
స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy-2025) పాకిస్తాన్ (Pakistan) వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఖంగుతిన్న దాయాది.. భారత్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతిలో ఓడినా పాక్ సెమీస్‌కు చేరే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.
న్యూజిలాండ్‌తో నేడు (ఫిబ్రవరి 24) జరుగబోయే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించాలి. అలాగే ఫిబ్రవరి 27వ తేదీన జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాక్ ఘన విజయం సాధించాలి. దీంతో పాటు మార్చి 2న జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించాలి. ఇలా జరిగితే గ్రూప్-ఏలో పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తలో రెండు పాయింట్లు కలిగి ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా రెండో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఈ లెక్కన పాక్ సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నట్లే.
ఒకవేళ నేటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో బంగ్లాదేశ్ ఓడితే మాత్రం పాక్ మిగతా మ్యాచ్‌లతో సంబంధం లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో పాక్ బంగ్లాదేశ్‌పై ఎంతటి భారీ విజయం సాధించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి పాక్ టోర్నీలో సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌ను ఓడించాలి.
కాగా, దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ చేసి భారత్‌ను గెలిపించాడు. పాక్ నిర్దేశించిన 242 పరుగుల సాధారణ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. కోహ్లి వన్డేల్లో 51వ సెంచరీతో, ఓవరాల్‌గా 82వ సెంచరీతో మెరిపించాడు. భారత్‌ను గెలిపించడంలో శ్రేయస్ అయ్యర్ (56), శుభ్‌మన్ గిల్ (46), కుల్దీప్ యాదవ్ (9-0-40-3), హార్దిక్ పాండ్యా (8-0-31-2) తమవంతు పాత్రలు పోషించారు.
ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకున్నట్లే. తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన టీమిండియా.. 4 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం భారత నెట్ రన్‌రేట్ 0.647గా ఉంది. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ రన్‌రేట్ (1.200) భారత్ కంటే కాస్త మెరుగ్గా ఉంది.
భారత్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు.
పాక్ 47 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. రిజ్వాన్, షకీల్ క్రీజ్‌లో ఉండగా భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో పాక్ తిరిగి కోలుకోలేకపోయింది. ఈ దశలో భారత బౌలర్లు రెచ్చిపోవడంతో పాక్ వరుస క్రమాల్లో వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్‌కు పరిమితమైంది. భారత బౌలర్లలో కుల్దీప్, హార్దిక్‌తో పాటు హర్షిత్ రాణా (7.4-0-30-1), అక్షర్ పటేల్ (10-0-49-1), రవీంద్ర జడేజా (7-0-40-1) కూడా వికెట్లు తీశారు.
అనంతరం బరిలోకి దిగిన భారత్.. 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ (20), శుభ్‌మన్ గిల్ (46) ఓ మోస్తరు ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ తన సహజ శైలిలో షాట్లు ఆడి క్రీజ్‌లో ఉన్న కొద్ది సేపు అలరించాడు. గిల్.. సెంచరీ హీరో విరాట్ కోహ్లితో కలిసి భారత్ గెలుపుకు బాటలు వేశాడు. గిల్ ఔటయ్యాక శ్రేయస్ విరాట్ జత కలిశాడు. వీరిద్దరు మూడు వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ గెలుపును ఖరారు చేశారు.
ఆఖర్లో కోహ్లి సెంచరీ పూర్తి చేస్తాడా లేదా అన్న ఉత్కంఠ నెలకొని ఉండింది. అయితే అక్షర్ పటేల్ లెక్కలు చూసుకుని సెంచరీ పూర్తి చేసేందుకు కోహ్లికి స్ట్రయిక్ ఇచ్చాడు. కోహ్లి బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment