నవీ ముంబై వేదికగా వెస్టిండీస్ మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధన 41 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసింది.
వికెట్‌కీపర్ రిచా ఘోష్ 17 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసింది. దీప్తి శర్మ (15 బంతుల్లో 17; 2 ఫోర్లు), జెమీమా రోడ్రిగెజ్ (15 బంతుల్లో 13; 2 ఫోర్లు) రెండంకెల స్కోర్లు చేశారు. మంధన క్రీజ్‌లో ఉండగా భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే మంధన ఔటైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది.
మధ్యలో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. భారత ఇన్నింగ్స్‌లో ఉమా ఛెత్రి 4, రాఘ్వి బిస్త్ 5, సంజీవన్ సజనా 2, రాధా యాదవ్ 7, సైమా ఠాకోర్ 6 పరుగులు చేసి ఔటయ్యారు. టిటాస్ సాధు 1, రేణుకా ఠాకూర్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.
విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, చిన్నెల్ హెన్రీ, డియాండ్రా డొట్టిన్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గైర్హాజరీ కాగా, స్మృతి మంధన టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 49 పరుగుల తేడాతో గెలుపొందింది. స్మృతి మంధన తొలి మ్యాచ్‌లో కూడా అర్ద సెంచరీతో (54) మెరిసింది.
Comments
Please login to add a commentAdd a comment