
పాకిస్తాన్ ప్రధానమంత్రి భీకర ప్రతిజ్ఞ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భీకర ప్రతిజ్ఞ చేశారు. ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమంలో పొరుగుదేశం భారత్‌ను ఓడిస్తానని, లేకపోతే తన పేరు షెహబాజ్ షరీఫే కాదని తేల్చిచెప్పారు. ఆయన తాజాగా పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఖాజీ ఖాన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
పిడికిలి గాల్లో విసురుతూ, పోడియం బల్ల చరుస్తూ ఆవేశంగా మాట్లాడారు. సామాన్య ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని అన్నారు. వారి కనీస అవసరాలు తీర్చడం తమ బాధ్యత అని చెప్పారు. దేశంలో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక పరిస్థితిని సక్రమ మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. భగవంతుడి ఆశీస్సులు పాకిస్తాన్‌కు ఎల్లవేళలా ఉంటాయని వ్యాఖ్యానించారు.
అభివృద్ధిలో ఇండియాను వెనక్కి నెట్టేయకపోతే తన పేరు షెహబాజ్ షరీఫే కాదని స్పష్టంచేశారు. ఇండియాను అధిగమించడానికి చివరి క్షణం దాకా కష్టపడుతూనే ఉంటామని, అందరం కలిసికట్టుగా పని చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు షెహబాజ్ షరీఫ్ ప్రతిజ్ఞపై సోషల్ మీడియాలో జనం వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేశారని విమర్శిస్తున్నారు. కేవలం మాటల చెప్పడం కాదు, దమ్ముంటే సాధించి చూపండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను గుర్తించకుండా ప్రధానమంత్రి ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారని కొందరు తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment