సైన్యం ప్రతిష్ఠను దిగజార్చిన తీర్పు | Sakshi Guest Column On Pakistan Politics | Sakshi
Sakshi News home page

సైన్యం ప్రతిష్ఠను దిగజార్చిన తీర్పు

Published Thu, Feb 15 2024 12:04 AM | Last Updated on Thu, Feb 15 2024 12:04 AM

Sakshi Guest Column On Pakistan Politics

పాకిస్తాన్‌ తర్వాతి ప్రధానిగా మరోసారి షెహబాజ్‌ షరీఫ్‌ ఎన్నికయ్యే అవకాశం ఉంది. నాలుగోసారి ప్రధాని అవుతారని భావించిన నవాజ్‌ షరీఫ్‌ ఉన్నట్టుండి తన సోదరుడు షెహబాజ్‌ పేరును ముందుకు తెచ్చారు. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పీటీఐ మద్దతు ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇచ్చినందున, పాలనా సామర్థ్యానికి సంబంధించిన సమస్యలు అలాగే ఉంటాయి. ఇక, ఈ ఎన్నికలు పాక్‌లో సైన్యం ప్రాబల్యం తగ్గిందని సంకేతిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ భారత్‌కు ముఖ్యమైనవే. ఆ దేశంతో మన సంబంధాలు సుప్తావస్థలో ఉండవచ్చు. కానీ అవి ఎప్పటికీ అలాగే ఉండవు. ఏ రకమైన ప్రపంచ శక్తిగా ఎదగడానికైనా, ఉపఖండ శాంతి, ఆర్థిక ఏకీకరణ మనకు చాలా కీలకం.

ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ గమ్యానికి మధ్యవర్తిగా తన ప్రాబల్యాన్ని పాకిస్తాన్‌ సైన్యం రాను రానూ కోల్పోతోందని ఇటీవలే ముగిసిన ఆ దేశ ఎన్నికలకు చెందిన ఆశ్చర్యకరమైన ఫలితాలు సూచిస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం దేశాన్ని వాస్తవంగా నడిపిన మయన్మార్‌ సైన్యం... ఇప్పటి వరకూ ప్రజాస్వామ్య, వేర్పాటువాద శక్తులకు వ్యతిరేకంగా విజయవంతంగా పోరాడుతూ వచ్చినప్పటికీ వెనుకపట్టు పడుతోంది. మన దేశ తూర్పు సరిహద్దులలో జరుగుతున్న దానితో పోలిస్తే పాకిస్తాన్‌ పరిణామాలు కూడా మరీ భిన్నమైనవేమీ కాదు.

ప్రస్తుత తరుణంలో రాబోయే కాలంలో పాక్‌ రాజకీయాలు ఎలా రూపుదిద్దుకుంటాయో చెప్పడం కష్టమే. నవాజ్‌ షరీఫ్‌కు చెందిన ‘పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌– నవాజ్‌’(పీఎంఎల్‌–ఎన్‌), బిలావల్‌ భుట్టో జర్దారీకి చెందిన ‘పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ’(పీపీపీ) కలిసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన ‘పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఎ–ఇన్సాఫ్‌’ (పీటీఐ) మద్దతు ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇచ్చినందున, పాలనా సామర్థ్యానికి సంబంధించి తీవ్రమైన సమస్యలు అలాగే ఉంటాయి. ఇమ్రాన్‌ పార్టీని అణిచివేసేందుకు ఉద్దేశించిన చర్యలను ఆ పార్టీ నామినీలు అధిగమించి అత్యుత్తమ పనితీరు కనబరిచారు. అసమానతలకు వ్యతిరేకంగా వారు ప్రదర్శించిన పోరాట పటిమ మన దేశ ప్రతిపక్షానికి కూడా ప్రేరణగా ఉపయోగపడుతుంది.

ఎన్నికల ఫలితాలను చూస్తే పాకిస్తాన్‌ సైన్యం పెద్ద ఎత్తున పట్టు కోల్పోయిందని చెప్పవచ్చు. 2023 మే 9న ఇమ్రాన్‌ అరెస్టు తర్వాత, ఆయన పార్టీ మద్దతుదారులు దేశవ్యాప్తంగా హింసకు పాల్పడి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, పాకిస్తాన్‌ పంజాబ్‌లోని సైనిక స్థావరాలపై కూడా దాడి చేసిన సంఘటనలను గుర్తు చేసుకోండి.

ఈ పరిణామాలన్నీ భారత్‌కు ముఖ్యమైనవే. పాకిస్తాన్‌ ప్రభు త్వంతో మన సంబంధాలు తీవ్రమైన సుప్తావస్థలో ఉండవచ్చు. కానీ అవి ఎప్పటికీ అలాగే ఉండలేవు. పాకిస్తాన్‌  తనకుతాను మునిగిపోనీ లేదా తేలియాడనీ అని భావించేవారు నిజంగానే భ్రమలో ఉన్నారు. ఏ రకమైన ప్రపంచ శక్తిగా ఎదగడానికైనా సరే, ఉపఖండ శాంతి, ఆర్థిక ఏకీకరణ అనేవి మన భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవి.

భారత్, పాకిస్తాన్‌ సంబంధాలు ఇటీవలి కాలంలో ఆసక్తికరమైన దశలో ఉన్నాయి. ఒకవైపు పాకిస్తాన్‌ జిహాదీల చొరబాట్లు, వారి దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు, పాకిస్తాన్‌ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి చేరువ కావడానికి ప్రయత్నించింది. ఈలోగా, ‘ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌’(ఎఫ్‌ఏటీఎఫ్‌) ఒత్తిడితో, హఫీజ్‌ సయీద్‌(లష్కర్‌–ఎ–తైయబా సహ వ్యవస్థాపకుడు)కు పాక్‌ 31 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాగే (లష్కర్‌–ఎ–తైయబా మరో వ్యవస్థాపకుడు) జకీవుర్‌ రెహ్మాన్‌ లఖ్వీకి కూడా వరుసగా మూడు ఐదేళ్ల జైలు శిక్షలు విధించారు. ఇక, 2008 ముంబై దాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్‌ మీర్‌ను కూడా పాకిస్తాన్‌ ‘దొరికించుకుని’ దోషిగా నిర్ధారించింది.

2023 జనవరిలో, అప్పటి పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (నవాజ్‌ షరీఫ్‌ తమ్ముడు) దేశంలో అంధకార స్థితి మధ్య ‘మేము మా గుణపాఠం నేర్చుకున్నాము. మా నిజమైన సమస్యలను పరిష్కరించు కోగలిగితే, మేము భారతదేశంతో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాము’ అని ప్రకటించారు. కానీ మరుసటి రోజే, కశ్మీర్‌ రాజ్యాంగ హోదాను భారతదేశం పునరుద్ధరించనంత వరకూ ఎటువంటి సంభా షణా సాధ్యం కాదని పాక్‌ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

ఆ తర్వాత, భారత ప్రభుత్వం ఆమోదించిన ఆర్టికల్‌ 370 రద్దును మన సుప్రీం కోర్ట్‌ సమర్థించింది. జమ్మూ – కశ్మీర్‌ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కూడా పిలుపునిచ్చింది. కానీ అది కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ లేని కొత్త సరిహద్దులను కలిగి ఉంటుంది.

వాస్తవానికి, పుల్వామాలో సైనికులపై దాడి, ఆర్టికల్‌ 370 రద్దు కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి ముందే, రెండు దేశాలు ఐఎస్‌ఐ(పాకిస్తాన్‌ గూఢచార సంస్థ) మాజీ డిప్యూటీ చీఫ్‌తోనూ, భారతీయ ఇంటెలిజెన్‌ ్స అధికారితోనూ తెరవెనుక సంభా షణను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాయి. తర్వాత, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ఒకానొక గల్ఫ్‌ దేశంలో అప్పటి ఐఎస్‌ఐ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫైజ్‌ హమీద్‌ను కలిశారు. 2021లో ప్రధాని మోదీ పాకిస్తాన్‌ పర్యటనకూ, సింధ్‌లోని హింగ్లాజ్‌ మాతా ఆలయాన్ని సందర్శించడానికీ ప్రణాళికలు రూపొందాయి. కానీ అంతలోనే పాక్‌ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత 2022లో, ఆయన పదవి నుండి తొలగించబడ్డారు.

మోదీ, నవాజ్‌ షరీఫ్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, ఆ సంబంధాల సూత్రాలను ఎంచుకోవడం ఇప్పుడు సవాలుగా మారింది. 2015లో ప్రధానిగా ఉన్న నవాజ్‌ షరీఫ్‌ మాతృమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు భారత ప్రధాని లాహోర్‌లో దిగి నప్పటి నుంచీ చాలా పరిణామాలే జరిగాయి. ముఖ్యంగా, 2019 బాలాకోట్‌ వైమానిక దాడులు, తీవ్రవాద దాడి జరిగినప్పుడు పాక్‌పై దాడి చేయడానికి న్యూఢిల్లీ వెనుకాడదని స్పష్టంగా సూచించింది.

భారత్‌ కంటే పాకిస్తాన్‌కే ఇప్పుడు శాంతియుత సరిహద్దు అవసరం. దాని ఆర్థిక పరిస్థితి భయంకరంగా కొనసాగుతోంది; జిహాదీ తీవ్రవాద ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది; అంతర్జా తీయ సమాజం దాని పగ్గాలను బిగించడానికి ‘ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌’ను ఉపయోగిస్తోంది. పైగా, అఫ్గానిస్తాన్‌ లో తాలిబన్ల అధికార స్వీకారం నుండి ఆశించిన ప్రయోజనాలు కార్యరూపం దాల్చలేదు. బదులుగా ఇరాన్‌ తో పాకిస్తాన్‌ ప్రమాదకరమైన గొడవకు దిగింది.

అమెరికా, చైనా తమ సొంత కారణాల వల్ల, పాకిస్తాన్‌ లో ఉమ్మడి ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ప్రధానంగా, అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక ఆరోగ్యం చాలా అవసరం. కాబట్టే, ఈ రెండు దేశాలూ, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను మాత్రమే కాకుండా, పాక్‌–అఫ్గాన్‌ ప్రాంతం తీవ్ర వాదులకు పుట్టిల్లు కాకుండా ఉండే వాతావరణాన్ని కోరుకుంటు న్నాయి.

తన బీఆర్‌ఐ (బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌) పెట్టుబడులు ఉన్నప్పటికీ, తాను మాత్రమే పాకిస్తాన్‌ ఆర్థిక శ్రేయస్సుకు హామీ ఇవ్వలేననీ, ఇతర దేశాలు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) కూడా ముఖ్యమైన పాత్ర పోషించాలనీ చైనా గ్రహించింది. అమె రికాకు పాకిస్తాన్‌ ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా ఉన్నదనీ, వాషింగ్టన్‌ కూడా పాక్‌లో లోతైన ప్రయోజనాలను కలిగి ఉందనీ కూడా చైనీయులకు తెలుసు. ఇస్లామిక్‌ స్టేట్‌ బలపడుతున్న అఫ్గాని స్తాన్‌లో ఏమి జరుగుతోందో తెలుసుకోవడానికి అమెరికాకు పాకిస్తాన్‌ ఒక ముఖ్యమైన సాధనం.

సైనిక కోణంలో భారత్‌ విషయానికొస్తే, భారతదేశ చర్యలు గత మూడేళ్లలో పాకిస్తాన్‌ నుండి చైనా వైపు దృష్టిని మరల్చినట్లు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, పాకిస్తాన్‌ సరిహద్దును ప్రశాంతంగా ఉంచడం భారతదేశ ప్రయోజనాలలో భాగం. పాకిస్తాన్‌ మూలంలోనే పూర్తిగా గడబిడ ఉంటుంది. ఒక ఉన్నత స్థాయి బ్యాక్‌ ఛానల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మరోసారి చర్చలు ప్రారంభించడమే మార్గం. ప్రబలమైన ఘర్షణను తగ్గించడం, రెండు దేశాల మధ్య సంబంధాలకు గానూ కొత్త విధానాన్ని రూపొందించడం తదుపరి కర్తవ్యం.

మనోజ్‌ జోషీ 
వ్యాసకర్త డిస్టింగ్విష్డ్‌ ఫెలో, అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్, న్యూఢిల్లీ ‘ (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement