![31 Maoists dead Encounter In Chhattisgarh At Indravati National Park](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/encounter.jpg.webp?itok=kofnPOvC)
మావోయిస్టుల మృతదేహాలు
ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో భారీ ఎన్‌కౌంటర్
31 మంది మావోయిస్టులు మృతి
ఇద్దరు జవాన్లు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
తెలంగాణ రాష్ట్ర కమిటీ లక్ష్యంగా సాగిన ఆపరేషన్
మృతుల్లో చాలా వరకు జన మిలీషియా సభ్యులే..
తెలంగాణకు చెందిన కీలక మావోయిస్టు కూడా ఉన్నట్టు ప్రచారం
మృతదేహాల గుర్తింపు చేపడితే వివరాలు వెల్లడయ్యే చాన్స్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి ఎరుపెక్కాయి. అక్కడి ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో ఆదివారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. చనిపోయిన మావోయిస్టుల వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఇంద్రావతి ఏరియా కమిటీలు ఒకేచోట సంచరిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీనితో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లకు చెందిన జవాన్లు కూంబింగ్ చేపట్టారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8 గంటలకు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్ జరిగింది. అనంతరం ఘటనా స్థలంలో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్‌లో రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఇన్సాస్, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లను, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వా«దీనం చేసుకున్నాయి.
మృతుల్లో తెలంగాణ నేతలు?
ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీ షెల్టర్ తీసుకోగా, ఇంద్రావతి ఏరియా కమిటీ రక్షణగా ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీనితో వివిధ భద్రతా దళాలకు చెందిన 650 మందికిపైగా జవాన్లు వేర్వేరు దిశల నుంచి శుక్రవారం రాత్రి కూంబింగ్ చేపట్టారు. శనివారం రాత్రికల్లా మావోయిస్టులు బస ప్రదేశాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి.
ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఎన్‌కౌంటర్ మృతుల్లో ఎక్కువ మంది జనమిలీషియా సభ్యులే ఉన్నట్టు సమాచారం. వారితోపాటు తెలంగాణ కమిటీకి చెందిన కీలక నేత కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ మొదలైతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది.
టార్గెట్ చేసి.. రెండో సారి..
భద్రతా దళాలు కొన్ని నెలలుగా మావోయిస్టు తెలంగాణ కమిటీ టార్గెట్‌గా పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని పూజారీ కాంకేర్ అడవులను జల్లెడపట్టడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జనవరి 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు చనిపోగా.. మిగిలినవారు తప్పించుకున్నారు. ఆ ఘటనలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్టు ప్రచారం జరిగింది. కానీ దామోదర్ సురక్షితంగానే ఉన్నారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి తెలంగాణ కమిటీ లక్ష్యంగా ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
దండకారణ్యంపై భద్రతా దళాల పట్టు
మావోయిస్టులు స్థాపించిన జనతన సర్కారుకు దండకారణ్యమే కేంద్ర బిందువుగా నిలిచింది. కానీ గడిచిన ఏడాదిలో భద్రతా బలగాలు దండకారణ్యాన్ని క్రమంగా తమ ఆ«దీనంలోకి తెచ్చుకుంటున్నాయి. గత ఏడాది చివరిలో కొండపల్లిలో భద్రతా దళాల క్యాంపు ఏర్పాటైన తర్వాత.. దండకారణ్యం తమకు సురక్షితం కాదని మావోయిస్టులు నిర్ణయానికి వచ్చారు. అక్కడున్న వివిధ కమిటీలు, దళాలకు చెందిన కీలక నేతలు సమీపంలో ఉన్న టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు తరలివెళ్లినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం.
టైగర్ రిజర్వ్‌లపై ఫోకస్
ఇంద్రావతి నేషనల్ పార్క్ 2,779 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. దీన్ని 1983లో టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. మావోయిస్టుల అడ్డాలైన అబూజ్‌మడ్, దండకారణ్యం మధ్య ఈ అడవి వారధిగా నిలిచింది. ఇందులో సగానికిపైగా మావోయిస్టుల ఆ«దీనంలోనే ఉంది. ఫారెస్టు గార్డులు కూడా అక్కడ కాలు పెట్టలేని పరిస్థితి ఉందని అంటారు. ఇలా టైగర్ రిజర్వులలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులపై కొన్నేళ్లుగా భద్రతా దళాలు ఫోకస్ చేశాయి. ఇంతకుముందు ఉదంతి – సీతానది టైగర్ రిజర్వ్‌లో భాగంగా ఉన్న ఘరియాబండ్ అడవుల్లో జనవరి 24న జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సహా 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు ఇంద్రావతి రిజర్వు ఫారెస్ట్‌లో ఏకంగా 31 మంది మృతి చెందారు.
గడువు కంటే ముందే మావోయిస్టుల అంతం: అమిత్‌షా
మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్‌కు ‘ఇంద్రావతి’తో భారీ విజయం దక్కిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గడువుగా పెట్టుకున్న 2026 మార్చి కంటే ముందే దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్నారు. ఎన్‌కౌంటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు దేశం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆ జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా దళాలకు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయ్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ వేగంగా జరుగుతున్నాయన్నారు.
40 రోజుల్లో 81 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది మొదలైన 40 రోజుల్లో 81 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. అందులో 65 మంది బస్తర్‌లో జరిగిన ఘటనల్లో కన్నుమూశారు. గతేడాది ఛత్తీస్‌గఢ్‌లో 217 మంది మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment