
ములుగు, సాక్షి: తొమ్మిది రోజులపాటు కొనసాగిన ఆపరేషన్ కగార్‌లో భద్రతా బలగాలు మావోయిస్టులపై పైచేయి సాధించాయి. కర్రెగుట్టలపై మొత్తానికి పట్టు సాధించాయి. బుధవారం సాయుధ బలగాలు గుట్టలపై జాతీయ జెండాను ఎగరేశాయి. అంతేకాదు.. త్వరలో అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా 10 వేలకు పైగా సాయుధ బలగాల సిబ్బందితో కర్రెలగుట్టను చుట్టుముట్టారు. డ్రోన్‌లు, హెలికాఫ్టర్‌లతో కూంబింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మరణించిన సంగతీ తెలిసిందే.
డీఆర్‌జీ బస్తర్ ఫైటర్, కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు ఈ కూంబింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రాయ్‌పూర్ నుంచి ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఐబీ చీఫ్ ఇవాళ నేరుగా కర్రెలగుట్టకు చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఆపరేషన్‌లో పాల్గొన్న టీం మొత్తాన్ని వెనక్కి రప్పించి.. అక్కడికి కొత్త టీంను మోహరింపజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో సీఆర్‌పీఎఫ్ అక్కడ బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయనుంది. ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్‌గఢ్‌లకు ఉపయోగపడేలా ఈ బేస్ ఉండనున్నట్లు సమాచారం.