కన్నెపల్లిలోని లక్ష్మీపంపుహౌస్ వద్ద సివిల్, సీఆర్‌పీఎఫ్ పోలీసుల పహారా
సాక్షి, కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులపై పోలీసులు నిఘా పటిష్టం చేశారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. జిల్లాలో మావోయిస్టులు పట్టు కోసం ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో రాత్రీపగలు గోదావరి తీర ప్రాంతాలు, అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. పల్లెలతో పాటు ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులు విచారించి వదిలేస్తున్నారు.
వాహనాల తనిఖీలు
కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన మీదుగా మహారాష్ట్ర–తెలంగాణకు వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కాళేశ్వరం, మహాదేవపూర్, పలిమెల ఎస్సైలు అభినవ్, అనిల్, శ్యాంరాజ్ ఆధ్వర్యాన తనిఖీలు సాగుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు తెలంగాణ వైపు మహదేవపూర్, పలిమెల మండలాల్లో గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు. మహదేవపూర్, పలిమెల మండలంలోని రేవులపై ప్రత్యేక దృష్టిని సారించారు.
గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రోడ్డు మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఇక మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డలోని లక్ష్మీ, అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ, కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్, గ్రావిటీ కాల్వల వద్ద నిఘా తీవ్రం చేశారు. జిల్లా ఇన్‌చార్జి ఎస్సీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, కాటారం డీఎస్పీ బోనాల కిషన్, సీఐ నర్సయ్య ఆధ్వర్యంలో బ్యారేజీలపై ప్రత్యేక నజర్ వేసినట్లు తెలిసింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్, డిస్ట్రిక్ గార్డులు, సివిల్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment