Operation Kagar
-
ఆపరేషన్ కగార్.. అంటే?
దండకారణ్యంలోని ఛత్తీస్‌గఢ్‌లో నరమేధం జరుగుతున్నది. బీజేపీ ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో అంతిమ యుద్ధం ప్రకటించింది. మూడు శాతం ఆదివాసీ ప్రజలు జీవించే అబూఝ్మడ్, దంతెవాడ, కాలేకర్, కిష్టారం ప్రాంతాలున్న కీకారణ్యాన్ని 70 వేల మంది మిలిటరీ బలగాలతో చుట్టుముట్టింది. 630కి పైగా పోలీస్ క్యాంపులను ఏర్పాటు చేసింది. అటు గడ్చిరోలి నుంచి ఇటు ఒరిస్సా మల్కాన్‌గిరి (Malkangiri) దాకా వివిధ రాష్ట్రాల పోలీసు బలగాలను సమన్వయం చేసుకుంటూ సెర్చింగ్, వేట కొనసాగిస్తున్నది. 2026 మార్చ్ నాటికి మావోయిస్టు రహిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పదే పదే ప్రకటిస్తున్నారు. అందుకోసం మాజీలనూ, కోవర్టులనూ ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆరు నెలల కాలంలోనే దాదాపు 350 మందిని ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారు.అంతిమ యుద్ధం?బస్తర్ ప్రాంతాన్ని, అందులో ముఖ్యంగా అబూఝ్మాడ్ను కేంద్రంగా చేసుకొని నాటి పీపుల్స్‌వార్ పార్టీ, అదే నేటి మావోయిస్టు పార్టీ సాయుధ దళాల కేంద్రంగా ఉద్యమ నిర్మాణానికి పూనుకున్నది. దళాల సంఖ్య పెంచుకోవడమేగాక, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (పీజీఎల్ఏ)ని ఏర్పాటు చేశామని ప్రకటించింది. ఈ ప్రాంతంలో జనతన్ సర్కార్ ఏర్పడిందని ప్రకటించింది. వ్యవసాయం, స్కూళ్ళు, ఆర్థిక విధానం తామే నియంత్రిస్తున్నామని చెప్పుకొన్నది. అరుంధతీ రాయ్ (Arundhati Roy) నుంచి అంతర్జాతీయ మేధావుల దాకా, జర్నలిస్టుల నుంచి రచయితల దాకా జనతన్ సర్కార్ ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజా గెరిల్లాలు ప్రభుత్వ బలగాలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.4 వేల చదరపు కిలోమీటర్లకు పైగా వైశాల్యం, 233 ఆదివాసీ గ్రామాలు, 25 వేల ఆదివాసీ జనాభా గల, కొండలు, గుట్టలు, దట్టమైన అడవి ప్రాంతమది. క్లెమోర్‌మైన్స్‌తో అనేక మిలిటరీ బలగాల వాహనాలను పేల్చి, వందల సంఖ్యలో మిలిటరీ వారిని హతమార్చారు. ప్రజా కోర్టులు నిర్వహించి శిక్షలు వేశారు.వందలాది మంది చైతన్య స్ఫూర్తితో ఆ ప్రాంతానికి తరలి వెళ్ళి విప్లవ జీవితం గడపటం అసాధారణ విషయమే. త్యాగాలకు సిద్ధపడటం గొప్ప విషయం. ఆ మేరకు వారి అంకిత భావాన్ని గౌరవించాలి. అణచివేతకు వ్యతిరేకంగా, మిలిటరీ క్యాంపులకు వ్యతిరేకంగా, రోడ్లను, టెలిఫోన్ తీగలను మావోయిస్టులు ధ్వంసం చేశారు. తమ విముక్తి జోన్ లోకి రాజ్యం జొరబడొద్దని ఈ చర్యలు చేపట్టారు. ఇది ప్రభుత్వానికి సవాల్‌గా, అవకాశంగా కూడా మారింది. దానితో ఒక దశలో పాలకులు సల్వాజుడుంను నెలకొల్పి, ఆదివాసీ తెగల మధ్య వైషమ్యాలు సృష్టించి బీభత్సకాండ కొనసాగించారు. వివిధ డెడ్లైన్లతో వివిధ ఆపరేషన్లు చేపట్టారు. మావోయిస్టు చర్యలను పెద్ద ఎత్తున ప్రచారం చేసి, వారి తరఫున మాట్లాడే సమూహాలకు మాట్లాడలేని పరిస్థితిని కల్పించారు. ఆ తరువాత అధునాతన ఆయుధాలు, టెక్నాలజీతో జాయింట్ ఆపరేషన్లకు తెరలేపారు. అదే ఆపరేషన్ కగార్. అంటే అంతిమ యుద్ధం!మారాల్సిన పంథామూడు దశాబ్దాలుగా అబూఝ్మాడ్ (Abujhmarh) మావోయిస్టు ఉద్యమానికి బలమైన స్థావరంగా నిలబడింది. ఆదివాసులు ఉద్యమాలలో, గెరిల్లా దళాలలో భాగమయ్యారు. 1969–70లలో వరంగల్, ఖమ్మం, గోదావరి జిల్లాలలో కమ్యూనిస్టు విప్లవకారులు పని చేసిన నాటి పరిస్థితి నేడు ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. మావోయిస్టు పార్టీ అఫెన్సివ్ మిలిటరీ ఎత్తుగడల వలన సాయుధ శక్తిని సమకూర్చుకున్నది. ఆయుధాలు సేకరించడం, తయారు చేయడం, ప్రెషర్ బాంబులు, మందు పాతర్లతో పోలీసులు అడవికి రావాలంటేనే భయపడే రోజులు నడిచాయి. ఆదివాసులు తమ నిత్య జీవన సమరంలో మావోల హీరోయిక్ చైతన్యానికి ఆకర్షితులయ్యారు. కానీ ఒకవైపు పోలీసుల నిర్బంధం, మరోవైపు మావోయిస్టుల ప్రతి విధ్వంసాల మధ్య చాలామంది వలస పోయారు.ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో వర్గ పోరాటం ఎవరి మీద చేయాలి? అక్కడ భూస్వాములు లేరు. అరా కొరా ధనిక రైతులు ఉన్నారు. మిగిలిన వారంతా పేద రైతులు, ఆదివాసీ జనాభా. కాబట్టి భూస్వామ్య వ్యతిరేక పోరాటంతో వర్గ వైరుద్ధ్యం తీవ్రమయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వ బలగాల మీద, యంత్రాంగం మీద, వారు కొమ్ముకాస్తున్న, ఖనిజాల కోసం కోరలు చాస్తున్న కార్పొరేట్ కంపెనీల మీదనే పోరాటం చేయాలి. ప్రజాస్వామిక స్పందనలు నామమాత్రంగా ఉన్న ఈ కాలంలో, ఒక చిన్న మారుమూల చోట, ఆదివాసీ కొండ ప్రాంతాల్లో జనతన సర్కార్ ఏర్పడటం, నిలవడం అసాధ్యమైన విషయం.ఈ ప్రాంత ప్రజలు ఎన్నికలలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. ప్రభుత్వ విద్యాలయాల కోసం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు గెలవడం గమనార్హం. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ ప్రజా ప్రభుత్వ విముక్తి ప్రాంతం సాధ్యమా? పాత అతివాదపు అఫెన్సివ్ ఎత్తుగడలతో కాకుండా, ప్రస్తుత స్థితికి తగిన విధంగా విధానాలను రూపొందించుకోవడం మావోయిస్టు (Maoist) ఉద్యమానికి అవసరం. యుద్ధం చేస్తున్నామనే భావనలో నుంచి మావోయిస్టు పార్టీ బయటపడి, తగిన ప్రజా ఉద్యమక్షేత్రాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.చదవండి: మావోయిస్టులపై మోదీ సర్కారు ద్విముఖ పోరుఅలాగే, నెత్తురుటేర్లతో విప్లవోద్యమాలను నిర్మూలించలేరు. ఆ భావజాలం మళ్ళీ మళ్ళీ పురుడు పోసుకుంటూనే ఉంటుంది. వ్యవస్థ మారేంత వరకు ఈ పోరాటపు నెగళ్ళు సమాజం నిండా అలుముకుంటూనే ఉంటాయి. వీటిని నిర్బంధం ద్వారా దెబ్బతీయవచ్చేమో కానీ, ఆ వర్గ పోరాటం అనివార్యంగా జరగాల్సిందే! ప్రభుత్వ దమననీతిపై పోరాటం చేస్తూనే, భౌతిక పరిస్థితులకు అనుగుణంగా పోరాటాలను ఎంచుకోవడం విప్లవశక్తుల కర్తవ్యం.- పోటు రంగారావు సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) కార్యదర్శి -
ద్విముఖ పోరు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఇటీవలి ఎన్కౌంటర్లో ఒక లేఖ బయటపడింది. మహిళా కమాండర్ మన్ కీకి నక్సల్ నేత మోటూ రాసిన ఆ లేఖను చూస్తే మునుపు ఎన్నడూ లేని విధంగా నక్సలైట్లలో నిస్పృహ ఆవరించి ఉన్నట్లు అనిపిస్తుంది. బోడ్కా నుంచి గామ్‌పూర్ వరకూ, దోడితుమ్నార్ నుంచి తోడ్కా వరకూ నక్సలైట్లకు సురక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయిందని ఆ లేఖలో పేర్కొన్నారు. భద్రతా దళాల నిరంతర నిఘా, దాడులు ఈ పరిస్థితిని తెచ్చాయి. నక్సలైట్లను 2026 మార్చ్ 31లోగా ఛత్తీస్‌గఢ్‌లో లేకుండా చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటన నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. బస్తర్, అబూర్nుమాడ్ అడవుల నుంచి గరియాబంద్ వరకూ భద్రతాదళాలు నిత్యం కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏడాది కాలంలో సుమారు 300 మంది నక్సలైట్లు మరణించగా, మరెందరో అరెస్ట్ అయ్యారు. లేదా లొంగిపోయారు. భారత అంతర్గత భద్రతకు వామపక్ష తీవ్రవాదం చాలాకాలంగా సవాలు విసురుతున్నది. రాజ్యాంగానికి సమాంతరంగా వ్యవస్థలు ఏర్పాటు చేసిన నక్సలైట్లను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్థంగా అణచివేయగలిగింది. ఇందుకోసం ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అనుసరించింది. ఒకవైపు అభివృద్ధి కార్యకలాపాలకు పెద్దపీట వేస్తూనే, ఇంకోవైపు భద్రతా దళాల కార్య కలాపాలనూ ముమ్మరం చేసింది. నక్సలైట్ల రాజ్యంలోకి...సామాజిక, ఆర్థిక వెనుకబాటు, దశాబ్దాల నిర్లక్ష్యం కారణంగా దేశంలో నక్సలిజం పెరిగిపోయింది. ఇది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు. వివక్షకు గురైన ప్రజలు, ప్రాంతాలు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచు కోలేదు. ఫలితంగా అక్కడ తిరుగుబాటు పుట్టుకొచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం అభివృద్ధి విషయంలోని లోటుపాట్లను సరిచేయడంతోపాటు, దేశాద్యంతం రాజ్యాంగ పరిధిలోనే పనిచేసేలా ద్విముఖ వ్యూహం అనుసరించింది. పట్టు కోల్పోయిన ప్రాంతాలను భద్రతా దళాలు మళ్లీ తమ స్వాధీనంలోకి తీసుకోగలిగాయి. ఒకప్పటి నక్సలైట్ల రాజ్యంలో ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పాటు చేయగలిగాయి.అయితే ఈ మార్పు ఒక్కరోజులో జరిగిందేమీ కాదు. కచ్చితమైన ప్రణాళికతో అమలు చేసిన ఈ వ్యూహం నక్సలైట్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించింది. వ్యూహా త్మక మోహరింపులు, నిఘా వర్గాలను బలోపేతం చేయడం, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ వంటి భద్రతాదళాల సాయంతో అతివాదుల అడ్డాలను నిర్వీర్యం చేయగలిగారు. అననుకూల పరిస్థి తుల్లో పనిచేసే ఈ భద్రతా దళాలు అత్యాధునిక డ్రోన్లు, నిఘా పరికరాలు, కృత్రిమ మేధ, ఉపగ్రహ ఛాయా చిత్రాల వంటి వాటి సాయంతో నక్సలైట్ల ఆట కట్టిస్తున్నాయి. తీవ్రవాద సంస్థల ఆర్థిక వనరులపై ఉక్కుపాదం మోపడం కూడా కీలకమైంది. ఎన్ఐఏ, ఈడీ వంటి సంస్థలు కొన్ని కోట్ల రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకుని నక్సలైట్ల వెన్నువిరిచాయి. పీఎంఎల్ఏ చట్టాలతో కఠిన చర్యలు తీసుకోవడంతో నక్సలైట్లకు ఆర్థిక దన్నుగా నిలిచిన వారినీ కట్టడి చేయగలిగారు. ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ పని చేయడం నక్సలైట్ల సమస్య గణనీయంగా తగ్గేందుకు ఒక కారణంగా నిలిచింది. మౌలిక సదుపాయాల్లో వృద్ధి కూడా నక్సలిజం అణచివేతకు సాయపడింది. 2014–2024 మధ్యకాలంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 11,503 కిలోమీటర్ల హైవేలు, 20 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు నిర్మించారు. ఫలితంగా అక్కడి ప్రజలు ఆర్థికంగా స్థిరపడేందుకు అవకాశాలు వచ్చాయి. వేలాదిగా ఏర్పాటు చేసిన మొబైల్ టవర్ల కారణంగా సమాచార వినిమయం సులువైంది. వెయ్యికి పైగా బ్యాంక్ శాఖలు, 937 ఏటీఎంల ఏర్పాటుతో ఈ ప్రాంతాలు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యాయి. నక్సలైట్ల ఆధ్వర్యంలో నడిచే ఆర్థిక వ్యవస్థ ప్రభావం తగ్గింది.తగ్గిన ప్రభావంఈ చర్యల ఫలితం సుస్పష్టం. 2004–2014 దశతో పోలిస్తే ఇప్పుడు హింసాత్మక ఘటనలు 53 శాతం, భద్రతా దళాల మరణాలు 73 శాతం తగ్గాయి. సాధారణ ప్రజల మరణాలు కూడా 70 శాతం మేరకు తగ్గడం గమనార్హం. ఏడాది కాలంలో ఛత్తీస్‌గఢ్‌లోనే 380 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పో యారు. 1,194 మంది అరెస్ట్ అయ్యారు. 1,045 మంది లొంగిపోయారు. నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య దేశవ్యాప్తంగా 2014 నాటి 126 నుంచి 12కు చేరుకోవడం విశేషం. నక్సలిజానికి ముగింపు పలికే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతాదళ సిబ్బంది కుటుంబాలను ఆదుకునే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. ఆయుష్మాన్ భారత్‌లో వీరిని భాగస్వాములను చేసింది. ఆరోగ్య సేవలను దగ్గరకు చేర్చింది. సుమారు లక్ష మందికి ఈ–హౌసింగ్ పోర్టల్ ద్వారా ఖాళీగా ఉన్న ఇళ్లలో ఆవాసం లభించింది. సెంట్రల్ పోలీస్ వెల్ఫేర్ ఫండ్‌కు తీసుకొచ్చిన మార్పుల కారణంగా ఎక్స్‌గ్రేషియా మొత్తం పెరిగింది. ‘భారత్ కే వీర్’ వంటి కార్య క్రమాలు వీరమరణం పొందిన వారి కుటుంబాలకు ఆధారంగా నిలుస్తున్నాయి.నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టడం చేయడంతోపాటు ఈ ప్రాంతాలకు బడ్జెట్ కేటాయింపులు కూడా మూడు రెట్లు పెరగడం విశేషం. నైపుణ్యాభివృద్ధి, గిరిజన యువతను భద్రతా దళాల్లో చేర్చుకోవడం, సామాజిక సేవా కార్యక్రమాలు ముమ్మరం చేయడం ద్వారా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలందరూ జన జీవన స్రవంతిలో భాగమయ్యేలా జాగ్రత్త తీసుకున్నారు.నక్సలిజానికి చరమగీతం పాడే ఈ దశలో ఇప్పటివరకూ సాధించిన విజయాలన్నీ అభివృద్ధి, భద్రత అన్న రెండు అంశాల మేళవింపునకు నిదర్శనంగా నిలుస్తాయి. కృతనిశ్చయం, విధానపరంగా స్థిరత్వం మాత్రమే నక్సలిజం అంతానికి పరిష్కార మార్గాలని రుజువు చేశాయి.- డాక్టర్ సువ్రోకమల్ దత్తా వ్యాసకర్త కన్జర్వేటివ్ పొలిటికల్, ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్ -
అణచివేతే పరిష్కారమా?!
చాన్నాళ్లుగా ఘర్షణాత్మక ప్రాంతంగా ముద్రపడిన ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మరోసారి మావోయిస్టులకూ, భద్రతా బలగాలకూ మధ్య గురువారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 30 మంది మావోయిస్టులూ, ఒక డీఆర్జీ జవాను మరణించారు. ఈ ఏడాది ఇంతవరకూ 113మంది నక్సలైట్లు మరణించారు. నిరుడు ఇదేకాలంలో 29 మంది ఎదురుకాల్పుల్లో చనిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాజ్యసభలో చేసిన ప్రసంగం ప్రభుత్వ దృఢ సంక ల్పాన్ని తెలియజెబుతుంది. మావోయిస్టులను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా తుడిచి పెడతామని ఆయన ప్రకటించారు. ఈ ఏడాది ఇంతవరకూ 104 మందిని అరెస్టు చేశామని,164 మంది లొంగిపోయారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట.ముఖ్యంగా 3,900 చదరపు కిలోమీటర్ల వైశాల్యంగల దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మఢ్ అటవీప్రాంతంలోకి మావోయిస్టులు మినహా అన్యులు ప్రవేశించటం అసంభవమన్న అభిప్రాయంవుండేది. అక్కడే మావోయిస్టు శిక్షణ శిబిరాలు, భారీ ఆయుధ డంప్‌లు, ఆహారపదార్థాల గోడౌన్ లుండేవి. పల్లెసీమల్లో వారికి గట్టి పట్టుండేది. ఇప్పుడక్కడ దాదాపు 300 వరకూ కేంద్ర బలగాల స్థావరాలున్నాయి. ఇవిగాక సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ దళాల శిబిరాలున్నాయి. బస్తర్ అడవుల్లోఅత్యంత మారుమూల ప్రాంతం కావటంవల్ల, చుట్టూ వున్న ఎత్తయిన కొండలు, వాటిపై దట్టంగా విస్తరించిన వృక్షాలుండటంవల్ల మావోయిస్టులకు అది రక్షణ కవచంగా ఉండేది. దాన్ని ‘విముక్త ప్రాంతం’గా పరిగణించేవారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటంవల్లే వారి అణచివేత వేగం పుంజుకుందన్న అభిప్రాయం పాక్షిక సత్యం మాత్రమే. యూపీయే ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మావోయిస్టులను ‘జాతీయ భద్రతకు పెనుముప్పు’గా ప్రకటించారు. తదనుగుణంగా అనేక చర్యలు మొదలయ్యాయి. అప్పటి హోంమంత్రి చిదంబరం ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరుతో నక్సల్స్ ఏరివేతకు చర్యలు తీసుకున్నారు. అదిప్పుడు ‘ఆపరేషన్ కగార్’ అయింది. ఈ క్రమంలోనే మావోయిస్టులపై భద్రతా బలగాలు క్రమేపీ పైచేయి సాధించాయి. కేంద్రంలో ఎవరున్నా నక్సల్స్ అణచివేతలో ఛత్తీస్‌గఢ్‌కు పూర్తి సహకారం అందింది.రాజ్యానికుండే ఆయుధ సంపత్తి, దాని సుశిక్షిత భద్రతా బలగాల ముందు ఎవరూ సరి పోరన్నది వాస్తవం. ఆ అంబులపొదిలో ఇప్పుడు ఆధునిక సాంకేతికత చేరింది. అందువల్లే కావొచ్చు... దట్టమైన అరణ్యాల్లో సైతం మావోయిస్టు దళాల కదలికలను వెంటనే నిఘా వర్గాలు గుర్తించగలుగుతున్నాయి. అబూజ్‌మÉŠ అరణ్యంలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు ఆరా తీయగలిగేలా నిఘా డ్రోన్లు సంచరిస్తున్నాయి. ఇప్పటికేవున్న భద్రతా బలగాలకు అదనంగా గత నెలలో మరో 2,500 మంది జవాన్లను తరలించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు ప్రకటించాయి. జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) పేరిట ఏర్పాటు చేసిన బలగాలు కేంద్ర దళాల చేతుల్లో తిరుగు లేని ఆయుధం. ఎందుకంటే డీఆర్జీలో దాదాపు అందరూ ఆదివాసీ తెగలవారు. మావోయిస్టుల్లో పనిచేసినవారు. వీరికి ఆ ప్రాంతం కొట్టిన పిండి. ఎక్కడున్నామో, ఎటుపోతున్నామో తెలియని దుర్గ మారణ్యాల్లో వీరు సునాయాసంగా చొచ్చుకెళ్లగలుగుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టుల్లో పనిచేసి వెలుపలికొచ్చినవారినీ, ఇతరులనూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ‘సల్వాజుడుం’ పేరిట సమీకరించి ఆయు ధాలిచ్చి, వారిద్వారా మావోయిస్టుల్ని అణచడానికి ప్రయత్నించింది. ఇలా ప్రైవేటు సైన్యాలను రూపొందించటం రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దురదృష్టమేమంటే భద్రతా బలగాలకూ, మావోయిస్టులకూ మధ్య జరిగే పోరుతో సంబంధంలేని సాధారణ ఆదివాసీ ప్రజానీకం సైతం భయంతో బతకాల్సి వస్తున్నది. ఘర్షణ జరిగే ప్రాంతాల్లో ఎక్కడైనా ఇదే పరిస్థితి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ జిల్లాల్లో, ఏజెన్సీప్రాంతాల్లో నక్సల్స్‌కు సహకరిస్తున్నారన్న అనుమానంతో సాధారణ పౌరులను పోలీసులు వేధించే వారన్న అభిప్రాయం వుండేది. అలాగే నక్సల్స్ సైతం ఇన్ఫార్మర్ల పేరిట అనేకుల్ని హతమార్చిన ఉదంతాలు ఉండేవి. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లలో పదులకొద్దీమంది మరణిస్తున్నారు. కానీ వారంతా మావోయిస్టులేనా? ఆ ఉదంతాలు జరిగాక హక్కుల సంఘాలు చేసే ప్రకటనలు తప్ప అక్కడికి మీడియా వెళ్లి జరిగిందేమిటో చెప్పే పరిస్థితులు లేవు. అటు మావోయిస్టులు సైతం ఛత్తీస్‌గఢ్‌లో ఇన్ఫార్మర్ల పేరిట కొందరిని హతమారుస్తున్న ఉదంతాలు వెల్లడవుతున్నాయి.వచ్చే ఏడాదికల్లా మావోయిస్టుల్ని అంతం చేస్తామన్న అమిత్ షా ప్రకటనలు నెరవేరే అవకాశం ఉండొచ్చని వరస ఉదంతాలు గమనిస్తే అర్థమవుతుంది. 2013లో తొమ్మిది రాష్ట్రాల్లోని 126 జిల్లాలు నక్సల్స్ ప్రభావంలోవుంటే నిరుడు ఆ సంఖ్య 38కి పడిపోయింది. రహదారుల నిర్మాణం కూడా జోరందుకుంది. కానీ ఇవి మాత్రమే తిరుగుబాటునూ, అసంతృప్తినీ అంతర్థానం చేస్తాయని భావించటం పొరపాటు. ఆదివాసీ సంస్కృతినీ, అక్కడి సహజవనరులనూ పరిరక్షించటానికి చర్యలు తీసు కుంటేనే... ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కల్పించి, రాజ్యాంగం పూచీపడిన హక్కులు సక్రమంగా అమలు చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. ఇందిరాగాంధీ హయాంలో బీడీ శర్మ వంటి అంకిత భావంతో పనిచేసిన ఐఏఎస్ అధికారులు బస్తర్ ప్రాంత అభివృద్ధికీ, ఆదివాసీల సంక్షేమానికీ ఎన్నో పథకాలు అమలు చేశారు. ఆ నమూనాను ఆదర్శంగా తీసుకోవాలి. -
ఎవరికి వారే.. వేసవి వ్యూహాలు
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను కేంద్ర బలగాలు చేపట్టాయి. ఈక్రమంలోనే బస్తర్ అడవుల్లో నెత్తురు ఏరులై పారింది. ఎదురుకాల్పుల్లో 300 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. అయితే ప్రభుత్వ దళాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు (Maoists) ఎదురుదాడులకు సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవేసవి వ్యూహం..వేసవి (Summer) సమీపించడంతో ఆకులు రాలిపోయి అడవులు వెలవెలబోతాయి. దీంతో ప్రతి వేసవిని మావోయిస్టులు గడ్డుకాలంగానే పరిగణిస్తారు. అడవిలో చాటు తగ్గిపోవడంతో పాటు నీటి వనరుల లభ్యత పరిమితంగా ఉంటుంది. దీంతో అడవుల్లోకి పోలీసులు, భద్రతా దళాలు చొచ్చుకురాకుండా ‘ట్యాక్టిక్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్’ పేరుతో ముందుగానే ఎదురుదాడులకు దిగే వ్యూహాన్ని ఆ పార్టీ అమలు చేస్తోంది. కానీ పెరిగిన నిర్బంధం వల్ల ప్రస్తుతం బస్తర్ అడవుల్లో మావోయిస్టులు, వారి సానుభూతిపరులకు మధ్య సంబంధాలు గతంలో పోలిస్తే తగ్గిపోయాయి. సానుభూతిపరుల నుంచి అవసరమైన మేర సాయం అందే పరిస్థితి లేదు. ఈ లోటును పూడ్చుకునేందుకు తమ సాయుధ బలగాలనే ఏకం చేసి వ్యూహాత్మక దాడులు చేయాలనే ప్లాన్‌లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం.ఏకమవుతున్న దళాలు.. బస్తర్ అడవులు కేంద్రంగా కేంద్ర కమిటీతో పాటు వివిధ రాష్ట్రాలు, ఏరియా కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ కమిటీలకు రక్షణగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సాయుధులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి తోడు ప్రతి కమిటీకి సాయుధ దళాలు ఉంటాయి. వేసవి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ భద్రతా బలగాలను ఎదుర్కోవాలంటే దళాలు వేర్వేరుగా కాకుండా కలిసికట్టుగా దాడులు చేయాలనే వ్యూహానికి మావోలు పదును పెడుతున్నట్టు సమాచారం. ఈ మేరకు దండకారణ్యం, అబూజ్మడ్ అడవుల్లో తమకు పట్టున్న ప్రాంతానికి వివిధ దళాలు చేరుకున్నట్టు తెలుస్తోంది.సురక్షితంగా ఎంట్రీ–ఎగ్జిట్.. ఒకప్పుడు రెడ్ కారిడార్ అంటే నేపాల్ నుంచి దక్షిణ భారతదేశం వరకు ఉండేది. ప్రస్తుతం బస్తర్ అడవులు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ చాలా ప్రాంతం భద్రతా దళాల అధీనంలోకి వెళ్లింది. అయినప్పటికీ దక్షిణ బస్తర్, ఏవోబీ, ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఇప్పటికీ మావోల గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో తమకు పట్టు ఉన్న ప్రాంతానికి చేరుకుంటున్న దళాలు... ఆయా ప్రాంతాల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్, రిట్రీవ్ రూట్లు సేఫ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తమ స్థావరాల సమీపంలోకి భద్రతా దళాలు వస్తే భీకరంగా ఎదురుదాడి చేయాలని మావోయిస్టులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జవాన్ల జోరు తగ్గిందా? ఈ ఏడాది ఆరంభంలో జనవరి 16, 21, ఫిబ్రవరి 9న భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో 80 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సైతం ప్రాణాలు కోల్పోయారు. కానీ గడిచిన నెలరోజులుగా భారీ ఎన్కౌంటర్లు ఎక్కడా జరగలేదు. నక్సలైట్ల వేసవి వ్యూహాలను పసిగట్టడం వల్లనే గడిచిన నెల రోజులుగా గాలింపు చర్యలను భద్రతా దళాలు ఆచితూచి చేపడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దూకుడుగా అడవుల్లోకి వెళ్లి మావోయిస్టుల వలలో చిక్కితే భారీగా ప్రాణనష్టం జరగడంతో పాటు జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్లే కూంబింగ్‌కు సమాంతరంగా బేస్ క్యాంపులను సుస్థిరం చేయడం, కొత్తగా అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై భద్రతా దళాలు ఫోకస్ చేస్తున్నాయి. కవ్వింపు చర్యలు తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నప్పటికీ మార్చి 6న దంతేవాడ జిల్లా కేంద్రానికి 40 కి.మీ. దూరంలో బస్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారు. విప్లవ ద్రోహులుగా పేర్కొంటూ అక్కడ కొన్ని కుటుంబాలను ఊరు వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. గాలింపు చర్యల్లో భద్రతా దళాల దూకుడు తగ్గడంతో వారిని రెచ్చగొట్టి అడవుల్లోకి రప్పించేందుకే మావోయిస్టులు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రి స్వాధీనందుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతల్నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోమ్గూడ క్యాంపు బలగాలు ఆదివారం మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గోమ్గూడ క్యాంపు నుంచి డీఆర్జీ, కోబ్రా, 241 బెటాలియన్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గోమ్గూడ క్యాంపు పరిధిలోని జాలేర్గూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు స్పైక్(పదునైన కడ్డీలు)లను ఏర్పాటు చేశారు. వాటిని తొలగించుకుంటూ గాలిస్తుండగా.. మావోయిస్టులకు చెందిన ప్రింటింగ్ స్థావరం బయటపడింది. అక్కడ మావోయిస్టులు దాచిపెట్టిన ప్రింటర్లు, ఇన్వర్టర్ యంత్రాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మావోయిస్టులకు లొంగుబాటే శరణ్యమా? -
మావోలకు లొంగుబాటే శరణ్యమా?
సాక్షి, హైదరాబాద్: భద్రతా బలగాల భారీ వేట.. వృద్ధాప్యానికి చేరిన మావోయిస్టు (Maoist) అగ్ర నాయకులు.. తరుముకొస్తున్న ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్... వెరసి అన్నల్లో అంతర్మథనం మొదలైందనే చర్చ జరుగుతోంది. దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన మావోయిస్టులకు గత మూడేళ్లుగా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కో ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పూర్తి పట్టున్న ప్రాంతాలు సైతం సాయుధ పోలీసు బలగాల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో కొందరు మావోయిస్టులు లొంగుబాట పట్టారు. గత నెలన్నరరోజుల్లో తెలంగాణ (Telangana) పోలీసుల ఎదుట కొందరు కీలక నాయకులు లొంగిపోయిన విషయం తెలిసిందే.ఇటీవల మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఈమె దివంగత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య. పద్మ 27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు. అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొసా ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయింది. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు కొందరు ఆకర్షితులవుతున్నారు.మరోవైపు మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కేషా లొంగిపోయిందని...ఆమె లొంగుబాటు సందర్భంగా అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కేషాతోపాటు ఇటీవల కొందరు మావోయిస్టుల లొంగుబాట్ల వెనుకున్న పరిస్థితికి అద్దం పడుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలా పలు కీలక స్థానాల్లో పనిచేసిన మావోయిస్టు సీనియర్ నాయకులు వరుస లొంగుబాట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో గతేడాది 41 మంది సరెండర్ 2024లో తెలంగాణ పోలీసుల ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరు స్పెషల్ జోనల్ కమిటీ, ఒకరు స్టేట్ కమిటీ సభ్యుడు, 16 మంది ఏరియా కమిటీ సభ్యులు, మిగిలినవారు పలు కేడర్లకు చెందినవారు. 85 మంది మావోయిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. నాయకుల వయో‘భారం’మావోయిస్టు పార్టీకి గుండెకాయ వంటి సెంట్రల్ కమిటీ సభ్యుల్లో దాదాపు అంతా ఐదు పదుల వయసు దాటినవారే ఉన్నారు. మావోయిస్టులను ముందుండి నడిపించాల్సిన అగ్రనాయకత్వం వయోభారంతోపాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. పైగా తెలంగాణ రాష్ట్ర కమిటీలోనూ స్థానికులకంటే ఇతర రాష్ట్రాలవారే ఎక్కువగా ఉన్నారు. వీరిలోనూ కీలక నేతలు కూడా వయసులో పెద్దవారే. వీరంతా ప్రస్తుతం సాయుధ పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను సమర్థంగా ఎదుర్కోలేని పరిస్థితి. ఇలా ప్రతి అంశంలోనూ మావోయిస్టులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కిందిస్థాయి నాయకత్వానికి భరోసా ఇచ్చి నడిపించేవారు లేకుండాపోయారు. మరికొన్ని ప్రధాన లొంగుబాట్లు ఇలా...ఈ ఏడాది ఫిబ్రవరి 12న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 18న చర్ల పోలీస్‌స్టేషన్‌లో కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 11న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్‌ఖేర్ ఎదుట ఒక మావోయిస్టు లొంగిపోయాడు. ఈ ఏడాది జనవరి 2న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య విమల చంద్ర సీదం అలియాస్ తారక్క గడ్చిరోలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అలువ స్వర్ణ 2024 డిసెంబర్ 25న ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. అక్టోబర్ 2, 2024లో పెదబయలు ఏరియా కమిటీకి చెందిన 17 మంది మావోయిస్టులు పాడేరు జిల్లా ఎస్పీ అమిత్‌బర్దర్ ఎదుట లొంగిపోయారు. డిసెంబర్ 10 2023న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాల్లో 20 మంది మావోయిస్టులు స్థానిక ఎస్పీ ఎదుట లొంగిపోయారు. జనవరి 1, 2022న సుక్మా జిల్లా పోలీసుల ఎదుట 44 మంది లొంగిపోయారు. జనవరి 28, 2022న విశాఖపట్నం పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. -
చేజారుతున్న కర్రిగుట్టలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్ కగార్ ఫలితంగా.. దండకారణ్యంలో తమకు పట్టున్న ఒక్కొక్క ప్రాంతాన్ని మావోయిస్టులు (Maoists) కోల్పోతున్నారు. ఈనెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టలు ప్రాంతం సైతం మావోయిస్టుల చేజారిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.జాయింట్ టాస్క్ ఫోర్స్ ..కర్రిగుట్టలు కేంద్రంగా మావోయిస్టులు తెలంగాణలో మళ్లీ ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గతేడాది జూలై 4న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) దృష్టికి తీసుకెళ్లారు. మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్ట వేసేలా.. ఈ గుట్టలకు సరిహద్దుగా ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక, భద్రాద్రి జిల్లా చర్ల మండలం కొండవాయిలో సీఆర్పీఎఫ్ (CRPF) జాయింట్ టాస్క్ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం జూలై 19న కర్రిగుట్టల్లోకి స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోగా.. మిగిలిన దళ సభ్యులు తప్పించుకున్నారు. దీంతో గాలింపు ఉధృతం చేసే లక్ష్యంతో అదనపు బలగాలు ఈ గుట్టల్లోకి వెళ్లాయి. ఆ సమయాన వర్షాల కారణంగా పొంగిన వాగులు, వంకలతో స్పెషల్ పార్టీ పోలీసులంతా అడవిలో చిక్కుకుపోయారు. వీరికి వాయుమార్గంలో సాయమందించడం వీలు పడలేదు. దీంతో ప్రతికూల పరిస్థితుల నడుమ సుమారు 60 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ తెలంగాణ సరిహద్దుకు.. తెలంగాణ పోలీసులు చేరుకోగా.. చివరకు వారిని హెలీకాప్టర్ సాయంతో కాపాడారు.కర్రిగుట్టల్లో భద్రతా దళాలు కర్రిగుట్టల్లో ఛత్తీస్‌గఢ్ వైపు పూజారి కాంకేర్ – మారేడుబాక అటవీ ప్రాంతంలోని మావోయిస్టులు, భద్రతా దళాల నడుమ ఈనెల 16న ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అధికారిక లెక్కల ప్రకారం 12 మంది మావోయిస్టులు చనిపోగా.. మిగిలిన వారు తప్పించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ప్రస్తుతం కర్రిగుట్టల్లో సుమారు రెండు వేల మందికి పైగా సంయుక్త భద్రతా దళాల జవాన్లు కూంబింగ్ చేస్తూ.. ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే వేసవి చివరి నాటికి ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి నామమాత్రం చేయాలని భద్రతా దళాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే ఈ దాడిలో మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు కనుగొన్నాయి. అయితే, ఇప్పటికీ మావోయిస్టు శిబిరాలు భద్రతా దళాలకు చిక్కకపోవడం.. ఈ గుట్టల్లో నెలకొన్న సంక్లిష్టతను చెబుతోంది.మావోయిస్టుల అడ్డా బస్తర్ దేశంలోనే మావోయిస్టులకు బస్తర్ ప్రాంతం అడ్డాగా ఉంది. ఇక్కడి నుంచే బస్తరేతర ప్రాంతాలకు చెందిన వివిధ రాష్ట్ర, డివిజన్, ఏరియా కమిటీలు పని చేస్తున్నట్టు సమాచారం. బస్తర్‌కు చెందిన కీలక కమిటీలైన దండకారణ్య స్పెషల్ జోనల్, దక్షిణ బస్తర్ జోన్ వంటి కమిటీలు సంచరిస్తూ పని చేస్తుంటాయి. కానీ, బస్తర్ బయటి ప్రాంతాలకు చెందిన కమిటీలు ఎక్కువగా శిబిరాల్లోనే షెల్టర్ తీసుకుంటాయి. ఈ కమిటీలకు చెందిన వివిధ దళాలు.. అప్పుడప్పుడు తమ సంబంధిత ప్రాంతాలకు వెళ్లి తిరిగి షెల్టర్ జోన్లకు చేరుకుంటున్నా యి. అందులో భాగంగానే తెలంగాణతో పాటు ఇతర డివిజన్, ఏరియా కమిటీలు కర్రిగుట్టలు కేంద్రంగా షెల్టర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పాల్వంచ – మణుగూరు, ఏటూరునాగారం – మహదేవపూర్ ఏరియా కమిటీల సభ్యులు కర్రిగుట్టల నుంచి తెలంగాణకు వచ్చి గతేడాది జరిగిన ఎన్కౌంటర్లలో 15 మంది చనిపోయారు.రాష్ట్రాలకు సహజ సరిహద్దుగా..తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సహజ సరిహద్దుగా కర్రిగుట్టలు ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో.. ఇంద్రావతి నది గోదావరిలో కలిసే చోటునుంచి ప్రారంభమయ్యే కర్రిగుట్టలు.. చర్ల మండలంలో తాలిపేరు వాగు గోదావరిలో కలిసే వరకు ఇంచుమించు 100 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంటాయి.చదవండి: వరుస ఎదురుదెబ్బలు.. మావోయిస్టుల సంచలన నిర్ణయం గుట్టలకు ఆవలి వైపు బీజాపూర్ జిల్లా ఉండగా.. తెలంగాణ వైపు ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కొద్ది భాగం ఉంటాయి. ఈ గుట్టల మధ్య పుష్కలమైన జలవనరులు ఉన్నాయి. దీంతో ఏళ్ల తరబడి ఈ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉపయోగపడుతోంది. తెలంగాణలో పట్టు కోసం మావోయిస్టులు ఇక్కడి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.