CT 2025: టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ | Fakhar Zaman Ruled Out Of Champions Trophy 2025, Replacement Announced | Sakshi
Sakshi News home page

CT 2025: టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ

Published Thu, Feb 20 2025 12:18 PM | Last Updated on Thu, Feb 20 2025 12:28 PM

Fakhar Zaman Ruled Out Of Champions Trophy 2025, Replacement Announced

స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌కు చేదు ఆరంభం లభించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్‌ చిత్తుగా ఓడింది. ఓటమి బాధలో ఉన్న పాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫీల్డింగ్‌ చేస్తుండగా గాయపడిన ఫకర్‌ జమాన్‌ భారత్‌తో జరుగబోయే కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. జమాన్‌కు ప్రత్యామ్నాయంగా ఇమామ్‌ ఉల్‌ హాక్‌ పేరును ప్రకటించింది పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు. 

భారత్‌తో మ్యాచ్‌కు జమాన్‌ దూరం కావడం పాక్‌కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. ఈ టోర్నీలో పాక్‌ సెమీస్‌కు చేరాలంటే భారత్‌తో సహా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాల్సి ఉంది.

గాయపడినా బరిలోకి దిగిన జమాన్‌
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ సందర్భంగా గాయపడిన ఫకర్‌ జమాన్‌.. ఆతర్వాత కొద్ది సేపు రెస్ట్‌ తీసుకుని బ్యాటింగ్‌కు దిగాడు. అయితే జమాన్‌ తన రెగ్యులర్‌ ఓపెనింగ్‌ స్థానంలో కాకుండా నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు జమాన్‌ చాలా ఇబ్బందిపడ్డాడు. 41 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసిన అనంతరం బ్రేస్‌వెల్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

జమాన్‌.. ఛాతీలో కండకాల నొప్పితో బాధపడుతున్నట్లు పాక్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. జమాన్‌.. భారత్‌తో మ్యాచ్‌కు మాత్రమే దూరంగా ఉంటాడా, లేక టోర్నీ మొత్తానికి దూరమయ్యాడా అన్న విషయంపై క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 60 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. ఓపెనర్‌ విల్‌ యంగ్‌ (107), వికెట్‌కీపర్‌ టామ్‌ లాథమ్‌ (118 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో డెవాన్‌ కాన్వే (10), కేన్‌ విలియమ్సన్‌ (1), డారిల్‌ మిచెల్‌ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ చివర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. పాక్‌ బౌలర్లలో నసీం షా, హరీస్‌ రౌఫ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అబ్రార్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌ పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రౌఫ్‌ 10 ఓవర్లలో ఏకంగా 83 పరుగులిచ్చాడు.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. చాలా నిదానంగా బ్యాటింగ్‌ చేసింది. పాక్‌ ఏ దశలోనూ గెలవాలన్న ఆసక్తితో బ్యాటింగ్‌ చేయలేదు. బాబర్‌ ఆజమ్‌ (64) బ్యాటింగ్‌ నత్త నడకను తలపించింది. సౌద్‌ షకీల్‌ (6), కెప్టెన్‌ రిజ్వాన్‌ (3), తయ్యబ్‌ తాహిర్‌ (1) దారుణంగా విఫలమయ్యారు. ఖుష్దిల్‌ షా (69), సల్మాన్‌ అఘా (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. 

న్యూజిలాండ్‌ బౌలర్లు విలియమ్‌ ఓరూర్కీ (9-0-47-3), మిచెల్‌ సాంట్నర్‌ (10-0-663), మ్యాట్‌ హెన్రీ (7.2-1-25-2), బ్రేస్‌వెల్‌ (10-1-38-1) రెచ్చిపోవడంతో పాక్‌ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. పాక్‌.. ఈ నెల 23న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో టీమిండియాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ వేదికగా జరుగుతుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement