
నేడు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్
అమితోత్సాహంతో టీమిండియా
ఒత్తిడిలో పాక్ బృందం
మ.గం.2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
గత పద్నాలుగేళ్ల కాలంలో వన్డేలు, టి20లు కలిపి భారత్, పాకిస్తాన్ మధ్య 13 మ్యాచ్‌లు జరిగితే భారత్ 11 గెలిచి 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమిపాలైంది... ఇరు జట్ల మధ్య జరిగిన గత 11 వన్డేల్లో భారత్ 9 గెలిచి 2 ఓడింది...ఇది చాలు దాయాదిపై టీమిండియా ఆధిపత్యం ఎలా సాగుతోందో చెప్పడానికి...
అయినా సరే...అంతర్జాతీయ క్రికెట్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రతీ సారి అంతే ఉత్సుకత రేపుతుంది... ఆటగాళ్లు, అభిమానులు, ప్రసారకర్తలు, విశ్లేషకులు... ఇలా అందరి దృష్టిలో ఇది ఎంతో ప్రత్యేకమైన సమరం. తుది ఫలితంతో సంబంధం లేకుండా దాయాదుల మధ్య పోరు అంటే ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోతుంది.
ఆదివారం ఆటవిడుపు వేళ మరో సారి భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆతిథ్య జట్టే అయినా... ఈ మ్యాచ్ కోసం పాక్ దుబాయ్ చేరగా, ఇప్పటికే ఈ వేదికపై ఒక మ్యాచ్ గెలిచిన టీమిండియా ఉత్సాహంగా సిద్ధమైంది. భారత్ గెలిస్తే దాదాపు సెమీస్ చేరుకుంటుంది. పాక్‌కు మాత్రం టోర్నీనుంచి నిష్క్రమించకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్య.
దుబాయ్: వన్డే వరల్డ్ కప్‌లో తలపడిన దాదాపు 16 నెలల తర్వాత మరో ఐసీసీ టోర్నీలో భారత్, పాకిస్తాన్ వన్డే సమరానికి సై అంటున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లు నేడు తలపడతాయి. భారత్ తొలి తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేయగా... పాక్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాజయంపాలైంది. బలాబలాలు, ఫామ్‌పరంగా చూస్తే అన్ని విధాలా రోహిత్ సేనదే పైచేయిగా ఉన్నా... అనూహ్య ప్రదర్శనతో చెలరేగాలని పాకిస్తాన్ భావిస్తోంది.
మార్పుల్లేకుండా...
గత మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలతో గిల్ తన ఫామ్‌ను చాటి చెప్పగా, రోహిత్ శర్మ అందించే శుభారంభాలు జట్టును ముందంజలో నిలుపుతున్నాయి. విరాట్ కోహ్లి మాత్రమే కాస్త తడబడినట్లు కనిపిస్తున్నాడు. ఇంకా తనదైన స్థాయి ఆటను విరాట్ ప్రదర్శించలేదు. దాని కోసం ఇంతకంటే మంచి వేదిక ఉండదు.
రాహుల్ బంగ్లాతో ఆకట్టుకున్నాడు. అయ్యర్ కూడా చెలరేగితే భారీ స్కోరు ఖాయం. పాండ్యా, జడేజా బ్యాటింగ్ అవసరం రాకుండానే మన జట్టు గత మ్యాచ్‌ను ముగించింది. అక్షర్ బ్యాటింగ్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ మరోసారి నమ్మకం ఉంచుతోంది. బౌలింగ్‌లో షమీ అద్భుత పునరాగమనం భారత్ బలాన్ని ఒక్కసారిగా పెంచింది.
బంగ్లాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో అతను తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. షమీకి తోడుగా హర్షిత్ రాణా ఆకట్టుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్, జడేజాలను ఎదుర్కొని పాక్ బ్యాటర్లు పరుగులు సాధించడం అంత సులువు కాదు. మొత్తంగా టీమిండియా ఆటగాళ్లంతా సమష్టి ప్రదర్శన చేస్తే తిరుగుండకపోవచ్చు.
గెలిపించేదెవరు!
పాకిస్తాన్ జట్టు పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. స్వదేశంలో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలో రెండుసార్లు న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆ జట్టు ఇప్పడు ఈ మెగా టోర్నీ తొలి పోరులోనూ ఓటమిపాలైంది. పైగా భారీ తేడాతో ఓడటం వల్ల రన్‌రేట్‌పై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా భారత్‌తో మ్యాచ్‌లో గెలిస్తేనే ఆ జట్టు టోర్నీలో నిలుస్తుంది. లేదంటే ఆతిథ్య జట్టుగా సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడే సమయానికి పాక్ ఆట ముగిసిపోతుంది.
జట్టు బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. ఎన్ని వైఫల్యాలున్నా ఇప్పటికీ టీమ్ నంబర్‌వన్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌పైనే ప్రధానంగా ఆధారపడుతోంది. కానీ గత మ్యాచ్‌లో కూడా అతను చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఈ సారి అతని ప్రదర్శన మెరుగవుతుందేమో చూడాలి. ఫఖర్ గాయంతో దూరం కావడంతో టీమ్‌లోకి వచ్చిన ఇమామ్ కూడా దూకుడుగా ఆడలేడు. రిజ్వాన్, షకీల్ గత మ్యాచ్‌లో విఫలమయ్యారు.
సల్మాన్, ఖుష్‌దిల్ ప్రదర్శన సానుకూలాంశం. మరో వైపు బౌలింగ్ అయితే మరీ పేలవంగా ఉంది. పాక్ ఎంతో నమ్ముకున్న ముగ్గురు పేసర్లు పోటీ పడి భారీగా పరుగులిస్తున్నారు. ఇటీవలి రికార్డు చూసినా...షాహిన్ అఫ్రిది, రవూఫ్, నసీమ్‌లను భారత బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. పైగా ఒక్క నాణ్యమైన స్పిన్నర్ కూడా జట్టులో లేడు. ఈ నేపథ్యంలో పాక్ గెలవాలంటే అసాధారణ పోరాటం చేయాల్సి ఉంది.
23 వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్‌లలో పాక్‌పై భారత్ ఆధిపత్యం ఉన్నా...చాంపియన్స్ ట్రోఫీలో పాక్ రికార్డు మెరుగ్గా ఉంది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరిగితే భారత్ 2 గెలిచి 3 ఓడింది.
57 - 73 ఓవరాల్‌గా భారత్, పాకిస్తాన్ మధ్య 135 వన్డేలు జరగ్గా...భారత్ 57 గెలిచి 73 ఓడింది. మరో 5 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.
పిచ్, వాతావరణం
గత మ్యాచ్ తరహాలోనే నెమ్మదైన పిచ్. కానీ బ్యాటర్లు పట్టుదలగా ఆడితే భారీ స్కోరు సాధించవచ్చు. వర్ష సమస్య లేదు. మంచు ప్రభావం కూడా లేదు కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, అక్షర్, పాండ్యా, జడేజా, కుల్దీప్, షమీ, రాణా.
పాకిస్తాన్: రిజ్వాన్ (కెప్టెన్), ఇమామ్, షకీల్, బాబర్, సల్మాన్, తాహిర్, ఖుష్‌దిల్, అఫ్రిది, నసీమ్, రవూఫ్, అబ్రార్.
Comments
Please login to add a commentAdd a comment