
నేను ఇటీవల ప్రచార మాధ్యమాలలో, సోషల్ మీడియాలో పోక్సో చట్టం అనే పదాన్ని తరచు వింటున్నాను. దీని గురించి వివరించగలరా?
– సంకా పవన్ కుమార్, తెనాలి
చిన్నారులపై లైంగిక దాడులు జరగడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినపడుతోంది. అంతకుముందు చిన్నారులపై లైంగిక దాడులు లేవని కాదు. ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టడానికి ఉన్న కఠినమైన పోక్సో చట్టం (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం) కూడా ఈ మధ్యకాలంలో చాలా కేసులను బయటకు తీసుకు వచ్చింది.
2024 ఎన్.సి.ఆర్.బి లెక్కల ప్రకారం 2019 నుంచి 31–మే 2024 వరకు దేశవ్యాప్తంగా 2,99,759 పోక్సో కేసులు నమోదు కాగా తెలంగాణలో 2,731 – ఆంధ్రప్రదేశ్‌లో 11,774 కేసులు నమోదయ్యాయి. గత ఐదు సంవత్సరాలలో దాదాపుగా 20 శాతం చిన్నారులపై లైంగిక దాడుల కేసులు పెరిగినట్లుగా చెబుతున్న అంకెలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం వెలుగులోకి వస్తున్న కేసుల కన్నా నమోదు కాని కేసుల సంఖ్య రెండింతల పైమాటే!
చట్ట ప్రకారం మైనర్ బాలిక/బాలుర పై ఏ విధమైన లైంగిక హింస లేదా దాడి జరుగుతున్న విషయం తెలిసినవారు కచ్చితంగా ఫిర్యాదు చేయాలి. లైంగిక దాడి జరిగిందన్న ఖచ్చితమైన సమాచారం మాత్రమే కాదు. లైంగిక దాడి జరిగి ఉండవచ్చు లేదా దాడి జరిగి ఉండే ఆస్కారం ఉంది అన్న సందేహం ఉన్న వారు కూడా ఫిర్యాదు చేయాలి.
అలా తెలిసినప్పటికీ ఫిర్యాదు చేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే 18 సంవత్సరాలు దాటిన వారెవరైనా సరే సెక్షన్ 19 పోక్సో చట్టం కింద ఆరు నెలల నుండి ఏడాది వరకు జైలు శిక్ష పడుతుంది. ఈ అంశంపై ప్రభుత్వాలు, అలాగే మీడియా కూడా తగిన ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. పేరెంటింగ్ అంటే కేవలం తల్లిదండ్రులకు సంబంధించినది మాత్రమే కాదు. సమాజానిది కూడా!
లైంగిక హింస, లైంగిక దాడి, మైనర్ల ఫోటోలు – వీడియోలు అశ్లీల చిత్రాలకి వాడడం, చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు/వీడియోలు కలిగి ఉండడం వంటివి కూడా పోక్సో చట్టం కింద నేరాలే. ఆటిజం వంటి మానసిక ఎదుగుదల లేమి, మతిస్థిమితం లేని పిల్లలపై, అలాగే చిన్నపిల్లలపై అధికారం కలిగిన వ్యక్తులు (తల్లిదండ్రులు, టీచర్లు, కొన్ని ప్రత్యేక వృత్తులలో ఉండే అధికారులు మొదలైన వారు) లైంగిక దాడులకు పాల్పడినట్లయితే అవి ‘అతి తీవ్రమైన’ నేరాలుగా పరిగణించబడతాయి.
అందుకుగాను యావజ్జీవ కారాగార శిక్ష, ఉరిశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, బాలలకు ఎటువంటి లైంగిక ఇబ్బంది కలుగుతుందేమోనన్న సందేహం ఉన్నా తక్షణం పోలీసులకి తెలియజేయడం అందరి బాధ్యత.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comMýకు మెయిల్ చేయవచ్చు)
(చదవండి: ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్)
Comments
Please login to add a commentAdd a comment