
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)అధినేత ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారుల ఆందోళనతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ మద్దతుదారులు ఆదివారం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఖైబర్ పఖ్తుంఖా ముఖ్యమంత్రి అలీ అమీన్ నేతృత్వం వహించిన ఈ కవాతు సోమవారం సాయంత్రం నాటికి ఇస్లామాబాద్ చేరుకుంది.
సోమవారం రాత్రి లక్షలాది తరలి వచ్చిన ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. నిరసన కారులు రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. రహదారులను మూసివేశారు. ఇస్లామాబాద్ చుట్టూ బారీకేడ్లు ఏర్పాటుచేశారు. తొలగించుకుంటూ నిరసనకారులు ముందుకు రాగా టియర్ గ్యాస్ ప్రయోగించి కట్టడి చేశారు. దీంతో ఆందోళన కారులు పోలీసులపై దాడికి పాల్పడటంతో అయిదుగురు భద్రతా సిబ్బంది మరణించినట్లు, అనేకమంది గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పంజాబ్ ప్రావిన్స్‌లో నిరసనకారులు చేసిన దాడిలో ఒక పోలీసు అధికారి మరణించగా, 119మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. 22 పోలీసు వాహనాలకు నిప్పంటించారని తెలిపారు. ఆందోళనకారుల్లోనూ నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ నిరసనలు మంగళవారం కూడా కొనసాగుతుండటంతో పాక్ వ్యాప్తంగా హైటెన్షన్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment