మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టయిన ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా పదేళ్ల సుదీర్ఘ కారాగారవాసం నుంచి గురువారం నిర్దోషిగా విడుదలయ్యారు. ఇదే అభియోగాలతో ఆయనతోపాటు అరెస్టయిన మరో అయిదుగురికి కూడా విముక్తి లభించింది. ఒకరు విచారణ సమ యంలో మరణించారు. అభియోగాలను రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చెబు తూనే, అసలు తగిన అనుమతులు లేకుండా సాగించిన ఈ కేసు చెల్లుబాటు కాదని బొంబాయి హైకోర్టు నాగపూర్ ధర్మాసనం వ్యాఖ్యానించటం మన నేర న్యాయవ్యవస్థ పనితీరును పట్టిచూపుతోంది.
యూఏపీఏ కింద ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించాలంటే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిందితులపై పకడ్బందీ సాక్ష్యాధారాలున్నాయని వారు విశ్వసించాకే ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలి. కానీ ఈ కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను 2014లో అరెస్టు చేయగా ఏడాది తర్వాతగానీ అనుమతులు రాలేదు. ఇతర నిందితులు వాస్తవానికి 2013లోనే అరెస్టయ్యారు. ఈ సంగతి పట్టని మహారాష్ట్రలోని గఢ్‌చిరోలి సెషన్స్ కోర్టు కేసును పరిగణనలోకి తీసుకుని ఈలోగా ఒక సాక్షిని కూడా విచారించింది! చివరకు 2017లో వీరిని దోషులుగా పేర్కొంటూ యావజ్జీవ శిక్ష విధించింది.
అటు ప్రభుత్వ యంత్రాంగం సరే... ఇటు న్యాయవ్యవస్థ సైతం ఇంత యాంత్రికంగా పనిచేయటం సరైందేనా? బొంబాయి హైకోర్టు 2022లో ఈ అవక తవకలను గుర్తించి కేసు కొట్టేసింది. కానీ ఆ వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర అప్పీల్‌ను స్వీకరించి బొంబాయి హైకోర్టు తీర్పును నిలుపుదల చేయటం, తిరిగి దీన్ని విచారించాలంటూ ఆదేశాలు జారీచేయటంవల్ల సాయిబాబా తదితరులకు స్వేచ్ఛ లభించటానికి మరికొన్ని నెలలు పట్టింది. ఇలా కనీస సాక్ష్యాధారాలు కొరవడిన, ముందస్తు అనుమతులు తీసుకోని కేసులో నింది తులను పదేళ్లపాటు జైలు గోడలమధ్య బంధించి వుంచారంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఇది వ్యవస్థల సమష్టి వైఫల్యం కాదా? ఇందుకు జవాబుదారీతనం వహించాల్సిందెవరు? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ఈయూ కమిషన్, అమెరికన్ కాంగ్రెస్, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభా గంలో ఈ కేసు ప్రస్తావనకొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని వివిధ సంస్థల వరకూ అందరికందరూ ఇది అన్యాయంగా బనాయించిన కేసు అనీ, వెంటనే ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేస్తూ వచ్చారు. టీఆర్‌ఎస్ సభ్యుడు కె. కేశవరావు 2015లో జీరో అవర్‌లో దీన్ని రాజ్య సభలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు.
అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ కూడా రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కనీసం కేసు తేలేవరకూ నిందితులను బెయిల్‌పై విడుదల చేసివుంటే కొంతలో కొంతైనా న్యాయం చేసినట్టయ్యేది. బెయిల్ అనేది హక్కు, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జైలుకు పంపాలన్నది మౌలిక న్యాయసూత్రం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈమధ్యకాలంలో కూడా పదే పదే ఈ సంగతిని గుర్తుచేస్తున్నారు. అయినా ఆచరణకొచ్చేసరికి జరిగేది వేరుగా వుంటోంది.
నిందితులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపట్ల విరోధభావాన్ని వ్యాప్తిచేసేందుకు కుట్రపన్నారని తెలిపింది. ఆ విషయంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర పత్రాలువంటి సాక్ష్యాధారాలు అత్యంత బలహీనమైన వని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా వెబ్‌సైట్ నుంచి వీడియోలు, ఇతర సమాచారం డౌన్‌లోడ్ చేసుకోవటం దానికదే నేరమెలా అవుతుందన్నది ధర్మాసనం సందేహం.
ఫలానా ఉగ్ర వాద చర్యకూ, దానికీ సంబంధం వున్నదని నిరూపిస్తే తప్ప ఆ సాక్ష్యానికి ఎలాంటి విలువా వుండ దని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ సాయిబాబా అభిప్రాయాలు ఎవరికీ తెలియ నివి కాదు. ఆయన వృత్తిరీత్యా ఇంగ్లిష్ అధ్యాపకుడు. కవి, రచయిత కూడా. ఆదివాసీ ప్రాంతాల్లో సహజవనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రచనలు చేశారు.
అరెస్టయిన సమయానికి విప్లవ ప్రజాస్వామిక వేదిక (ఆర్‌డీఎఫ్) బాధ్యుడు. ఆయన హింసాత్మక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే, విధ్వంసానికి పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ 90 శాతం అంగవైకల్యం వున్న సాయిబాబా మరొకరి సాయం లేనిదే తన పని తాను చేసుకోవటం కూడా అసాధ్యం. బయటకు వెళ్లాలంటే చక్రాల కుర్చీ తప్పనిసరి. అటు వంటి వ్యక్తిని ఉగ్రవాదిగా జమకట్టడం సబబేనా?
కేవలం అసమ్మతిని వ్యక్తం చేయటమే ఒక మనిషిని పదేళ్లపాటు జైల్లోకి నెట్టడానికి కారణం కావటం మనం నమ్మే ప్రజాస్వామిక విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉగ్రవాద చర్యలు సమాజ క్షేమానికి ముప్పుగా పరిణమిస్తాయనటంలో సందేహం లేదు. అటువంటివారిని అదుపు చేయాలంటే యూఏపీఏ వంటి కఠిన చట్టాల అవసరం వుందని ప్రభుత్వాలు భావిస్తే తప్పుబట్టనవసరం లేదు.
కానీ మన రాజ్యాంగమే అనుమతించిన సహేతుకమైన అసమ్మతిపై లేనిపోని ముద్రలేసి దాన్ని తుంచివేయాలనుకోవటం, భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవటం ఏరకంగా చూసినా సబబు కాదు. ఇప్పుడు సాయిబాబా కోల్పోయిన విలువైన పదేళ్ల కాలాన్ని ప్రభుత్వం వెనక్కివ్వలేదు. కనీసం ఉద్యోగమైనా చేసుకోనివ్వాలి. ఇతర క్రిమినల్ కేసుల మాట అటుంచి యూఏపీఏ వంటి దారుణ చట్టాలకింద అరెస్టయి నిర్దోషులుగా తేలినవారికైనా తగిన పరిహారం చెల్లిస్తే కాస్తయినా ఉపశమనం ఇచ్చినట్టవుతుంది. పాలకులు ఆలోచించాలి.
ఆలస్యంగా దక్కిన న్యాయం
Published Fri, Mar 8 2024 12:39 AM | Last Updated on Fri, Mar 8 2024 12:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment