
ములుగు, సాక్షి: తెలంగాణలో సరిహద్దులో మంగళవారం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ములుగు జిల్లా కర్రెగుట్టలో(Karreguttalu) భారీ సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగగా.. ఛత్తీస్‌గఢ్ వైపు నుంచి సీఆర్‌పీఎఫ్ బలగాలు ప్రతి కాల్పులకు దిగడంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది.
కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలోకి వస్తోంది. అయితే.. కర్రెగుట్టల దండకారణ్యం వైపు రావొద్దంటూ ఆ మధ్య మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాన్ని ములుగు పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఖండించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు.


సుమారు రెండు వేల మంది భద్రతా బలగాలతో కర్రెగుట్టలను రౌండప్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా.. హిడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన బలగాలు సోమవారం అర్ధరాత్రి నుంచే కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించి అణువణువు గాలిస్తున్నారు . దీంతో ఆ రీజియన్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
కర్రెగుట్టకు సమీపంలో గల పెనుగోలు, కొంగాల, అరుణాచల పురం, బొల్లారం గ్రామాలు, అలాగే.. వెంకటాపురం మండలంలో గల సరిహద్దు గ్రామాలు, పెంక వాగు, మల్లాపురం, కర్రెవానిగుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు కలిపాక, సీతారాంపురం గ్రామాల్లో, కర్రెగుట్ట పైన ఉన్న పామనూరు, ముకునూరు, చెలిమెల, తడపల , జెల్ల గ్రామాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.