ముంబై: బాలలపై లైంగిక దాడికి వివాదాస్పద నిర్వచనమిచ్చి వార్తల్లోకెక్కిన బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ అదనపు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా గురువారం రాజీనామా చేశారు. దానికి వెంటనే ఆమోదం లభించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మైనర్ చేతులు పట్టుకోవడం, ప్యాంటు జిప్పు విప్పడం లైంగిక దాడి కావంటూ 2021 ఫిబ్రవరిలో పుష్ప తీర్పు ఇచ్చారు. లైంగికపరమైన కోరికతో నేరుగా శరీరాన్ని తాకితే మాత్రమే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద లైంగిక దాడిగా పరిగణనలోకి వస్తుందన్నారు.
ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలన్న సిఫార్సులను అప్పట్లో సుప్రీంకోర్టు కొలీజియం వెనక్కు తీసుకుంది. ఏడాది పాటు అదనపు న్యాయమూర్తిగానే కొనసాగించింది. అది శుక్రవారంతో ముగియనున్నా పొడిగింపు గానీ, పదోన్నతి గానీ ఇవ్వలేదు. ఆమె పదవిలో కొనసాగితే శుక్రవారం నుంచి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా పని చేయాల్సి వచ్చేది.
Comments
Please login to add a commentAdd a comment