
సందర్భం
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఇటీవలి ఎన్‌కౌంటర్‌లో ఒక లేఖ బయటపడింది. మహిళా కమాండర్ మన్ కీకి నక్సల్ నేత మోటూ రాసిన ఆ లేఖను చూస్తే మునుపు ఎన్నడూ లేని విధంగా నక్సలైట్లలో నిస్పృహ ఆవరించి ఉన్నట్లు అనిపిస్తుంది. బోడ్కా నుంచి గామ్‌పూర్ వరకూ, దోడితుమ్నార్ నుంచి తోడ్కా వరకూ నక్సలైట్లకు సురక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయిందని ఆ లేఖలో పేర్కొన్నారు.
భద్రతా దళాల నిరంతర నిఘా, దాడులు ఈ పరిస్థితిని తెచ్చాయి. నక్సలైట్లను 2026 మార్చ్ 31లోగా ఛత్తీస్‌గఢ్‌లో లేకుండా చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటన నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. బస్తర్, అబూర్nుమాడ్ అడవుల నుంచి గరియాబంద్ వరకూ భద్రతాదళాలు నిత్యం కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏడాది కాలంలో సుమారు 300 మంది నక్సలైట్లు మరణించగా, మరెందరో అరెస్ట్ అయ్యారు. లేదా లొంగిపోయారు.
భారత అంతర్గత భద్రతకు వామపక్ష తీవ్రవాదం చాలాకాలంగా సవాలు విసురుతున్నది. రాజ్యాంగానికి సమాంతరంగా వ్యవస్థలు ఏర్పాటు చేసిన నక్సలైట్లను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్థంగా అణచివేయగలిగింది. ఇందుకోసం ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అనుసరించింది. ఒకవైపు అభివృద్ధి కార్యకలాపాలకు పెద్దపీట వేస్తూనే, ఇంకోవైపు భద్రతా దళాల కార్య కలాపాలనూ ముమ్మరం చేసింది.
నక్సలైట్ల రాజ్యంలోకి...
సామాజిక, ఆర్థిక వెనుకబాటు, దశాబ్దాల నిర్లక్ష్యం కారణంగా దేశంలో నక్సలిజం పెరిగిపోయింది. ఇది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు. వివక్షకు గురైన ప్రజలు, ప్రాంతాలు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచు కోలేదు. ఫలితంగా అక్కడ తిరుగుబాటు పుట్టుకొచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం అభివృద్ధి విషయంలోని లోటుపాట్లను సరిచేయడంతోపాటు, దేశాద్యంతం రాజ్యాంగ పరిధిలోనే పనిచేసేలా ద్విముఖ వ్యూహం అనుసరించింది. పట్టు కోల్పోయిన ప్రాంతాలను భద్రతా దళాలు మళ్లీ తమ స్వాధీనంలోకి తీసుకోగలిగాయి. ఒకప్పటి నక్సలైట్ల రాజ్యంలో ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పాటు చేయగలిగాయి.
అయితే ఈ మార్పు ఒక్కరోజులో జరిగిందేమీ కాదు. కచ్చితమైన ప్రణాళికతో అమలు చేసిన ఈ వ్యూహం నక్సలైట్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించింది. వ్యూహా త్మక మోహరింపులు, నిఘా వర్గాలను బలోపేతం చేయడం, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్ వంటి భద్రతాదళాల సాయంతో అతివాదుల అడ్డాలను నిర్వీర్యం చేయగలిగారు. అననుకూల పరిస్థి తుల్లో పనిచేసే ఈ భద్రతా దళాలు అత్యాధునిక డ్రోన్లు, నిఘా పరికరాలు, కృత్రిమ మేధ, ఉపగ్రహ ఛాయా చిత్రాల వంటి వాటి సాయంతో నక్సలైట్ల ఆట కట్టిస్తున్నాయి.
తీవ్రవాద సంస్థల ఆర్థిక వనరులపై ఉక్కుపాదం మోపడం కూడా కీలకమైంది. ఎన్‌ఐఏ, ఈడీ వంటి సంస్థలు కొన్ని కోట్ల రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకుని నక్సలైట్ల వెన్నువిరిచాయి. పీఎంఎల్‌ఏ చట్టాలతో కఠిన చర్యలు తీసుకోవడంతో నక్సలైట్లకు ఆర్థిక దన్నుగా నిలిచిన వారినీ కట్టడి చేయగలిగారు. ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ పని చేయడం నక్సలైట్ల సమస్య గణనీయంగా తగ్గేందుకు ఒక కారణంగా నిలిచింది.
మౌలిక సదుపాయాల్లో వృద్ధి కూడా నక్సలిజం అణచివేతకు సాయపడింది. 2014–2024 మధ్యకాలంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 11,503 కిలోమీటర్ల హైవేలు, 20 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు నిర్మించారు. ఫలితంగా అక్కడి ప్రజలు ఆర్థికంగా స్థిరపడేందుకు అవకాశాలు వచ్చాయి. వేలాదిగా ఏర్పాటు చేసిన మొబైల్ టవర్ల కారణంగా సమాచార వినిమయం సులువైంది. వెయ్యికి పైగా బ్యాంక్ శాఖలు, 937 ఏటీఎంల ఏర్పాటుతో ఈ ప్రాంతాలు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యాయి. నక్సలైట్ల ఆధ్వర్యంలో నడిచే ఆర్థిక వ్యవస్థ ప్రభావం తగ్గింది.
తగ్గిన ప్రభావం
ఈ చర్యల ఫలితం సుస్పష్టం. 2004–2014 దశతో పోలిస్తే ఇప్పుడు హింసాత్మక ఘటనలు 53 శాతం, భద్రతా దళాల మరణాలు 73 శాతం తగ్గాయి. సాధారణ ప్రజల మరణాలు కూడా 70 శాతం మేరకు తగ్గడం గమనార్హం. ఏడాది కాలంలో ఛత్తీస్‌గఢ్‌లోనే 380 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పో యారు. 1,194 మంది అరెస్ట్ అయ్యారు. 1,045 మంది లొంగిపోయారు. నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య దేశవ్యాప్తంగా 2014 నాటి 126 నుంచి 12కు చేరుకోవడం విశేషం.
నక్సలిజానికి ముగింపు పలికే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతాదళ సిబ్బంది కుటుంబాలను ఆదుకునే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. ఆయుష్మాన్ భారత్‌లో వీరిని భాగస్వాములను చేసింది. ఆరోగ్య సేవలను దగ్గరకు చేర్చింది. సుమారు లక్ష మందికి ఈ–హౌసింగ్ పోర్టల్ ద్వారా ఖాళీగా ఉన్న ఇళ్లలో ఆవాసం లభించింది. సెంట్రల్ పోలీస్ వెల్ఫేర్ ఫండ్‌కు తీసుకొచ్చిన మార్పుల కారణంగా ఎక్స్‌గ్రేషియా మొత్తం పెరిగింది. ‘భారత్ కే వీర్’ వంటి కార్య క్రమాలు వీరమరణం పొందిన వారి కుటుంబాలకు ఆధారంగా నిలుస్తున్నాయి.
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టడం చేయడంతోపాటు ఈ ప్రాంతాలకు బడ్జెట్ కేటాయింపులు కూడా మూడు రెట్లు పెరగడం విశేషం. నైపుణ్యాభివృద్ధి, గిరిజన యువతను భద్రతా దళాల్లో చేర్చుకోవడం, సామాజిక సేవా కార్యక్రమాలు ముమ్మరం చేయడం ద్వారా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలందరూ జన జీవన స్రవంతిలో భాగమయ్యేలా జాగ్రత్త తీసుకున్నారు.
నక్సలిజానికి చరమగీతం పాడే ఈ దశలో ఇప్పటివరకూ సాధించిన విజయాలన్నీ అభివృద్ధి, భద్రత అన్న రెండు అంశాల మేళవింపునకు నిదర్శనంగా నిలుస్తాయి. కృతనిశ్చయం, విధానపరంగా స్థిరత్వం మాత్రమే నక్సలిజం అంతానికి పరిష్కార మార్గాలని రుజువు చేశాయి.
- డాక్టర్ సువ్రోకమల్ దత్తా
వ్యాసకర్త కన్జర్వేటివ్ పొలిటికల్, ఫారిన్ పాలసీ ఎక్స్‌పర్ట్