ఇస్లామాబాద్: తీవ్ర గందరగోళం.. రిగ్గింగ్ ఆరోపణల నడుమ ఎన్నికలు పూర్తి చేసుకున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి కాబోయే ప్రధాని ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే అస్పష్టతతో కూడిన ఫలితాలతో.. అనిశ్చితి నెలకొన్న పాకిస్థాన్‌లో రాజకీయం ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఇప్పటికే నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ ప్రభుత్వ ఏర్పాటునకు తీవ్రంగా యత్నిస్తుండగా.. ప్రతిపక్ష పాత్రకైనా రెడీ అని ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ మద్ధతుదారులు ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లోకి దిగడం విశేషం.
మెజారిటీ రాకున్నా.. మిత్రపక్షం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP)తో.. మరికొన్ని చిన్నచిన్న పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది ముస్లిం లీగ్ నవాజ్(PML-N) యత్నిస్తోంది. తన సోదరుడిని షెహబాజ్‌ను ఎలాగైనా మరోసారి ప్రధానిని చేయాలని నవాజ్ షరీఫ్ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈలోపు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భలే ట్విస్ట్ ఇచ్చారు.
ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మద్ధతుగా ఆయన మద్ధతుదారులు.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇండిపెండెంట్లు కావడంతో వాళ్లకు ప్రభుత్వ ఏర్పాటునకు వీలు లేకుండా పోయింది. దీంతో.. ప్రతిపక్ష పాత్రకే వీళ్లంతా పరిమితం కావొచ్చనే చర్చ నడిచింది. ఈ లోపు.. పీటీఐ వర్గం ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది.
పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. అయితే.. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీని పాక్ ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. దీంతోనే వాళ్లు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి నెగ్గారు. అక్కడి నిబంధనల ప్రకారం.. పాక్ ఎన్నికల్లో నెగ్గిన ఒక పార్టీకి గెలిచిన సీట్ల సంఖ్యకు అనుగుణంగా రిజర్వ్‌డ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే ఖాన్ మద్ధతుదారులంతా స్వతంత్ర అభ్యర్థులుగా గెలవడంతో.. ఆ వర్గానికి రిజర్వ్‌డ్ సీట్లు దక్కవు. అందుకే ఒక పార్టీగా వాళ్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
పాక్‌లో ఇస్లామిక్ పొలిటికల్ పార్టీస్ గ్రూప్‌గా పేరున్న ‘‘ఇస్లామిక్ పొలిటికల్ అండ్ రెలిజియస్ పార్టీస్ గ్రూప్’’లోని ఓ చిన్న పార్టీ అయిన సున్నీ ఇత్తేహద్ కౌన్సిల్(SIC). ఈ పార్టీలో చేరేందుకు ఖాన్ మద్దతుదారులంతా సిద్దం అయ్యారు. ఎస్‌ఐసీ తరఫున ఆ పార్టీ చైర్మన్ సయ్యద్ మహ్‌ఫూజ్ ఒక్కరే మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఈ కూటమిలో చేరడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది పీటీఐ ప్లాన్‌గా స్పష్టం అవుతోంది.
‘‘ఈ కూటమికి గనుక అనుమతి లభిస్తే.. పాకిస్థాన్‌లోని వివిధ ప్రావిన్స్‌లోనే కాదు కేంద్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి పీటీఐ చేరుకుంటుంది’’ అని పీటీఐ తరఫున ప్రధాని అభ్యర్థి అయూబ్ ఖాన్ చెబుతున్నారు. ‘‘మా సభ్యులంతా సున్నీ ఇత్తేహద్‌కౌన్సిల్‌లో చేరాలని నిర్ణయించుకున్నాం. ఈ మేరకు చర్చలు సఫలం అయ్యాయి. మళ్లీ ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని అయ్యేందుకు అవకాశమూ లేకపోలేదు’’ అని పీటీఐ చైర్మన్(ఆపద్ధర్మ) గోహర్ అలీఖాన్ మీడియాకు తెలిపారు. ఈ వారంలోనే ఎస్‌ఐసీలో చేరేందుకు దరఖాస్తులను పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారాయన. ఒకవేళ.. ఈ కూటమికి గనుక పాక్ ఈసీ అంగీకరిస్తే మాత్రం.. పాక్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment