Pak PM Asks Nawaz Sharif To Return To Pakistan Be PM For 4th Time - Sakshi
Sakshi News home page

నవాజ్‌ పాక్‌ తిరిగొచ్చి, నాలుగోసారి ప్రధాని అవ్వాలి: షెహబాజ్‌ షరీఫ్‌

Published Sat, Jun 17 2023 1:26 PM | Last Updated on Sat, Jun 17 2023 2:14 PM

Pak PM Asks Nawaz Sharif To Return To Pakistan Be PM For 4th Time - Sakshi

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ పార్టీ అధ్యక్షుడు నవాజ్‌ షరీఫ్‌ పాకిస్థాన్‌కు తిరిగి రావాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల కోసం పార్టీ తరపున ప్రచారాన్ని ముందుండి నడిపించాలని, అంతేగాక నాలుగోసారి పాక్‌​ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పీఎంఎల్‌ఎన్‌ పార్టీ  జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

త్వరలో ఎన్నికలు రాబోతున్న దృష్ట్యా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..  తన అన్నయ్య నవాజ్‌ షరీఫ్‌ రాక కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. పాక్‌కు తిరిగి వచ్చి పార్టీ సమావేశాలను నిర్వహించాలని, ఎన్నిక ప్రచారానికి నాయకత్వం వహించాలని కోరారు. PML-N అధ్యక్షుడి బాధ్యతలను తిరిగి అతనికి అప్పగిస్తానని పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ పాక్‌కు తిరిగి వచ్చాక రాజకీయాల మ్యాప్ మారుతుందని తెలిపారు. 

కాగా పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సుప్రీంకోర్టు రివ్యూ ఆఫ్ జడ్జిమెంట్స్ అండ్ ఆర్డర్స్ యాక్ట్ 2023పై సంతకం చేసిన కొన్ని వారాల తర్వాత ఈ షెహబాజ్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం.  ఇది 60 రోజుల్లోగా నవాజ్ షరీఫ్ తనజీవితకాల అనర్హతలకు వ్యతిరేకంగా అప్పీల్ హక్కును వినియోగించుకోవడానికి మొదటి దశను క్లియర్ చేస్తుంది. ఈ కొత్త చట్టం ద్వారా ఆర్టికల్ 184(3) ప్రకారం కేసుల్లో కోర్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయవచ్చు. గతంలో ఇచ్చిన తీర్పులకు కూడా ఈ చట్టం  వర్తిస్తుంది,

మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్ పనామా షరీఫ్‌పై పేపర్ల కేసులో పాకిస్థాన్ సుప్రీంకోర్టు జూలై 28, 2017న అనర్హత వేటు వేసింది.  అతడిని జీవితకాలం ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహించకుండా నిషేధం విధించింది. ఏడాది తర్వాత,ఎన్నికల చట్టం 2017ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును ప్రకటిస్తూ.. ఆర్టికల్ 62, 63 ప్రకారం అనర్హత వేటు పడిన ఏ వ్యక్తి కూడా రాజకీయ పార్టీ అధినేతగా పనిచేయలేరని కోర్టు పేర్కొంది. దీంతో PML-N అధ్యక్షుడిగా షెహబాజ్‌ షరీఫ్‌ చేపట్టారు.  కాగా ఆరోగ్య కారణాల రీత్యా నవాజ్ షరీఫ్ నవంబర్ 2019 నుంచి లండన్‌లో నివాసం ఉంటున్నారు.
చదవండి: నిద్రలో హఠాత్తుగా లేచి తుపాకీతో కాల్చుకున్నాడు.. కారణం తెలిస్తే షాక్‌..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement