Champions Trophy 2025: భారత్‌తో కీలక సమరానికి ముందు పాక్‌కు బిగ్‌ షాక్‌..! | Babar Azam to Miss Clash Against India In Champions Trophy Says Reports | Sakshi
Sakshi News home page

Champions Trophy 2025: భారత్‌తో కీలక సమరానికి ముందు పాక్‌కు బిగ్‌ షాక్‌..!

Published Sun, Feb 23 2025 1:04 PM | Last Updated on Sun, Feb 23 2025 1:18 PM

Babar Azam to Miss Clash Against India In Champions Trophy Says Reports

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌, పాకిస్తాన్‌ జట్లు ఇవాళ (ఫిబ్రవరి 23) తలపడనున్నాయి. దుబాయ్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు పాక్‌కు సంబంధించి ఓ చేదు వార్త వినిపిస్తుంది. భారత్‌తో మ్యాచ్‌కు స్టార్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. 

నిన్న జరిగిన ట్రైనింగ్‌ సెషన్స్‌లో బాబర్‌ పాల్గొనకపోవడంతో ఈ ప్రచారం మొదలైంది. బాబర్‌ కంటి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నాడని తెలుస్తుంది. ట్రైనింగ్‌ సెషన్స్‌కు బాబర్‌ మినహా అందరూ హాజరయ్యారు. బాబర్‌కు ఏమైందోనని పాక్‌ అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.

కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో (న్యూజిలాండ్‌తో) జిడ్డుగా (90 బంతుల్లో 64 పరుగులు) ఆడి బాబర్‌ విమర్శలపాలైన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న బాబర్‌ న్యూజిలాండ్‌పై హాఫ్‌ సెంచరీ చేసినప్పటికీ ముప్పేట దాడిని ఎదుర్కొన్నాడు. భారీ లక్ష్య ఛేదనలో బాబర్‌ నిదానంగా ఆడటం పాక్‌ విజయావకాశాలను దెబ్బ తీసింది. 

ఫామ్‌లో లేకపోయినా భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ బాబర్‌పై గంపెడాశలు పెట్టుకుంది. మిగతా మ్యాచ్‌ల్లో అతని ఫామ్‌ ఎలా ఉ‍న్నా భారత్‌పై మాత్రం చెలరేగాలని పాక్‌ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వారి ఊహలకు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం చెక్‌ పెడుతుంది. దాయాదితో సమరంలో బాబర్‌ లేకపోతే తమ పరిస్థితి ఏంటని పాక్‌ అభిమానులు మదనపడిపోతున్నారు. 

ప్రస్తుతానికి ఫామ్‌లో లేకపోయినా పాక్‌ బ్యాటింగ్‌కు బాబరే పెద్ద దిక్కు. అతను మినహాయించి జట్టులో కెప్టెన్‌ రిజ్వాన్‌ ఒక్కడే అనుభవజ్ఞుడు. స్టార్‌ ప్లేయర్‌ ఫకర్‌ జమాన్‌ దూరమై (గాయం​) ఇప్పటికే సతమతమవుతున్న పాక్‌కు.. ‍బాబర్‌పై జరుగుతున్న ప్రచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 

ఒకవేళ నేటి మ్యాచ్‌లో బాబర్‌ నిజంగా దూరమైతే అతని స్థానంలో కమ్రాన్‌ గులామ్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ బ్యాటింగ్‌ కంటే బౌలింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. పేసర్లు షాహీన్‌ అఫ్రిది, నసీం​ షా, హరీస్‌ రౌఫ్‌లపై ఆ జట్టు గంపెడాశలు పెట్టుకుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ భారత్‌పై స్వల్ప ఆధిక్యం కలిగి ఉంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు తలపడగా.. పాక్‌ 3, భారత్‌ 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీలో చివరిసారి ఈ రెండు జట్లు తలపడినప్పుడు పాక్‌ పైచేయి సాధించింది. 2017 ఎడిషన్‌ ఫైనల్లో పాక్‌.. భారత్‌పై జయకేతనం ఎగురవేసి తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది.

ఓవరాల్‌గా భారత్‌, పాకిస్తాన్‌ వన్డేల్లో ఇప్పటివరకు 135 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్‌ 57 సార్లు విజయం సాధించగా.. పాక్‌ 73 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు తుది జట్లు (అంచనా)..

పాకిస్తాన్‌: సౌద్‌ షకీల్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, రిజ్వాన్‌ (కెప్టెన్‌,, కమ్రాన్‌ గులామ​్‌, సల్మాన్‌ అఘా, తయ్యబ్‌ తాహిర్‌, ఖుష్దిల్‌ షా, షాహీన్‌ అఫ్రిది, నసీం షా, హరీస్‌ రౌఫ్‌, అబ్రార్‌ అహ్మద్‌

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి, షమీ, కుల్దీప్‌ యాదవ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement