pml-N party
-
Pakistan General Elections 2024: పాక్ ప్రధానిగా షహబాజ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీఎంఎల్–ఎన్ నేత షెహబాజ్ షరీఫ్(72) ఎన్నికయ్యారు. నూతన ప్రధానిని ఎన్నుకోవడానికి పాకిస్తాన్ పార్లమెంట్లో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 336 ఓట్లకు గాను çషహబాజ్ షరీఫ్‌కు 201 ఓట్లు లభించాయి. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్‌కు కేవలం 92 ఓట్లు దక్కాయి. షెహబాజ్ షరీఫ్‌కు సాధారణ మెజార్టీ కంటే 32 ఓట్లు అధికంగా లభించడం విశేషం. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) సంకీర్ణ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహించబోతున్నారు. పీఎంఎల్–ఎన్, పీపీపీ కూటమికి ముత్తహిదా ఖ్వామీ మూవ్మెంట్, పాకిస్తాన్ ముస్లిం లీగ్(క్యూ), బలూచిస్తాన్ అవామీ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్(జెడ్), ఇస్తెఖామ్–ఇ–పాకిస్తాన్ పార్టీ, నేషనల్ పార్టీ మద్దతిస్తున్నాయి. షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు పార్లమెంట్ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. షహబాజ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఓటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులైన కొందరు ఎంపీలు సభలో అలజడి సృష్టించారు. అనంతరం షహబాజ్ మాట్లాడుతూ కశ్మీర్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. కశ్మీరీల, పాలస్తీనియన్ల స్వాతంత్య్రం కోసం ఒక్కటి కావాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. వారి స్వేచ్ఛను కోరుతూ పార్లమెంట్లో తీర్మానం చేయాలన్నారు. -
‘పాక్ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దు’
వాషింగ్టన్: పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న వేళ.. అగ్రరాజ్య చట్ట సభ్యులు పెద్ద షాకే ఇచ్చారు. ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దంటూ అధ్యక్షుడు జో బైడెన్‌కు డెమొక్రటిక్ సభ్యులు లేఖ రాశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. అమెరికా ఆ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని లేఖలో పేర్కొన్నారు వాళ్లంతా. ఫిబ్రవరి 8 నాటి పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగేవరకు కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దని లేఖలో బైడెన్ చట్టసభ్యులు కోరారు. ‘‘పోలింగ్‌కు ముందు, తరువాత రిగ్గింగ్ జరిగిందనే దానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన దర్యాప్తు జరిగేవరకు వేచి చూడండి. అంతవరకు ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దు. లేనిపక్షంలో ఆ దేశాధికారుల ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సమర్థించినట్లవుతుంది. అది అక్కడి ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తిని తక్కువ చేసినట్లే’’ అని లేఖలో ప్రస్తావించారు వాళ్లు. బైడెన్‌తో పాటు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను ఉద్దేశించి సంయుక్త లేఖ రాశారు వాళ్లు. ‘‘ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్‌ఖాన్‌కు జైలు శిక్షలు విధించారు. ఆ పార్టీ అభ్యర్థులకు స్వతంత్రులుగా పోటీ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. పీటీఐ శ్రేణులు.. పోలీసు దాడులు, అరెస్టులు, వేధింపులు ఎదుర్కొన్నారు. ఎన్నికల తుది ఫలితాల విడుదలలో జాప్యం అనుమానాలకు కారణమైంది. ఫలితాలు తారుమారైనట్లు ఆరోపణలు ఉన్నాయి’’ అని 33 మంది చట్టసభ్యులు తెలిపారు. ఇందులో ప్రోగ్రెసివ్ కాకస్ ఛైర్పర్సన్, భారత సంతతికి చెందిన ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో భారీఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు గురువారం పార్లమెంటులోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. అదే సమయంలో.. మెజారిటీ రాకపోయినా కూటమి రూపేణా ప్రభుత్వ ఏర్పాటునకు నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ సిద్ధమైంది. షరీఫ్ సోదరుడు.. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం పాక్ నూతన ప్రధానిగా ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ పరిణామాల మధ్య అగ్రరాజ్య చట్టసభ్యుల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా మరియం
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు, పీఎంఎల్–ఎన్ ఉపాధ్యక్షురాలు అయిన మరియం నవాజ్(50) చరిత్ర సృష్టించారు. రాజకీయంగా ఎంతో కీలకమైన పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నికయ్యారు. పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రావిన్స్‌కు సీఎంగా మహిళ పగ్గాలు చేపట్టడం ఇదే మొట్టమొదటిసారి. పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం 327 సీట్లుండగా ముఖ్యమంత్రి అభ్యర్థికి 187 మంది సభ్యుల అవసరం ఉంటుంది. ఇటీవలి ఎన్నికల్లో పీఎంఎల్–ఎన్ 137 సీట్లు గెలుచుకోగా, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీటీఐకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు 113 సీట్లు, ఇతర స్వతంత్రులు 20 సీట్లు సాధించారు. వీరిలో స్వతంత్రులు పీఎంఎల్–ఎన్‌కు మద్దతు పలికారు. శనివారం సీఎం ఎన్నికకు జరిగిన ఓటింగ్‌లో మరియంకు 220 ఓట్లు పడ్డాయి. పీటీఐ స్వతంత్ర అభ్యర్థులు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. -
పాక్ రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్
ఇస్లామాబాద్: తీవ్ర గందరగోళం.. రిగ్గింగ్ ఆరోపణల నడుమ ఎన్నికలు పూర్తి చేసుకున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి కాబోయే ప్రధాని ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే అస్పష్టతతో కూడిన ఫలితాలతో.. అనిశ్చితి నెలకొన్న పాకిస్థాన్‌లో రాజకీయం ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఇప్పటికే నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ ప్రభుత్వ ఏర్పాటునకు తీవ్రంగా యత్నిస్తుండగా.. ప్రతిపక్ష పాత్రకైనా రెడీ అని ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ మద్ధతుదారులు ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లోకి దిగడం విశేషం. మెజారిటీ రాకున్నా.. మిత్రపక్షం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP)తో.. మరికొన్ని చిన్నచిన్న పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది ముస్లిం లీగ్ నవాజ్(PML-N) యత్నిస్తోంది. తన సోదరుడిని షెహబాజ్‌ను ఎలాగైనా మరోసారి ప్రధానిని చేయాలని నవాజ్ షరీఫ్ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈలోపు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భలే ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మద్ధతుగా ఆయన మద్ధతుదారులు.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇండిపెండెంట్లు కావడంతో వాళ్లకు ప్రభుత్వ ఏర్పాటునకు వీలు లేకుండా పోయింది. దీంతో.. ప్రతిపక్ష పాత్రకే వీళ్లంతా పరిమితం కావొచ్చనే చర్చ నడిచింది. ఈ లోపు.. పీటీఐ వర్గం ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. అయితే.. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీని పాక్ ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. దీంతోనే వాళ్లు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి నెగ్గారు. అక్కడి నిబంధనల ప్రకారం.. పాక్ ఎన్నికల్లో నెగ్గిన ఒక పార్టీకి గెలిచిన సీట్ల సంఖ్యకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే ఖాన్ మద్ధతుదారులంతా స్వతంత్ర అభ్యర్థులుగా గెలవడంతో.. ఆ వర్గానికి రిజర్వ్డ్ సీట్లు దక్కవు. అందుకే ఒక పార్టీగా వాళ్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. పాక్‌లో ఇస్లామిక్ పొలిటికల్ పార్టీస్ గ్రూప్‌గా పేరున్న ‘‘ఇస్లామిక్ పొలిటికల్ అండ్ రెలిజియస్ పార్టీస్ గ్రూప్’’లోని ఓ చిన్న పార్టీ అయిన సున్నీ ఇత్తేహద్ కౌన్సిల్(SIC). ఈ పార్టీలో చేరేందుకు ఖాన్ మద్దతుదారులంతా సిద్దం అయ్యారు. ఎస్ఐసీ తరఫున ఆ పార్టీ చైర్మన్ సయ్యద్ మహ్ఫూజ్ ఒక్కరే మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఈ కూటమిలో చేరడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది పీటీఐ ప్లాన్‌గా స్పష్టం అవుతోంది. ‘‘ఈ కూటమికి గనుక అనుమతి లభిస్తే.. పాకిస్థాన్‌లోని వివిధ ప్రావిన్స్‌లోనే కాదు కేంద్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి పీటీఐ చేరుకుంటుంది’’ అని పీటీఐ తరఫున ప్రధాని అభ్యర్థి అయూబ్ ఖాన్ చెబుతున్నారు. ‘‘మా సభ్యులంతా సున్నీ ఇత్తేహద్‌కౌన్సిల్‌లో చేరాలని నిర్ణయించుకున్నాం. ఈ మేరకు చర్చలు సఫలం అయ్యాయి. మళ్లీ ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని అయ్యేందుకు అవకాశమూ లేకపోలేదు’’ అని పీటీఐ చైర్మన్(ఆపద్ధర్మ) గోహర్ అలీఖాన్ మీడియాకు తెలిపారు. ఈ వారంలోనే ఎస్ఐసీలో చేరేందుకు దరఖాస్తులను పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారాయన. ఒకవేళ.. ఈ కూటమికి గనుక పాక్ ఈసీ అంగీకరిస్తే మాత్రం.. పాక్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. -
నవాజ్ పాక్ తిరిగొచ్చి, నాలుగోసారి ప్రధాని అవ్వాలి: షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ పాకిస్థాన్‌కు తిరిగి రావాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల కోసం పార్టీ తరపున ప్రచారాన్ని ముందుండి నడిపించాలని, అంతేగాక నాలుగోసారి పాక్ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పీఎంఎల్ఎన్ పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎన్నికలు రాబోతున్న దృష్ట్యా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రధాని షెబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తన అన్నయ్య నవాజ్ షరీఫ్ రాక కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. పాక్‌కు తిరిగి వచ్చి పార్టీ సమావేశాలను నిర్వహించాలని, ఎన్నిక ప్రచారానికి నాయకత్వం వహించాలని కోరారు. PML-N అధ్యక్షుడి బాధ్యతలను తిరిగి అతనికి అప్పగిస్తానని పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ పాక్‌కు తిరిగి వచ్చాక రాజకీయాల మ్యాప్ మారుతుందని తెలిపారు. కాగా పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సుప్రీంకోర్టు రివ్యూ ఆఫ్ జడ్జిమెంట్స్ అండ్ ఆర్డర్స్ యాక్ట్ 2023పై సంతకం చేసిన కొన్ని వారాల తర్వాత ఈ షెహబాజ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇది 60 రోజుల్లోగా నవాజ్ షరీఫ్ తనజీవితకాల అనర్హతలకు వ్యతిరేకంగా అప్పీల్ హక్కును వినియోగించుకోవడానికి మొదటి దశను క్లియర్ చేస్తుంది. ఈ కొత్త చట్టం ద్వారా ఆర్టికల్ 184(3) ప్రకారం కేసుల్లో కోర్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయవచ్చు. గతంలో ఇచ్చిన తీర్పులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది, మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్ పనామా షరీఫ్‌పై పేపర్ల కేసులో పాకిస్థాన్ సుప్రీంకోర్టు జూలై 28, 2017న అనర్హత వేటు వేసింది. అతడిని జీవితకాలం ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహించకుండా నిషేధం విధించింది. ఏడాది తర్వాత,ఎన్నికల చట్టం 2017ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును ప్రకటిస్తూ.. ఆర్టికల్ 62, 63 ప్రకారం అనర్హత వేటు పడిన ఏ వ్యక్తి కూడా రాజకీయ పార్టీ అధినేతగా పనిచేయలేరని కోర్టు పేర్కొంది. దీంతో PML-N అధ్యక్షుడిగా షెహబాజ్ షరీఫ్ చేపట్టారు. కాగా ఆరోగ్య కారణాల రీత్యా నవాజ్ షరీఫ్ నవంబర్ 2019 నుంచి లండన్‌లో నివాసం ఉంటున్నారు. చదవండి: నిద్రలో హఠాత్తుగా లేచి తుపాకీతో కాల్చుకున్నాడు.. కారణం తెలిస్తే షాక్.. -
పాక్ పీఠం షాబాజ్‌కు! ఇమ్రాన్ ఖాన్ ఏమంటున్నారు?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరుగుతున్నాయి. ప్రధానిగా పీఎంఎల్ (ఎన్) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ (70) ఎన్నికకు రంగం సిద్ధమైంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన, తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ తరఫున షా మహ్మద్ ఖురేషీ ఆదివారం నామినేషన్లు వేశారు. అయితే పలు కేసులున్న షాబాజ్ నామినేషన్‌ను తిరస్కరించాలన్న పీటీఐ డిమాండ్‌ను సభాపతి తోసిపుచ్చారు. దాంతో సోమవారం తమ ఎంపీలంతా రాజీనామా చేస్తారని పీటీఐ సీనియర్ నేత బాబర్ అవాన్ ప్రకటించారు. ఇమ్రాన్ నివాసంలో జరిగిన పీటీఐ కోర్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు చెప్పారు. ప్రధానిగా షాబాజ్‌ను అంగీకరించేది లేదని ఇమ్రాన్ తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటానికి తెర తీస్తామన్నారు. దేశం కోసం మరో స్వాతంత్య్ర పోరాటం నేటి నుంచి మొదలవుతుందంటూ ట్వీట్ చేశారు. ‘‘కొత్తగా కొలువుదీరేది విదేశీ ప్రభుత్వమే. ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ వీధుల్లోకొచ్చి నిరసన తెలపండి’’ అని పీటీఐ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం కానుంది. 342 మంది సభ్యులున్న సభలో ప్రధానిగా ఎన్నికవాలంటే 172 మంది మద్దతు అవసరం. ప్రస్తుత సభ కాల పరిమితి 2023 ఆగస్టుతో ముగియనుంది. షాబాజ్‌కు సవాలే పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షాబాజ్ మూడుసార్లు పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా కూడా పని చేశారు. మనీ లాండరింగ్ కేసుల్లో షాబాజ్, ఆయన కుమారుడు హంజా 2019లో అరెస్టయ్యారు. పీఠమెక్కాక కలగూర గంపలాంటి విపక్షాలను ఏడాదికి పైగా ఒక్కతాటిపై నడపడం ఆయనకు సవాలేనంటున్నారు. ఇమ్రాన్‌ను అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో, ‘‘ప్రతీకార రాజకీయాలుండబోవు. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అంటూ షాబాజ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్, మాజీ మంత్రులు తదితరులు దేశం విడిచి పోకుండా ఆదేశించాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉన్నతాధికారులెవరూ దేశం వదలొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. -
ఇమ్రాన్ వాహనంపై కాల్పులు
ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో ఘటన ఇస్లామాబాద్/లాహోర్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తలపెట్టిన ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ వాహనంపై అధికార పీఎంఎల్-ఎన్ పార్టీ కార్యకర్తలు దాడికి దిగి కాల్పులు జరిపారు. దీంతో నిరసన ర్యాలీల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వేలాది మంది నిరసనకారులు రెండు వేర్వేరు కాన్వాయ్‌లలో దేశ రాజధాని ఇస్లామాబాద్‌వైపు సాగుతున్నారు. ఒక కాన్వాయ్‌కు ప్రతిపక్ష నాయకుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వం వహిస్తుండగా.. మరో కాన్వాయ్‌కు కెనడాకు చెందిన మతపెద్ద తహీరుల్ ఖాద్రీ నాయకత్వం వహిస్తున్నారు. రెండు కాన్వాయ్ లూ ఇస్లామాబాద్‌లో ఏకమై.. ముందస్తు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నది ప్రణాళిక. కాగా మధ్యలో గుర్జన్‌వాలా వద్ద తన వాహనంపై అధికార పీఎంఎల్-ఎన్ పార్టీ కార్యకర్తలు కాల్పులు జరిపారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. 370 కిలోమీటర్లు సాగే ఈ మార్చ్ గురువారం ప్రారంభమైంది. రెండు కాన్వాయ్‌లలో కలిపి లక్ష మంది దాకా నిరసన ర్యాలీగా సాగుతున్నారు.