్యాడు.
ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
12.3వ ఓవర్- 87 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ జాకిర్ అలీ (4) రనౌటయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
10.4వ ఓవర్-74 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి షమీమ్ హొస్సేన్‌ను (0) క్లీన్ బౌల్డ్ చేశాడు. 11 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 75/4గా ఉంది. జాకిర్ అలీ (1), సైఫ్ హసన్ (40) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే 54 బంతుల్లో 94 పరుగులు చేయాలి.
టార్గెట్ 169.. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
1.2వ ఓవర్- 5 పరుగుల వద్దనే బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో శివమ్ దూబే క్యాచ్ పట్టడంతో తంజిద్ హసన్ (1) ఔటయ్యాడు.
ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (75), శుభ్‌మన్ గిల్ (29) క్రీజ్‌లో ఉన్నంత సేపు పరుగులు పెట్టిన స్కోర్ బోర్డు, ఆతర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులకే పరిమితమైంది.
అభిషేక్, గిల్ తర్వాత హార్దిక్ పాండ్యా (38) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. అఖరి ఓవర్‌లో అక్షర్ పటేల్ (15 బంతుల్లో 10 నాటౌట్) బంతులు వృధా చేశాడు. శివమ్ దూబే (2), సూర్యకుమార్ యాదవ్ (5), తిలక్ వర్మ (5) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 2, తంజిమ్ హసన్, ముస్తాఫిజుర్, సైఫుద్దీన్ తలో వికెట్ తీశారు.
నిదానించిన భారత స్కోర్
వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో భారత స్కోర్ నిదానించింది. 16 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 135 పరుగులుగా ఉంది. హార్దిక్ పాండ్యా (12), అక్షర్ పటేల్ (4) క్రీజ్‌లో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
11.6వ ఓవర్-114 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (5) ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
11.1వ ఓవర్- 112 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) అనూహ్యంగా రనౌటయ్యాడు.
10 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 96/2
10 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 96/2గా ఉంది. అభిషేక్ శర్మ 60 (32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (3) క్రీజ్‌లో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
8.1వ ఓవర్-83 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రిషద్ హొసేన్ బౌలింగ్‌లో శివమ్ దూబే (2) ఔటయ్యాడు.
అభిషేక్ మెరుపు అర్ద శతకం
అభిషేక్ శర్మ మరో సారి బ్యాట్ ఝులిపించాడు. 25 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 8 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 83/1గా ఉంది. అభిషేక్‌తో పాటు శివమ్ దూబే (2) క్రీజ్‌లో ఉన్నాడు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
6.2వ ఓవర్- 77 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. రిషద్ హోసేన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో శుభ్‌మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాడు. మరో ఎండ్‌లో అభిషేక్ 46 (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పూనకాలు ఎత్తి ఉన్నాడు. అతనికి జతగా శివమ్ దూబే క్రీజ్‌లోకి వచ్చాడు.
గేర్ మార్చిన అభిషేక్, గిల్
3 ఓవర్ల వరకు నిదానంగా ఆడిన భారత ఓపెనర్లు అభిషేక్, గిల్ ఆతర్వాత ఒక్కసారిగా గేర్ మార్చారు. 4,5,6 ఓవర్లలో ఏకంగా 55 పరుగులు పిండుకున్నారు. ఫలితంగా 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 72/0గా ఉంది. అభిషేక్ 46 (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ 25 (17 బంతుల్లో ఫోర్, సిక్స్) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
ఆచితూచి ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు
భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ తమ సహజ శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ నెమ్మదించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అభిషేక్ 8 బంతుల్లో కేవలం ఒకే బౌండరీతో 8 పరుగులు చేయగా.. గిల్ 10 బంతుల్లో బౌండరీలు లేకుండా 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 17/0గా ఉంది.
ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు బంగ్లా కెప్టెన్ లిట్టన్ దాస్ దూరమయ్యాడు. ప్రాక్టీస్ సందర్భంగా అతను గాయపడినట్లు తాత్కాలిక కెప్టెన్ జాకిర్ అలీ తెలిపాడు.
తుది జట్లు..
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
బంగ్లాదేశ్: సైఫ్ హసన్, తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ(వికెట్‌కీపర్/కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్