ఇమ్రాన్ వాహనంపై కాల్పులు
ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో ఘటన
ఇస్లామాబాద్/లాహోర్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తలపెట్టిన ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ వాహనంపై అధికార పీఎంఎల్-ఎన్ పార్టీ కార్యకర్తలు దాడికి దిగి కాల్పులు జరిపారు. దీంతో నిరసన ర్యాలీల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వేలాది మంది నిరసనకారులు రెండు వేర్వేరు కాన్వాయ్‌లలో దేశ రాజధాని ఇస్లామాబాద్‌వైపు సాగుతున్నారు. ఒక కాన్వాయ్‌కు ప్రతిపక్ష నాయకుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వం వహిస్తుండగా.. మరో కాన్వాయ్‌కు కెనడాకు చెందిన మతపెద్ద తహీరుల్ ఖాద్రీ నాయకత్వం వహిస్తున్నారు.
రెండు కాన్వాయ్ లూ ఇస్లామాబాద్‌లో ఏకమై.. ముందస్తు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నది ప్రణాళిక. కాగా మధ్యలో గుర్జన్‌వాలా వద్ద తన వాహనంపై అధికార పీఎంఎల్-ఎన్ పార్టీ కార్యకర్తలు కాల్పులు జరిపారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. 370 కిలోమీటర్లు సాగే ఈ మార్చ్ గురువారం ప్రారంభమైంది. రెండు కాన్వాయ్‌లలో కలిపి లక్ష మంది దాకా నిరసన ర్యాలీగా సాగుతున్నారు.