Maoist activities
-
‘బస్తర్’లో మావోయిజం ఖాళీ!
ఒకప్పుడు పోలీసులపైకి మెరుపు దాడులు, మందుపాతరల పేలుళ్లు, తుపాకీ మోతలు, బుల్లెట్ల శబ్దాలు, వరుస ఎన్కౌంటర్లతో రక్తమోడిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బస్తర్ పేరు చెబితేనే భయపడేంతగా గజగజలాడించిన మావోయిస్టులు ఇప్పుడు అక్కడ తమ పట్టును కోల్పోయారని కేంద్రం పేర్కొంది. ప్రాభల్యం తగ్గిపోవడం, పోలీసుల ముమ్ముర ఏరివేత కార్యక్రమాలు, మరోవైపు పునరవాస కల్పనా చర్యలు, ఇంకోవైపు అభివృధ్ధి కార్యక్రమాల కారణంగా ఇప్పుడు ఆ ప్రాంతంలో మావోయిజం పూర్తిగా కనిపించకుండా పోయిందని వెల్లడించింది. కేంద్ర చర్యలతో .. బస్తర్ డివిజన్లో బస్తర్, దంతెవాడ, బీజాపూర్, కంఖేర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా మొత్తంగా ఏడు జిల్లాలు ఉన్నాయి. వీటిల్లో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉన్న జిల్లాగా బస్తర్ పేరొందింది. ముఖ్యంగా 2013 ఏడాది మే నెలలో కాంగ్రెస్ నేతలపై మావోలు జరిపిన మెరుపు దాడిలో 27 మందితో పాటు 10 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఈ దాడిలోనే కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి మహేంద్ర కర్మ చనిపోయారు. ఆ తర్వాత సైతం ఈ జిల్లా పేరు చెబితేనే పోలీసు బలగాల్లోనూ వణుకు పుట్టేంతస్థాయిలో మావోల మెరుపుదాడులు కొనసాగాయి. 2014 తర్వాత మావోల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దూకింది. ఈ జిల్లావ్యాప్తంగా భద్రతా బలగాల సంఖ్యను విపరీతంగా పెంచింది. లొంగుబాట్లను ప్రోత్సహించింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. దీంతో గడిచిన రెండేళ్లుగా పోలీసులు, మావోలకు మధ్య పరస్పర కాల్పుల ఘటన ఒక్కటి కూడా నమోదు కాలేదు. పైగా జిల్లాలో ఇద్దరు కీలక నేతలు అరెస్ట్ కాగా, మరో 13 మంది కీలక సభ్యులు లొంగిపోయారు. ఈ ఏడాదిలో మావో సంబంధ ఘటన ఒక్కటి కూడా నమోదుకాలేదు. సమీప కొండగావ్ జిల్లాలోనూ ఒక్క ఘటన నమోదుకాలేదు. రెండు జిల్లాలకు పొరుగునే ఉన్న బీజాపూర్ జిల్లాలో 465 మంది, సుక్మా జిల్లాలో 253 మంది మావోలను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణపూర్, బీజాపూర్ జిల్లాలో రెండేళ్లలో 100 మందికి పైగా మావోలు పోలీసుల ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. గత ఐదు దశాబ్దాలుగా మావోల కదలికలతో నిత్యం వార్తలో ఉండే బస్తర్ జిల్లాలో ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క మావోయిస్టు దుశ్చర్యకు సంబంధించిన ఘటనలు జరగకపోవడం విశేషం. కొండగావ్లోనూ మావోల ఉనికి లేదని ఇటీవల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోలకు మధ్య జరిగిన పరస్పర ఎదురుకాల్పుల్లో 208మంది మావోలు చనిపోయారు. బస్తర్, కొండగావ్ జిల్లాలో ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరగకపోవడం విశేషం. 802 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. బహుముఖ వ్యూహంతో ముందుకు 2026 నాటికి పూర్తిస్థాయిలో మావోలను ఏరివేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ప్రభుత్వం ఈ లక్ష్యసాధన కోసం బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. ఓపక్క భద్రతా చర్యలను పటిష్టం చేస్తూనే, మావోయిస్టుల ప్రభావిత గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడంపై ప్రధానంగా దృష్టిసారించింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై దృష్టి పెట్టింది. చౌక ధరల దుకాణాలను పెంచడం, సమాచార వ్యవస్థల పటిష్టం, ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు, రహదారులకు భారీగా నిధుల కేటాయింపు, లొంగిపోయే మావోలకు తక్షణ పునరావాస కార్యక్రమాలతో వారి ఉనికిని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
అడవిలో ఆఖరి పోరాటం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశంలో మావోయిస్టులను 2026 మార్చి కల్లా ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సల్వాజుడుం పేరుతో 2007లో మావోయిస్టుల ఏరివేతలో నేరు గా కేంద్రం జోక్యం చేసుకునే ప్రక్రియ.. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. యూపీఏ హయాంలో.. దేశంలోని ప్రధాన విప్లవ శక్తులైన పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్లు విలీనమై 2004 సెపె్టంబర్ 21న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఆవిర్భవించాయి. నేపాల్‌లోని పశుపతినాథ్ నుంచి ఏపీలోని తిరుపతి వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ఆయా పార్టీల నేతలు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీంతో మావోయిస్టు పార్టీకి గెరిల్లా జోన్‌గా ఉన్న బస్తర్ అడవుల నుంచి యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌ను కేంద్రం ప్రారంభించింది. మావోయిస్టులకు ఎక్కువ మద్దతిచ్చే తెగకు.. ఎదురు నిలిచే మరో తెగ సభ్యులను ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించింది. వారి చేతికి ఆయుధాలిచ్చి శాంతిదళం (సల్వాజుడుం)ను 2007లో ఏర్పాటు చేసింది. సల్వాజుడుం మొదటి అడుగు నుంచి 2011లో రద్దయ్యే వరకు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. సల్వాజుడుంపై విమర్శలు ఎక్కువ రావడంతో 2009 సెప్టెంబర్‌లో పెద్దఎత్తున సీఆర్పీఎఫ్ బలగాలను బస్తర్ అడవుల్లోకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. దీన్నే ఆపరేషన్ గ్రీన్‌హంట్‌గా పేర్కొంటున్నారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ కారణంగా మావోయిస్టుల చేతిలో భద్రతా దళాలకు చెందిన జవాన్లు తీవ్రంగా నష్టపోయారు. బస్తర్ అడవులపై ప్రభుత్వ దళాలకు పట్టు చిక్కలేదు. నాగా కమాండోలు.. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం అమలు చేసిన గ్రీన్‌హంట్‌కు మరింత పదును పెట్టింది. అప్పటికే పశ్చిమ బెంగాల్లో మావోయిస్టులను అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన నాగా బెటాలియన్‌ను బస్తర్ అడవులకు పంపాలని నిర్ణయించింది. వీరి చేతుల్లో అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, శాటిలైట్ ఫోన్లు పెట్టింది. అప్పటికే కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్) దళాలు రంగంలో ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం ఆశించిన ఫలితాలు రాలేదు. ఆపరేషన్ సమాధాన్.. యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు చేపట్టి పదేళ్లు దాటినా బస్తర్ అడవులపై పట్టు చిక్కకపోవడానికి వ్యూహాల్లో లోపాలే కారణమనే భావనకు కేంద్రం వచ్చి0ది. దీంతో 2017లో ఆపరేషన్ సమాధాన్ (ఎస్ – స్మార్ట్ లీడర్íÙప్, ఏ – అగ్రెసివ్ స్ట్రాటెజీ, ఎం – మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ – యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డీ – డ్యాష్‌బోర్డ్ బేస్డ్ కీ రిజల్ట్ ఏరియా, హెచ్ – హర్నెస్టింగ్ టెక్నాలజీ, ఏ – యాక్షన్ ప్లాన్, ఎన్ – నో ఆక్సెస్ టు ఫైనాన్సింగ్)ను తెరపైకి తెచ్చి0ది. మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టడం, వారి స్థావరాలను కచ్చితంగా కనుక్కోవడం, ఔషధాలు అందకుండా చూడటం, మావోయిస్టుల్లోకి కొత్త నియామకాలు జరగకుండా జాగ్రత్త పడటం వంటి పనులపై ఎక్కువ శ్రద్ధ చూపించారు. దీంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంలో వేగం పెంచారు. గగనతల దాడులు ఆపరేషన్ సమాధాన్‌తో పరిస్థితులు అనుకూలంగా మారాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత 2021 జూన్ 19న తొలిసారిగా వాయుమార్గంలో మావోయిస్టు శిబిరాలపై కేంద్ర బలగాలు దాడులు చేశాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే మావోయిస్టు శిబిరాలపై వాయుమార్గంలో దాడులు చేయడంపై ఆందోళన వ్యక్తం కావడం, నిరసనలు రావడంతో.. ఈ తరహా దాడులపై కేంద్రం వెనక్కి తగ్గింది. అయినప్పటికీ 2021 జూన్ నుంచి 2022 చివరి వరకు నాలుగుసార్లు తమపై గగనతల దాడులు జరిగాయని మావోయిస్టు పార్టీ పలు సందర్భాల్లో ఆరోపణలు చేసింది. లోపాలను అధిగమిస్తూ.. మావోయిస్టుల ఏరివేతలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త వ్యూహాలను కేంద్రం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. లొంగిపోయిన, అరెస్టయిన మావోయిస్టుల (సాధారణంగా స్థానిక ఆదివాసీలకే అధికారం)తో డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ పేరుతో ప్రత్యేక దళాలను తయారు చేసింది. నాగా కమాండోలు ఇక్కడి అడవులపై పట్టు సాధించలేకపోవడంతో.. వారికి బదులుగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లను రంగంలోకి దించింది.సాయుధులైన పురుష కమాండోల వల్ల వచ్చే ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యేకంగా విమెన్ కమాండో దళాలను తయారు చేసింది. ఎండాకాలం, వానాకాలం అని తేడా లేకుండా ఏడాదంతా అడవుల్లో కూంబింగ్ చేపట్టేలా ఆపరేషన్ సూర్యశక్తి, ఆపరేషన్ జల్‌శక్తి పేర్లతో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి0ది. దీంతో ఆఖరికి వానాకాలంలో కూడా మావోయిస్టులు నిర్భయంగా సంచరించే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా భద్రతా దళాలపై మావోలు జరిపే వ్యూహాత్మక ఎదురుదాడులను గణనీయంగా తగ్గించగలిగారు. విస్తృతంగా పారా మిలిటరీ క్యాంపులు సంఖ్య, శిక్షణ, ఆధునిక ఆయుధాలు, లేటెస్ట్ టెక్నాలజీ పరంగా సంసిద్ధమైన తర్వాత బస్తర్ అడవుల్లో ప్రతీ ఆరు కిలోమీటర్లకు ఒకటి చొప్పున భద్రతా దళాలకు చెందిన క్యాంపులను ఏర్పాటు చేస్తూ.. మావోయిస్టులను కేంద్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం బస్తర్‌లో 370కి పైగా పారా మిలిటరీ క్యాంపులున్నాయి. సుక్మా, బీజాపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాలతో కూడిన దండకారణ్యంలో మావోయిస్టుల గెరిల్లా జోన్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయాయి. చివరికి మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్వగ్రామమైన పువర్తిలోనూ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రతా దళాలు క్యాంపును ఏర్పాటు చేశాయి. ఆపరేషన్ కగార్ సీఆర్పీఎఫ్, డీఆర్జీ, స్పెషల్ టాస్‌్కఫోర్స్, కోబ్రా, పోలీసులు.. ఇలా అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ జాయింట్ ఆపరేషన్లకు శ్రీకారం చుడుతూ ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను 2024 జనవరిలో ప్రారంభించారు. మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా ఉన్న అబూజ్మడ్ (బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, కొండగావ్) అడవులపై ప్రభుత్వం గురి పెట్టింది.ఈనెల 5న తుల్తులీ ఎన్కౌంటర్లో ఏకంగా 38 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 200 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మరో 400 మందికి పైగా లొంగిపోవడం లేదా అరెస్టయ్యారు. ప్రభుత్వ దళాల నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టు అగ్రనేతలు చెల్లాచెదురయ్యారనే ప్రచారం జరుగుతోంది. -
అడవిలో అన్నలు లేనట్లేనా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వామపక్ష తీవ్రవాద ప్రాంతాల జాబితా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కేంద్ర హోంశాఖ తొలగించింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ మావోయిస్టుల కార్యక్రమాలేవి లేకపోవడం, భద్రత బలగాలు పూర్తి పట్టు సాధించడంతో ఎల్‌డబ్ల్యూఈ(లెఫ్ట్ వింగ్ ఎక్స్స్ట్రిమిజం ఎఫెక్టెడ్) ప్రాంతాల నుంచి తప్పించింది. గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం కారణంగా ప్రత్యేక పథకాల అమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రత బలగాల పర్యవేక్షణ కొనసాగతున్నాయి. భవిష్యత్‌లో ఈ కార్యకలాపాలు క్రమంగా తగ్గనున్నాయి.ప్రత్యేక పథకాలతో నిధులుదేశంలో నక్సలిజాన్ని తగ్గించేందుకు ఆపరేషన్ ‘సమాధాన్’, రాష్ట్రంలో ‘గ్రీన్‌హంట్’ పేర్లతో మావోయిస్టుల ఏరివేత కొనసాగింది. 2010లో 96జిల్లాల్లో ‘మావో’ల ప్రభావం ఉండగా, 2021నాటికి 46కు పడిపోయి, తాజాగా 38జిల్లాలకు చేరింది. ఈ నెల 7న వామపక్ష ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాలను వా మపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం లేకపోవడంతో ఎల్‌డబ్ల్యూఈ నుంచి తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు మాత్రమే ఉన్నాయి. నక్సల్స్ కారణంగా ఎన్నికల సమయంలో ఓటింగ్ గంట ముందే నిలిపివేయడం, అధికారులు, ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్ర, కేంద్ర బలగాల పహారా, స్థానికులపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. దేశంలో 2026నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తగ్గించేలా కేంద్రం చర్యలు చేపట్టింది.సమసమాజ స్థాపన లక్ష్యంగాపేద, ధనిక మధ్య అంతరాలను తొలగిస్తూ భూ స్వామ్య, పెట్టుబడిదారి వ్యవస్థలకు వ్యతిరేకంగా ఐదు దశాబ్దాల క్రితం నక్సలిజం పురుడు పోసుకుంది. కార్మిక, కర్షక, రైతాంగ సమస్యల పరిష్కారానికి విప్లవ పంథాలోనే సమసమాజ స్థాపన సాధ్యమని ఆ పార్టీ ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి జిల్లా నుంచి యువత నక్సలిజం వైపు మళ్లారు. మూడు దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీ గిరిజన, మైదాన ప్రాంతాలు, ఇటు సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) సంస్థలు విప్లవ బావుటా ఎగురవేశాయి. ప్రజల మద్దతుతో అనేక పోరాటాల్లో పోలీ సులపై పైచేయి సాధించారు. లక్సెట్టిపేట, ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఖానాపూర్, తిర్యాణి, సిర్పూర్, చెన్నూరు, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, ఆదిలాబాద్, జ న్నారం తదితరచోట్ల భీకర పోరాటాలు జరిగాయి. దొరల ఇళ్లపై దాడులు, దోపిడీదారులు, ప్రజాకంఠకులను ప్రజాకోర్టులో శిక్షించేవారు. ఆ సమయంలోనే నిరుపేదలకు భూపంపిణీ జరిగింది. బలగాలు, నక్సల్స్‌కు మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం ఉండగా క్రమంగా తగ్గుముఖం పట్టింది.‘కడంబా’ ఘటన చివరిదిఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతంతోపాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు, ప్రాణహిత, పెన్‌గంగా, గోదావరి తీర గ్రామాలకు గత పదేళ్లుగా కొత్త రోడ్లు, సమాచార వ్యవస్థతో మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి. రూ.కోట్లు వెచ్చించి ఆసుపత్రులు, గిరిజన యువతకు పథకాలు తె చ్చారు. దీంతో నక్సలిజం తగ్గింది. తెలంగా ణ ఏర్పడ్డాక కేబీఎం(కుమురంభీం మంచి ర్యాల) కమిటీ తిరిగి కార్యకలాపాలు సాగించేందుకు ప్రయత్నించింది. గిరిజన యువతను ఉద్యమం వైపు ఆకర్షించి దళంలో చే ర్చుకునే ప్రయత్నం చేసింది. 2020లో కాగజ్‌నగర్ మండలం కడంబా అడవుల్లో భద త్రా బలగాల చేతిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన బాదీరావు మృతిచెందారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర సభ్యుడు అడెళ్లు భాస్కర్ పట్టు పెంచే ప్రయత్నాలు చేసినా వీలు కాలేదు. రెండేళ్ల క్రితం ఆయన సహచరి కంతి లింగవ్వ చనిపోయింది. పార్టీ బలోపేతం లక్ష్యంగా మూడేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో ఇంద్రవెల్లి, సిర్పూర్, మంగీ, చెన్నూరు, మంచిర్యాల ఏరియాలకు కొత్త నియామకాలు చేపట్టింది. ఈ కమిటీలు దండకారణ్యం కేంద్రంగానే కార్యకలా పాలు సాగించాయి. కోవిడ్ తర్వాత పలు మార్లు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి ఉమ్మడి జిల్లాలో ప్రవేశించే ప్రయత్నాలు జరిగాయి. కానీ నిలదొక్కులేకపోయారు. ప్రస్తుతం కోల్‌బెల్ట్ కమిటీ పేరుతో సింగరేణి కార్మి కుల పక్షాన, స్థానిక ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ పత్రిక ప్రకటనలు మాత్రం వెలువడుతున్నాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 30 మంది నక్సల్స్ మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు చావుదెబ్బ తగిలింది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో 30 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-నారాయణ్‌పుర్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగింది.దంతెవాడ, నారాయణ్‌పుర్ పోలీసుల సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఘటనా స్థలం నుంచి మృతి చెందిన 30 మంది మావోయిస్టుల మృత దేహాలతోపాటు, భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.ఒకే రోజు 30 మంది మావోయిస్టులు మృతి చెందటం మావోయిస్టులు పార్టీకి అతి పెద్ద ఎదురు దెబ్బ. ఈ ఏడాది ఇది ఐదో పెద్ద ఎన్ కౌంటర్ కావటం గమనార్హం. గడిచిన 10 నెలల వ్యవధిలో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 225 మంది మావోయిస్టులు మృతి చెందారు.ఈ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజా ఎన్కౌంటర్ నేపథ్యంలో కేంద్ర మావోయిస్టు పార్టీ అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం. ఎన్కౌంటర్ తీరుపై కేంద్ర పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: కాంగ్రెస్ యువతను చీకటి ప్రపంచంలోకి నెడుతోంది: అమిత్ షా -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఇద్దరు జవాన్ల మృతి
రాయిపూర్ : ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్ల వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన జవాన్లు విష్ణు, శైలేంద్రగా గుర్తించారు పోలీసు అధికారులు. బీజార్ పూర్ జిల్లా సిల్గూర్ -టేకులగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
జార్ఖండ్‌లో ఎన్కౌంటర్: నలుగురు మావోయిస్టుల మృతి
రాంచి: జార్ఖండ్‌లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సోమవారం ఉదయం సింగ్భూమ్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నాలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.టోంటో, గోయిల్కేరా ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను టార్గెట్ చేస్తూ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారి అమోల్ వి హోమ్కర్ తెలిపారు. ‘‘ఎదురు కాల్పుల్లో నాలుగు మావోయిస్టులు మృతి చెందారు.అందులో ఒక మహిళా మావోయిస్టు ఉంది. మరో ఇద్దర మావోయిస్టులను అరెస్ట్ చేశాం. ఘటన స్థలం నుంచి రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నాం’’ అని పోలీసులు తెలిపారు.ఇక.. రెండు రోజుల క్రింతం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ జవాన్ మృతి చెందారు. -
చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఐదుగురి మావోయిస్టుల మృతి
చత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య చోటుచేసుకున్న ఈ ఎన్కౌంటర్లో 5 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్-దంతెవాడ-కొండగావ్ అంతర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్ ఘటన జరిగింది. ఈస్ట్ బస్తర్ డివిజన్ పరిధిలోని గోబెల్ ప్రాంతంలోని ముంగేడి గ్రామంలో మావోయిస్టులుపై అంతర్ జిల్లా ఉమ్మడి ఆపరేషన్‌ను పోలీసులు, జవాన్లు సంయూక్తంగా నిర్వహించారు. ఆపరేషన్‌లో యూనిఫారం ధరించిన ఐదుగురు మావోయిస్టులు ఆయుధాలతో సహా మృతి చెందారు.పెద్ద సంఖ్యలో మావోయిస్టులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నారాయణపూర్ డీఆర్జీకి చెందిన ముగ్గురు జవాన్లకు గాయాలు అయినట్లు సమాచారం. -
దద్దరిల్లిన దండకారణ్యం.. 13 మంది మావోయిస్టుల మృతి
చత్తీస్‌గఢ్: లోకసభ ఎన్నికల నేపథ్యంలో చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా పోలీసుల, భద్రతా బలగాల కుంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బీజాపూర్‌లో నిన్న( సోమవారం) జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగింది. కోర్చోలి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. నిన్న సాయంత్రం వరకు 10 మంది మావోయిస్టులు మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ పూర్తైన అనంతరం మరో ముగ్గురు మావోయిస్టులు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సుమారు 8 గంటల పాటు ఎదురు కాల్పులు కొనసాగాయి. కుంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్న డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బెటాలియన్, బస్తర్ ఫైటర్స్ పాల్గొన్నారు. ఇక.. దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పది రోజుల వ్యవధిలో నాలుగు ఎన్కౌంటర్లు జరిగాయి. ఇప్పటివరకు మొత్తం 25 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో మంగళవారం పోలీసుల బలగాలు, మావోల నడుమ జరిగిన ఎదురుకాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధి కొర్చోలి, లేంద్ర గ్రామాల సమీపాన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే నిఘా వర్గాల సమాచారంతో సోమవారం రాత్రి జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్, కోబ్రా కమాండో , బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం కొర్చేలి, లేంద్ర మధ్య అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తారసపడి కాల్పులు పది మంది మావోయిస్టుల మృతి మొదలుపెట్టారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. సుమారు రెండు గంటల పాటు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. దీంతో మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేస్తుండగా 11 గంటల సమయాన మళ్లీ వారికి మావోలు తారసపడి కాల్పులకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో మరో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మొత్తంగా పది మంది మావోయిస్టులు మృతి చెందారని, ఇందులో ఒక మహిళ ఉన్నారని బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్ రాజు వెల్లడించారు. మృతులు మావోల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రెండో కంపెనీ సభ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటనలో సుమారు 30 మంది మావోలు పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. పలువురు గాయాల పాలై తప్పించుకున్నట్లు భావించి పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఘటనాస్థలి నుంచి పెద్ద మొత్తంలో లైట్ మెషీన్ గన్స్, ఏకే 47 తుపాకులు, బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లు, మందుపాతరలు, పేలుడు పదార్థాలు స్వా«దీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు బాలాఘాట్: మధ్యప్రదేశ్‌లోని బాలా ఘాట్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఘటనలో ఇద్దరు కరడుగట్టిన మావోయిస్టులు మృతి చెందారు. వారిని సాజంతి అలియాస్ క్రాంతి(38), రఘు అలియాస్ షేర్ సింగ్(52)గా గుర్తించారు. ఘటనా స్థలిలో ఆయుధాలు దొరికాయి. సాజంతిపై రూ.29 లక్షలు, రఘుపై రూ.14 లక్షల రివార్డులున్నాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 8 మంది మావోయిస్టుల మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్ జిల్లాలోని కొర్చోలి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో నక్సల్స్ గాయపడినట్లు సమాచారం. గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన నక్సల్స్ మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్, ఎల్ ఎంజీ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ బలగాలు ఇంకా ఎదురు కాల్పుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలున్న బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది భద్రతా బలగాలు, పోలీసుల..చేపట్టిన మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో జరిగిన ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 34 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొదటి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. దీంతో ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు మరింత జల్లెడ పడుతున్నారు. -
ఆలస్యంగా దక్కిన న్యాయం
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టయిన ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా పదేళ్ల సుదీర్ఘ కారాగారవాసం నుంచి గురువారం నిర్దోషిగా విడుదలయ్యారు. ఇదే అభియోగాలతో ఆయనతోపాటు అరెస్టయిన మరో అయిదుగురికి కూడా విముక్తి లభించింది. ఒకరు విచారణ సమ యంలో మరణించారు. అభియోగాలను రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చెబు తూనే, అసలు తగిన అనుమతులు లేకుండా సాగించిన ఈ కేసు చెల్లుబాటు కాదని బొంబాయి హైకోర్టు నాగపూర్ ధర్మాసనం వ్యాఖ్యానించటం మన నేర న్యాయవ్యవస్థ పనితీరును పట్టిచూపుతోంది. యూఏపీఏ కింద ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించాలంటే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిందితులపై పకడ్బందీ సాక్ష్యాధారాలున్నాయని వారు విశ్వసించాకే ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలి. కానీ ఈ కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను 2014లో అరెస్టు చేయగా ఏడాది తర్వాతగానీ అనుమతులు రాలేదు. ఇతర నిందితులు వాస్తవానికి 2013లోనే అరెస్టయ్యారు. ఈ సంగతి పట్టని మహారాష్ట్రలోని గఢ్చిరోలి సెషన్స్ కోర్టు కేసును పరిగణనలోకి తీసుకుని ఈలోగా ఒక సాక్షిని కూడా విచారించింది! చివరకు 2017లో వీరిని దోషులుగా పేర్కొంటూ యావజ్జీవ శిక్ష విధించింది. అటు ప్రభుత్వ యంత్రాంగం సరే... ఇటు న్యాయవ్యవస్థ సైతం ఇంత యాంత్రికంగా పనిచేయటం సరైందేనా? బొంబాయి హైకోర్టు 2022లో ఈ అవక తవకలను గుర్తించి కేసు కొట్టేసింది. కానీ ఆ వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర అప్పీల్‌ను స్వీకరించి బొంబాయి హైకోర్టు తీర్పును నిలుపుదల చేయటం, తిరిగి దీన్ని విచారించాలంటూ ఆదేశాలు జారీచేయటంవల్ల సాయిబాబా తదితరులకు స్వేచ్ఛ లభించటానికి మరికొన్ని నెలలు పట్టింది. ఇలా కనీస సాక్ష్యాధారాలు కొరవడిన, ముందస్తు అనుమతులు తీసుకోని కేసులో నింది తులను పదేళ్లపాటు జైలు గోడలమధ్య బంధించి వుంచారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది వ్యవస్థల సమష్టి వైఫల్యం కాదా? ఇందుకు జవాబుదారీతనం వహించాల్సిందెవరు? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ఈయూ కమిషన్, అమెరికన్ కాంగ్రెస్, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభా గంలో ఈ కేసు ప్రస్తావనకొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని వివిధ సంస్థల వరకూ అందరికందరూ ఇది అన్యాయంగా బనాయించిన కేసు అనీ, వెంటనే ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేస్తూ వచ్చారు. టీఆర్ఎస్ సభ్యుడు కె. కేశవరావు 2015లో జీరో అవర్‌లో దీన్ని రాజ్య సభలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ కూడా రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కనీసం కేసు తేలేవరకూ నిందితులను బెయిల్‌పై విడుదల చేసివుంటే కొంతలో కొంతైనా న్యాయం చేసినట్టయ్యేది. బెయిల్ అనేది హక్కు, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జైలుకు పంపాలన్నది మౌలిక న్యాయసూత్రం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈమధ్యకాలంలో కూడా పదే పదే ఈ సంగతిని గుర్తుచేస్తున్నారు. అయినా ఆచరణకొచ్చేసరికి జరిగేది వేరుగా వుంటోంది. నిందితులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపట్ల విరోధభావాన్ని వ్యాప్తిచేసేందుకు కుట్రపన్నారని తెలిపింది. ఆ విషయంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర పత్రాలువంటి సాక్ష్యాధారాలు అత్యంత బలహీనమైన వని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా వెబ్సైట్ నుంచి వీడియోలు, ఇతర సమాచారం డౌన్లోడ్ చేసుకోవటం దానికదే నేరమెలా అవుతుందన్నది ధర్మాసనం సందేహం. ఫలానా ఉగ్ర వాద చర్యకూ, దానికీ సంబంధం వున్నదని నిరూపిస్తే తప్ప ఆ సాక్ష్యానికి ఎలాంటి విలువా వుండ దని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ సాయిబాబా అభిప్రాయాలు ఎవరికీ తెలియ నివి కాదు. ఆయన వృత్తిరీత్యా ఇంగ్లిష్ అధ్యాపకుడు. కవి, రచయిత కూడా. ఆదివాసీ ప్రాంతాల్లో సహజవనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రచనలు చేశారు. అరెస్టయిన సమయానికి విప్లవ ప్రజాస్వామిక వేదిక (ఆర్డీఎఫ్) బాధ్యుడు. ఆయన హింసాత్మక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే, విధ్వంసానికి పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ 90 శాతం అంగవైకల్యం వున్న సాయిబాబా మరొకరి సాయం లేనిదే తన పని తాను చేసుకోవటం కూడా అసాధ్యం. బయటకు వెళ్లాలంటే చక్రాల కుర్చీ తప్పనిసరి. అటు వంటి వ్యక్తిని ఉగ్రవాదిగా జమకట్టడం సబబేనా? కేవలం అసమ్మతిని వ్యక్తం చేయటమే ఒక మనిషిని పదేళ్లపాటు జైల్లోకి నెట్టడానికి కారణం కావటం మనం నమ్మే ప్రజాస్వామిక విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉగ్రవాద చర్యలు సమాజ క్షేమానికి ముప్పుగా పరిణమిస్తాయనటంలో సందేహం లేదు. అటువంటివారిని అదుపు చేయాలంటే యూఏపీఏ వంటి కఠిన చట్టాల అవసరం వుందని ప్రభుత్వాలు భావిస్తే తప్పుబట్టనవసరం లేదు. కానీ మన రాజ్యాంగమే అనుమతించిన సహేతుకమైన అసమ్మతిపై లేనిపోని ముద్రలేసి దాన్ని తుంచివేయాలనుకోవటం, భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవటం ఏరకంగా చూసినా సబబు కాదు. ఇప్పుడు సాయిబాబా కోల్పోయిన విలువైన పదేళ్ల కాలాన్ని ప్రభుత్వం వెనక్కివ్వలేదు. కనీసం ఉద్యోగమైనా చేసుకోనివ్వాలి. ఇతర క్రిమినల్ కేసుల మాట అటుంచి యూఏపీఏ వంటి దారుణ చట్టాలకింద అరెస్టయి నిర్దోషులుగా తేలినవారికైనా తగిన పరిహారం చెల్లిస్తే కాస్తయినా ఉపశమనం ఇచ్చినట్టవుతుంది. పాలకులు ఆలోచించాలి. -
మావోయిస్టులపై కేంద్రం ఫోకస్.. దద్దరిల్లిన దండకారణ్యం!
సాక్షి, రాయ్‌పూర్: మావోయిస్టుల ఏరివేతపై కేంద్ర హోం శాఖ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్ పతాకస్థాయికి చేరింది. ఈ క్రమంలో బలగాల కూంబింగ్‌లో ఛత్తీస్‌గఢ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉలికిపాటు మొదలైంది. వివరాల ప్రకారం.. మావోయిస్ట్ ఏరివేత కార్యక్రమాలను కేంద్ర హోంశాఖ తీవ్రతరం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్ కొనసాగుతోంది. నారాయణపూర్‌లో కేంద్ర బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. పీఎల్జీఏ స్థావరం అబూజ్మడ్ను చుట్టుముట్టేందుకు బీఎస్ఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్కు చెందిన పదివేల మందితో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా, ఇటీవలే జోసెఫ్ (దర్శన్ పాల్), సంజీత్ (అర్జున్ ప్రసాద్ సింగ్)ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల మూలంగా భారత్ కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి సహకారంతో అబూజ్మడ్ను ముట్టడించే కార్యక్రమానికి కేంద్ర భద్రతా వర్గాలు రెడీ అయ్యాయి. ఇక, తాజాగా కూంబింగ్‌తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంథని తూర్పు డివిజన్ ఉలిక్కిపడింది. ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. -
ఒడిశాలో మావోయిస్టుల ఆయుధ డంప్ స్వాధీనం..
భువనేశ్వర్: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన సోదాల్లో మావోయిస్టుల భారీ ఆయుధ సామాగ్రి లభ్యమైంది. పక్క సమాచారంతో జరిపిన సోదాల్లో లభ్యమైన ఈ సామాగ్రి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు సరిహద్దు భద్రతా దళాలు. బెజంగివడ రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది సోమవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల పోలీస్ పరిధి అమపాదర్-ఎల్కనూర్ గ్రామం, బోడిలుగూడ- బృందమామిడి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిపిన సోదాల్లో రాకెట్ లాంచర్లతో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు BSF సిబ్బంది. సరిహద్దు భద్రతా దళాల వారు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఒక 303 రైఫిల్, 11 బ్యారెల్ (SBML), 303 రైఫిల్ యొక్క మ్యాగజైన్, 15 మెరుగైన హ్యాండ్ గ్రెనేడ్లు, మూడు దేశీయ తుపాకులు, రెండు 51 MM మోర్టార్ బాంబులు, ఒక గ్యాస్ వెల్డింగ్ యంత్రం, 42 లైవ్ కాట్రిడ్జ్‌లు, రాకెట్ లాంచర్, రెండు బ్రెన్ 303 ఎల్ఎంజీ స్పేర్ బ్యారెల్స్, 29 జెలటిన్ స్టిక్స్, ఐదు అల్యూమినియం నైట్రేట్ ప్యాకెట్లు, 30 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, తొమ్మిది సింథటిక్ వెయిస్ట్ బెల్ట్‌లు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టులకు వారి సానుభూతిపరులకు కంచుకోటగా ఉండేదని, వామపక్ష దళాలు పేలుడు ముడి పదార్థాలను ఇటువంటి రిమోట్ ప్రదేశాలలో ఉంచి అవసరమైనప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటారని తెలిపింది BSF సిబ్బంది. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో ఆయుధ సామగ్రి దొరకడంతో మావోయిస్టుల ఉనికి నిర్ధారణ అయ్యిందని అనుమానిత ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
దుమ్ముగూడెం(తెలంగాణ): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కేర్లపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సిరిసెట్టి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. సిమెల్, గోగుండా కొండలపై పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, డీఆర్జీ బలగాలు గాలింపు చేపట్టాయి. గురువారం రాత్రి భద్రతా బలగాలు కూంబింగ్ ముగించుకుని వస్తుండగా కోడెల్పరా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాడి చేశారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా, మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే పారిపోయారు. అనంతరం ఘటనాస్థలంలో ఓ మావోయిస్టు మృతదేహంతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యమయ్యా యని, మరో ఐదుగురు మావోయిస్టులకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. -
పద్మక్క ఇచ్చిన రూ.15లక్షల కోసం వస్తాం..
సారంగాపూర్(జగిత్యాల): జిల్లాలోని బీర్పూర్ మండలం సుమారు 15ఏళ్లక్రితం వరకూ మావోయిస్టు(అప్పటి పీపుల్స్‌వార్)లకు పెట్టని కోటలా ఉండేది. కానీ, శుక్ర, శనివారాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు మావోయిస్టుల పేరిట లేఖలు రావడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతి స్వగ్రామం నిన్నటివరకూ ప్రశాంతంగా ఉంది. కానీ, నక్సల్స్ లేఖలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ పేరిట లేఖలు.. ► గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి మల్లికార్జున్ పేరిట స్థానిక ప్రజాప్రతినిధులకు లేఖలు అందినట్లు తెలిసింది. ► సీపీఐ – మావోయిస్టు జగదల్పూర్ జిల్లా ఏరియా కమిటీ పేరిట లెటర్హెడ్లపై ఆ లేఖలు ఉన్నాయి. ► మరికొన్నింటిపై మల్యాల ఏరియా కమిటీ ఉంది. ► వీటిని సానుభూతిపరులు పంపించారా, గతంలో నక్సల్స్‌తో సంబంధాలు నెరిపిన వారు పొస్టు చేశారా? అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. లేఖల్లో ఏముందంటే.. ► అటవీభూములు కబ్జా చేసి, అక్రమంగా పట్టాలు చేశారని, ఈవిషయంలో రెవెన్యూ, అటవీ అధికారులు, ప్రజాప్రతినిధులు రూ.లక్షలు పంచుకున్నారని ఆరోపించారు. అడవుల్లో చెట్లు నరికినా, భూములు కబ్జా చేసినా, అందుకు ప్రోత్సహించినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ► నర్సింహులపల్లె గ్రామంలో ఓ వ్యక్తి అక్రమంగా దుకాణం నిర్మించారని, తక్షణమే తొలగించాలని లేఖల్లో హెచ్చరించారు. కొందరు ప్రజాప్రతినిధులు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పంచాయితీలు చేస్తున్నారని, అక్కడిదాకా వెళ్లకుండా చూడాలని సూచించారు. మరికొందరు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తారని ప్రస్తావించారు. పద్మక్క ఇచ్చిన రూ.15లక్షల కోసం వస్తాం.. ► అప్పటి నక్సల్స్ నేత పద్మక్క మార్చి 2003లో ఓ వ్యక్తికి రూ. 15 లక్షలు ఇచ్చారని, ఇందులో రూ.1,000 నోట్లు, రూ.500 నోట్లు ఉన్నాయని లేఖలో తెలిపారు. కొద్దిరోజులకే నేరెళ్ల ఎన్కౌంటర్లో పద్మక్క మృతిచెందారని, ఆమె ఇచ్చిన సొమ్ము కోసం త్వరలో వస్తామని, సిద్ధంగా ఉండాలని లేఖలో ఉంది. ► అయితే, అత్యధిక మంది ప్రజాప్రతినిధులకు అందిన లేఖలో అటవీ భూముల్లో చెట్లు నరికివేతన, భూము కబ్జా, అక్రమ పట్టాల గురించి ప్రస్తావన ఉంది. వీరు తమ పద్ధతులు మార్చుకోకుంటే శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులతోపాటు నర్సింహులపల్లెలో సాధారణ వ్యక్తులకు కూడా హెచ్చరిక లేఖలు అందినట్లు తెలిసింది. అనేక అనుమానాలు.. ► మావోయిస్టుల పేరిట ప్రజాప్రతినిధులు, గ్రామస్తులకు అందిన లేఖలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడ్చిరోలిలో పోస్టు చేసినట్లు ఉన్నాయని కొందరు చెబుతుండగా, అక్కడి పార్టీ లెటర్హెడ్లపై రాసి పోస్టు చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. అంతేకాదు.. అన్నిలేఖల్లోనూ ఓ వ్యక్తి దుకాణం కూల్చి వేయాలని హెచ్చరించడం కొందరు కావాలనే చేసిన పనిగా భావిస్తున్నారు. లేఖలు అందుకున్న కొందరు పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించగా, మరికొందరు స్థానిక పోలీస్‌స్టేషన్‌లోని అధికారులను కలిసి నట్లు తెలిసింది. పీపుల్స్‌వార్ గత ప్రాబల్యం ఇదీ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పటి (సీపీఐ – ఎంఎల్) పీపుల్స్‌వార్‌లో తూర్పు, పశ్చిమ డివిజన్ కమిటీలు ఉండేవి. తూర్పు డివిజన్లో పెద్దపల్లి, గోదావరిఖని – రామగుండం, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మంథని ప్రాంతాలు ఉండగా, పెద్దపల్లి దళం, మంథని దళం, హుస్నాబాద్ దళాలు వాటి పరిధిలో కార్యకలాపాలు నిర్వహించేవి. పశ్చిమ డివిజన్లో జగిత్యాల, మల్యాల, మానేరువాగు, సిరిసిల్ల, కామారెడ్డి, కమ్మర్పల్లి, మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాలు ఉండేవి. ఇందులో మల్యాల, జగిత్యాల, మెట్పల్లి దళాలు పనిచేస్తూ ఉండేవి. వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో జనశక్తి ప్రాబల్యం ఉండేది. మల్లన్నపేట ఎన్కౌంటర్ తర్వాత పీపుల్స్‌వార్ మల్యాల దళాన్ని ఎత్తివేసింది. మెట్పల్లి, జగిత్యాల దళాలను కలిపి ఒకే దళం లోకల్ గెరిల్లా స్క్వాడ్(ఎల్జీఎస్)గా ఏర్పాటు చేసింది. ఇప్పుడు పంపిన లేఖల్లో మల్యాల ఏరియా కమిటీ, గోదావరి ఏరియా బెల్ట్ కమిటీ పేరుతో ఉండడం, దానికిందే గోదావరి బెల్ట్ కార్యదర్శి మల్లికార్జున్ పేరు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. -
Nalgonda: మళ్లీ ‘అన్నల’ అలికిడి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో మళ్లీ మావోయిస్టుల అలికిడి మొదలైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దశాబ్దకాలంగా లేని మావోయిస్టుల రిక్రూట్మెంట్ మళ్లీ మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు మండలం కొరటికల్‌కు చెందిన చెన్నగోని గణేశ్ అరెస్టు కావడంతో కలకలం రేగింది. నిరుద్యోగ సమస్యతో సతమతమవుతూ యువత అర్బన్ నక్సలిజం వైపు అడుగులేస్తున్నారా? అంటే అవుననే వాదన అంతర్గతంగా వినిపిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా యువత అర్బన్ నక్సలిజం పట్ల ఆకర్షితులు అవుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గణేశ్ అరెస్టే ఇందుకు ఉదాహరణ అన్న చర్చ సాగుతోంది. పదేళ్లుగా జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు పెద్దగా లేవు. ఒకప్పుడు జిల్లా నుంచి వందల సంఖ్యలో మావోయిస్టులు ఉండగా, వారిలో అనేక మంది ఎన్కౌంటర్లలో చనిపోవడం, అరెస్టు కావడం, లొంగిపోవడంతో ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న వారి సంఖ్య పది మందిలోపే ఉన్నట్లు పోలీసులు వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు వారందరూ బతికే ఉన్నారా? లేరా? అన్నది పోలీసులు స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో గణేశ్ అరెస్టు కలకలం రేపుతోంది. అసలేం జరిగింది? పోలీసుల కథనం ప్రకారం.. మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన చెన్నగోని గణేశ్ (22) నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడి చైన్నె అమృత కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన గణేశ్ హైదరాబాద్ క్యాటరింగ్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే ఎంఏ ఫిలాసఫీ పూర్తి చేసిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం జల్లెడ గ్రామానికి చెందిన కోట ఆనందరావు (26) హైదరాబాద్ అద్దె గదిలో ఉంటూ తను కూడా క్యాటరింగ్ బాయ్‌గా పని చేస్తున్నాడు. కుల నిర్మూలన వేదికలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఆనందరావు మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌లోనూ సహకరిస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాది కిందటే ఆనందరావుతో గణేశ్‌కు పరిచయం ఏర్పడింది. ఆనందరావు ఇచ్చిన నక్సల్స్ సాహిత్యం చదివి ఆకర్షితుడైన గణేశ్‌ను కూడా గత నెల 3వ తేదీన పార్టీలో చేర్పించాడు. దళం వద్దే వారం పాటు ఉన్న గణేశ్ తరువాత జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు తీసుకురావడానికి వెళ్లి ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఆగర్‌గూడ వద్ద ఏప్రిల్ 28వ తేదీన అనందరావుతోపాటు పోలీసులకు దొరికిపోయాడు. 29వ తేదీన పోలీసులు అరెస్టు చూపించారు. ఒకప్పుడు రాచకొండ దళానికి షెల్టర్ జోన్‌గా ఉన్న కొరటికల్ గ్రామానికి చెందిన గణేశ్ మావోయిస్టుల్లో చేరి దొరికిపోవడంతో కలకలం రేపింది. మావోయిస్టుల్లో చేరే వారు లేరనుకుంటున్న తరుణంలో.. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో చేరే యువత లేరనుకుంటున్న తరుణంలో 22 ఏళ్ల గణేశ్ అరెస్టు చర్చనీయాంశంగా మారింది. గణేశ్‌ది నిరుపేద కుటుంబం. హైదరాబాద్‌లో ఉండి చదువుకుంటున్న గణేశ్ ఇలా మావోయిస్టులవైపు ఆర్షితుడు కావడం వెనుక బంధువులు, గ్రామంలో ఒకప్పటి మూలాలే కారణం కావచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే అరెస్టుకు మూడు రోజుల ముందు గణేశ్ గ్రామంలోనే ఉన్నాడని, అక్కడి నుంచే పోలీసులు తీసుకెళ్లారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మిగిలింది కొద్ది మందే.. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో మావోయిస్టులు ఉండగా, పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లలో చనిపోయారు. అరెస్టు అయినవారు, లొంగిపోయిన వారు వందల సంఖ్యలో ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన వారు పార్టీలో ఉన్నది పది మందిలోపే. వారిలో ప్రధానంగా చండూరు మండలం పుల్లెంలకు చెందిన పాక హనుమంతు అలియాస్ రాజేష్ తివారి 1983 నుంచి అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. ఒకసారి ఎన్కౌంటర్ చనిపోయారని అనుకున్నా.. తరువాత ఆయన బతికే ఉన్నారన్న సమాచారం పోలీసులకు ఉంది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న హనుమంతుపై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన మందుగుల భాస్కరరావు 1991 నుంచి అజ్ఞాతంలో కొనసాగుతున్నాడు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నాడు. జిల్లాకు చెందిన కొద్దిమంది కూడా చత్తీస్‌గఢ్ దండకారణ్యంలోనే పని చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ఘనంగా గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు
ఆంధ్ర-చత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ నెల 2 నుంచి 8 వరకు మావోయిస్టు అమరవీరుల పీఎల్జీఏ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈవారోత్సవాల్లో మావోయిస్టులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను మావోయిస్టులు రిలీజ్ చేశారు. -
సాయిబాబాకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు సంబంధాల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.‘‘ సాయిబాబాపై మోపిన నేరాలు చాలా తీవ్రమైనవి. సమాజ ప్రయోజనాలకు, దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేవి. నేర తీవ్రత తదితరాలను పరిగణనలోకి తీసుకోకుండా సాంకేతికాంశాల ఆధారంగా బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది’’ అంటూ తప్పుబట్టింది. అంగవైకల్యం, అనారోగ్య కారణాల రీత్యా తనను కనీసం గృహ నిర్భంధంలో ఉంచాలన్న సాయిబాబా విజ్ఞప్తినీ తిరస్కరించింది. బెయిల్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. దాంతో సాయిబాబా తదితరులు నాగపూర్ సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. ఆయనను 2014 ఫిబ్రవరిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును దురదృష్టకరంగా వామపక్ష కార్యకర్తలు, సానుభూతిపరులు అభివర్ణించారు. తీర్పును నిరసిస్తూ సాయిబాబా విడుదల కోసం ఢిల్లీ యూనివర్సిటీలో ధర్నా చేసిన 40 మంది విద్యార్థులు, అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరాలు సాయిబాబాతో సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఈ నెల 14న తీర్పు ఇవ్వడం తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శనివారం సెలవు దినమైనా న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం దీనిపై అత్యవసరంగా విచారణ జరిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ‘‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ప్రకారం సాయిబాబాను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణంతో నిర్దోషిగా ప్రకటించడం సరికాదు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా కేవలం సాంకేతిక అంశాల ఆధారంగా హైకోర్టు తీర్పు చెప్పింది. యూఏపీఏ చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడాన్ని ట్రయల్ కోర్టులో గానీ, ఇతర కోర్టుల్లో గానీ సాయిబాబా సవాల్ చేయలేదు. కస్టడీలోకి తీసుకున్నాక ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేస్తే కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు యూఏపీఏ సెక్షన్ 43(సీ)ని వర్తింపజేసిన దృష్ట్యా సెక్షన్ 465 ప్రకారం సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేయడం సరికాదు’’ అన్నారు. సాయిబాబా తరఫు న్యాయవాది ఆర్.బసంత్ దీనిపై అభ్యంతరం తెలిపారు. ‘‘సాయిబాబాకు 52 ఏళ్లు. 90 శాతం శారీరక వైకల్యముంది. పెళ్లి కాని 23 ఏళ్ల కూతురుంది. అనారోగ్యంతో చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. ఆయనకు నేర చరిత్ర లేదు. ఏడేళ్లకు పైగా జైళ్లో ఉన్నారు. రోజువారీ పనులూ చేసుకోలేకపోతున్నారు. షరతులతోనైనా ఇంటి వద్దే ఉండేందుకు అనుమతివ్వాలి’’ అని కోరారు. మెదడు చాలా డేంజరస్: ధర్మాసనం ఈ వాదనలపై సొలిసిటర్ జనరల్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఇటీవల అర్బన్ నక్సల్స్ ఎక్కువగా గృహ నిర్భంధాలు కోరుతున్నారు. వారు ఇంట్లో ఉండే మెదడు సాయంతో ప్రతిదీ చేస్తారు. ఫోన్లు కూడా వాడుకుంటారు. కాబట్టి గృహ నిర్బంధానికి అవకాశం ఇవ్వొద్దు’’ అని కోరారు. ‘‘జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాద ఉద్యమంతోనూ సాయిబాబాకు సంబంధముంది. మావోయిస్టు కమాండర్ల భేటీలను ఏర్పాటు చేయడం వంటి పనులతో దేశ ప్రజాస్వామిక వ్యవస్థపై యుద్ధానికి తోడ్పాటునందించారు. మావోయిస్టులకు ఆయన మేధో శక్తిగా ఉంటూ వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చారు’’ అని ఆరోపించారు. మెదడు చాలా ప్రమాదకరమైనదని జస్టిస్ షా అన్నారు. ఉగ్రవాద లేక మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినంతవరకు మెదడే సర్వస్వమని అభిప్రాయపడ్డారు. గృహ నిర్బంధం విజ్ఞప్తిని తిరస్కరించారు. సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే నిందితులను దోషులుగా నిర్ధారించారన్నారు. ‘‘హైకోర్టు కూడా సాయిబాబా తదితరులపై కేసులను కొట్టేయలేదు. కింది కోర్టు నిర్ధారించిన అంశాలను తోసిపుచ్చలేదు. కేవలం వారి విడుదలకు మాత్రమే ఆదేశించింది’’ అని ధర్మాసనం గుర్తు చేసింది. విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. -
ఏజెన్సీలో హిడ్మాకు కరోనా చికిత్స?
ఏటూరునాగారం: ఛత్తీస్‌గఢ్ లోని అటవీ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ–1 కమాండర్ హిడ్మాకు కరోనా సోకడంతో చికిత్స కోసం ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చినట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు అడవుల్లో చికిత్స పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏజెన్సీలోని పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో పోలీసులు అడవులబాట పట్టారు. హిడ్మా ఏజెన్సీలోని అడవుల్లో, గొత్తికోయగూడేల్లో తలదాచుకొని చికి త్స పొందుతున్నారనే కోణంలో ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులతోపాటు గ్రేహౌండ్స్ బలగాలు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నాయి. హిడ్మా ఆచూకీ కోసం జాగిలాలు, డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపాయి. ఇటీవల అగ్రనేత ఆర్కేను కోల్పోయిన మావోయిస్టు పార్టీకి ఇప్పుడు హిడ్మా అనారోగ్య సమస్య మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో చికిత్స అందకనే తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాలకు వచ్చి ఉంటాడని నిఘా వర్గాలు తెలిపాయి. పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయడం తో ఏజెన్సీ అంతా హైఅలర్ట్‌గా మారింది. -
గన్ను కాదు.. పెన్ను పట్టండి
మల్కన్‌గిరి: కుటుంబ సభ్యులకు శాంతియుత జీవనాన్ని అందించేందుకు మావోయిస్టులు జనజీవన శ్రవంతిలోకి రావాలని రాష్ట్ర డీజీపీ అభయ్ కోరారు. చిన్నారులకు బంగారు భవిష్యత్ కోసం గన్ను పట్టిన చేతులతో పెన్ను అందించాలని పిలుపునిచ్చారు. కొరాపుట్ జిల్లాలోని మత్తిలి సమితి తులసిపహడ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఎన్కౌంటార్లో భాగస్వామ్యమైన ఆంధ్రప్రదేశ్, ఛత్తిస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు పోలీసు అధికారులతో రహస్య సమావేశం నిర్వహించారు. మావోయిస్టులను ఎలా అణచి వేయాలనే కార్యచరణపై చర్చించారు. మల్కన్‌గిరి జిల్లా సరిహద్దులో ముడు రాష్ట్రాల పోలీసు బృందాలతో సంయుక్తంగా కూంబింగ్ జరపాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని స్పష్టంచేశారు. మల్కన్‌గిరి జిల్లా ప్రస్తుతం అధివృద్ధి పథంలో నడుస్తోందని, స్థానిక కటాఫ్ ఏరియాలో అమాయక గిరిజనులను తప్పదోవ పట్టించవద్దని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని, కుటుంబాలకు ప్రశాంతమైన జీవనాన్ని అందించేందుకు జనంలోకి రావాలని సూచించారు. అలాగే ఎన్కౌంటర్లో పాలుపంచుకున్న పోలీసు దళాలను డీజీపీ అభినందించారు. అనంతరం ఎన్కౌంటర్లో స్వా«దీనం చేసుకొన్న మృతదేహలు, ఇతర సామగ్రీని విలేకర్ల ముందు ప్రదర్శించారు. ముగ్గురివీ.. మూడు రాష్ట్రాలు ఎన్కౌంటర్లో పోలీసులు స్వా«దీనం చేసుకున్న ఆయుధాల్లో ఎస్ఎల్ఆర్ రైఫిల్(1), ఏకే–47(1), ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్లు(3), కిట్ బ్యాగ్‌లు, బుల్లెట్లు, వాకీటాకీలు, మావోయిస్టు సాహిత్యం, విద్యుత్ వైర్లు, రేడియో, కత్తులు, జిలిటెన్ స్టిక్‌లు, ఇతర సామగ్రీ ఉన్నాయి. మృతిచెందిన మావోయిస్టులలో... మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి సుదకొండ గ్రామానికి చెందిన అనీల్ అలియాస్ కిషోర్ అలియాస్ దాసరి అలియాస్ ముకసోడి. ఆంధ్ర–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీలో ఏసీఎంగా ఉన్నాడు. ఆయనపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సోనీపై రూ.4 లక్షలు రివార్డు ఉంది. ఆమె మావోయిస్టు అగ్రనేత అరుణక్క రక్షణ బృందంలో ఏసీఎంగా పని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా పెదబాయిల్ గ్రామానికి చెందిన చిన్నారావు పార్టీ సభ్యుడు ఉన్నారు. అరుణక్క రక్షణ బృందంలోనే పని చేస్తున్నాడు. ఇతనిపై రూ.లక్ష రివార్డు ఉంది. పర్యటనలో ఐజీ ఆపరేషన్స్ అమితాబ్ ఠాకూర్, ఇంటిలిజెన్స్ డీఐజీ అనువృద్ధసింగ్, దక్షణాంచల్ డీఐజీ రాకేష్ పండిట్, మల్కన్‌గిరి ఎస్పీ ప్రహ్లాద్స్వొయి మిన్నా, ఇతర పోలీసుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
AOB: రేపటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు
పాడేరు/ముంచంగిపుట్టు: ఏవోబీ వ్యాప్తంగా బుధవారం నుంచి మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఈ వారోత్సవాలను భగ్నం చేసే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిశా, ఆంధ్రా పోలీసు యంత్రాంగమంతా ఈ వారోత్సవాలపై దృష్టి సారించింది. ఇరు రాష్ట్రాల ప్రత్యేక పోలీసు బలగాలు ఇప్పటికే కూంబింగ్ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల పోలీసు బలగాలన్నీ ఇప్పటికే ఒడిశా కటాఫ్ ఏరియాలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. విశాఖ ఏజెన్సీకి సంబంధించి కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని అన్ని పోలీసు స్టేషన్లను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసేంత వరకు రెడ్ అలెర్ట్ అమలు చేస్తున్నారు. ఏజెన్సీలోని దారకొండ, పెదవలస, బలపం, నుర్మతి, రూడకోట అవుట్‌పోస్టుల పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ చర్యలు అధికమయ్యాయి. మరోవైపు మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలను ఏవోబీ వ్యాప్తంగా విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఆయా మారుమూల గ్రామాల్లో ప్రచారం చేస్తోంది. విశాఖ రూరల్ ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో చింతపల్లి ఏఎస్పీ తుషార్ డూడి, పాడేరు ఏఎస్పీ జగదీష్ ఈ రెండు సబ్ డివిజన్లలో పోలీసు యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కూంబింగ్ చర్యలు, మండల కేంద్రాల్లోని వాహనాలు, ఇతర తనిఖీలను సమీక్షిస్తున్నారు. కొత్తూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ముమ్మర తనిఖీలు చేస్తున్న బలగాలు డాగ్, బాంబు స్క్వాడ్ల తనిఖీలు ముంచంగిపుట్టు మండలంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సరిహద్దులో డాగ్, బాంబు స్క్వాడ్లతో పోలీసు బలగాలు కల్వర్టులు, వంతెనలు తనిఖీలు చేస్తూ వాహన రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు. గూడెంకొత్తవీధి మండలంలో మావోయిస్టులు పోలీసు ఇన్ఫార్మర్లపై, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారపార్టీ నేతలపై దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్త చర్యలు చేపట్టారు. జి.మాడుగుల మండలంలో సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, సివిల్ పోలీస్, బాంబ్‌స్క్వాడ్‌లతో తనిఖీలు చేశారు. చింతపల్లి–జీకే వీధి రహదారి మార్గంలో వాహనాలు తనిఖీ చేయడంతో పాటు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనంతగిరి మండలంలోని ములియగుడలోని జంక్షన్ వద్ద అరకు–విశాఖ ప్రధాన రహదారిలోని వాహనాలను ఆపి క్షుణంగా పరిశీలించారు. -
ఏడుగురు యువకుల కిడ్నాప్ కథ సుఖాంతం
ఛత్తీస్‌గఢ్: కుందేడ్ గ్రామంలో కలకలం రేపిన ఏడుగురు యువకుల కిడ్నాప్ కథ సుఖాతం అయింది. రెండు రోజుల క్రితం సుక్మా జిల్లాలోని జేగురుకొండ పోలీసు స్టేషన్ పరిధిలో కుందేడ్ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే బుధవారం ఆ యువకులు సురక్షితంగా ఇంటికి రావటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. వారిని ఎవరు కిడ్నాప్ చేశారన్న దానిపై యువకులు స్పష్టత ఇవ్వలేదు. -
హిడ్మాకూ కరోనా..
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు దళాల ను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో మావోయిస్టు పార్టీ ముఖ్యనేతలు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా మరో అగ్రనేత మాడావి హిడ్మా కూడా కరో నా బారిన పడ్డాడన్న ప్రచారం కలకలం రేపుతోంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) బెటాలియన్–1కు కమాండర్‌గా ఉన్న హిడ్మా.. ఏప్రిల్ 3న బీజాపూర్‌లో 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోతతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా సైతం కొనసాగుతున్న హిడ్మా.. కొంతకాలంగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడని, అడవిలోనే అతనికి చికిత్స సాగుతున్నట్టు తమకు సమాచారం ఉందని ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయంలో మావోయిస్టు పార్టీ ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. మూడురోజుల ముందు ఉత్సాహంగానే హరిభూషణ్..! ప్రస్తుతం దండకారణ్యంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ దాడి అనంతరం మావోయిస్టులు గిరిజనులతో వరుసగా నిర్వహించిన సభలు, సమావేశాల ద్వారా కరోనా వైరస్ ఆయా దళాల సభ్యులకు సోకింది. అగ్రనేతలంతా 50 ఏళ్లు పైబడి ఉండటం.., దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతుండటం, వీటికితోడు ప్రమాదకరమైన వైరస్ కావడంతో అప్పటిదాకా చలాకీగా ఉన్న వారు కూడా ఉన్నపళంగా మరణిస్తున్నారని సమాచారం. హరిభూషణ్ మరణానికి మూ డురోజులు ముందు షేవింగ్ కూడా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అతనికి కంటిచూపు సమస్యలు ఉన్నాయని, అందుకే ఇటీవల కొత్త కళ్లజోడు కూడా తెచ్చుకున్నాడని వివరించారు. సారక్క కూడా ఎక్కువ కాలం అనారోగ్యానికి గురవలేదని, వైరస్ సోకిన వారం రోజుల్లోపే మరణించిందని తెలుస్తోంది. సొంతవైద్యంతోనే చేటు.. వాస్తవానికి గతేడాది మొదటి వేవ్‌లో వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉంది. అప్పుడు వైరస్ సోకినప్పటికీ... మాత్రలతో తగ్గిపోయింది. కానీ, ప్రస్తుతం వైరస్ తీవ్రత పెరిగింది. దీంతో కరోనా చికిత్స క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సొంతవైద్యమే మావోయిస్టుల కొంపముంచుతోంది. కేవలం యూట్యూబ్‌లు, ఆన్లైన్లో చదివి ఏవో మాత్రలు తెప్పించుకుని వాటినే వాడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, డయాలసిస్, ఆక్సిమీటర్లు, వెంటిలేటర్ల వంటి సదుపాయాలు అడవిలో లభించవు. కేవలం మూడువారాల్లో మధుకర్, కత్తిమోహన్, హరిభూషణ్, సారక్క అకాలమరణం చెందారు. లొంగిపోతే చికిత్స చేయిస్తామని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెపుతున్నా.. పార్టీకి మనుగడ ఉండదన్న ఆందోళనతో ముఖ్యనేతలెవరూ ముందుకు రావడం లేదు. -
జాబ్ నుంచి సాయిబాబా తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: మావోలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంలాల్ ఆనంద్ కళాశాల తొలగించింది. మార్చి 31 నుంచి సాయిబాబా సేవలను రద్దు చేస్తున్నట్లు, ప్రతిగా 3నెలల జీతాన్ని సాయిబాబా బ్యాంక్ ఖాతాలో జమచేసినట్లు సాయిబాబా భార్యకు ఇచ్చిన మెమొరాండంలో కాలేజీ ప్రిన్సిపల్ రాకేశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఇంగ్లిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన సాయిబాబాను 2014లో పుప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతితో సహా చట్టవిరుద్ధమైన సీపీఐ(మావోయిస్ట్) అగ్ర నాయకులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం సాయిబాబాను వెంటనే సస్పెండ్ చేసింది. 2017 మార్చిలో వామపక్ష ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, చట్టవిరుద్ధ కార్యకలాపా లు (నివారణ) చట్టం ప్రకారం దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేలా ప్రోత్సహించి నందుకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా తేల్చింది. వారందరికీ జీవిత ఖైదు విధించింది. సాయిబాబాను 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని 120బీ(క్రిమినల్ కుట్ర)లోని 13, 18, 20, 38, 39 సెక్షన్ల ప్రకారం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. గిలానీ సేవలను ఇలా రద్దుచేయలేదు అయితే సాయిబాబా అరెస్ట్ అయినప్పటి నుంచి సాయిబాబా కుటుంబం సగం జీతాన్ని పొందుతోంది. ఉద్యోగం నుంచి తొలగిస్తూ కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సాయిబాబా భార్య ఖండించారు. ఇది పూర్తిగా ఉద్యోగుల హక్కుల ఉల్లంఘన అని ఆరోపించారు. ఈ విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్తానని సాయిబాబా భార్య వసంత తెలిపారు. సాయిబాబాకు వేసిన శిక్షకు వ్యతిరేకంగా తమ అప్పీల్ బొంబాయి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ సమయంలో తొలగిస్తూ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా నిర్ధారించబడిన గిలాని, తరువాత అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా బయటికొచ్చారన్నారు. అప్పుడు అతని సేవలను ఈ విధంగా రద్దు చేయలేదని, ఇప్పుడు సాయిబాబా సేవలను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు. -
మన్యంలో అలజడి!
సాక్షి, భూపాలపల్లి : ప్రశాంతంగా ఉన్న అడవుల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పెద్దంపేట అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా అటవీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ఘటన జరిగిన ప్రాంతానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోనే అంబట్పల్లి పోలీస్‌స్టేషన్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇక ఎదురుకాల్పుల ఘటనలో 12 నుంచి 15 మంది మావోయిస్టులు తప్పించుకున్నారని అనుమానిస్తున్నారు. ఇందులో ఒకరిద్దరు ముఖ్యనేతలున్నట్లు విశ్వసనీయ సమాచారం. తప్పించుకున్న ముఖ్య నాయకులు! కొంతకాలంగా జిల్లాలో మావోల కదలికలు పెరిగాయని రెండ్రోజుల క్రితం ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో పోలీసులు పలిమెల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలోనే మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. ఈక్రమంలోనే మావోలు తప్పించుకుని పారి పోయినట్లు పోలీసు అధికారులు చెబుతున్నా రు. ప్రస్తుతం తప్పించుకున్న మావోలు మహాముత్తారం మీదుగా ములుగు అటవీప్రాంతంలోకి లేకపోతే గోదావరి తీరం దాటి ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోకి ప్రవేశించే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి తప్పించుకున్న వారిలో జయశంకర్–మహబూబాబాద్–వరంగల్–పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డితో పాటు ఏటూరునాగారం–మహదేవపూర్ ఏరి యా సెక్రటరీ రీనా, ఇల్లందు–నర్సంపేట ఏరి యా సెక్రటరీ భద్రు, జమున, భూపాలపల్లి జిల్లాకు చెందిన భిక్షపతి తదితరులున్నారని గుర్తించినట్లు సమాచారం. తప్పించుకుపోయిన వీరి కోసం మహదేవపూర్, మహాముత్తారం, పలిమెల, భూపాలపల్లి అటవీ ప్రాం తాలతో పాటు ములుగు జిల్లా అటవీ ప్రాం తాల్లో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 13 పోలీసు బృందాలతో పాటు రెండు గ్రేహౌండ్స్ బృందాలూ రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి, ఇంద్రావతి నదుల సరిహద్దుల్లో నిఘా పెంచారు. అటవీ ప్రాంతా న్ని డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్నారు.