![Pakistan General Elections 2024: Shehbaz Sharif elected Pakistan prime minister for second term - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/4/pak-new-pm.jpg.webp?itok=lr_Ypp13)
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీఎంఎల్–ఎన్ నేత షెహబాజ్ షరీఫ్(72) ఎన్నికయ్యారు. నూతన ప్రధానిని ఎన్నుకోవడానికి పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 336 ఓట్లకు గాను çషహబాజ్ షరీఫ్‌కు 201 ఓట్లు లభించాయి. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్‌కు కేవలం 92 ఓట్లు దక్కాయి. షెహబాజ్ షరీఫ్‌కు సాధారణ మెజార్టీ కంటే 32 ఓట్లు అధికంగా లభించడం విశేషం.
పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) సంకీర్ణ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహించబోతున్నారు. పీఎంఎల్–ఎన్, పీపీపీ కూటమికి ముత్తహిదా ఖ్వామీ మూవ్‌మెంట్, పాకిస్తాన్ ముస్లిం లీగ్(క్యూ), బలూచిస్తాన్ అవామీ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్(జెడ్), ఇస్తెఖామ్–ఇ–పాకిస్తాన్ పార్టీ, నేషనల్ పార్టీ మద్దతిస్తున్నాయి. షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు పార్లమెంట్ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ ప్రకటించారు.
షహబాజ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఓటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులైన కొందరు ఎంపీలు సభలో అలజడి సృష్టించారు. అనంతరం షహబాజ్ మాట్లాడుతూ కశ్మీర్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. కశ్మీరీల, పాలస్తీనియన్ల స్వాతంత్య్రం కోసం ఒక్కటి కావాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. వారి స్వేచ్ఛను కోరుతూ పార్లమెంట్‌లో తీర్మానం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment