Bombay High Court
-
ఈడీకి రూ. లక్ష ఫైన్
ముంబై: బాంబే హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తిపై అనవసరంగా మనీలాండరింగ్ కేసును చేపట్టినందుకు ఈడీని మందలించింది. ఈ కేసులో హైకోర్టు ఈడీకి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.ఎటువంటి బలమైన కారణం లేకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్‌పై మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టిన నేపధ్యంలో బాంబే హైకోర్టు ఈడీకి జరిమానా విధించింది. ఈ సందర్భంగా కేంద్ర సంస్థలు చట్ట పరిధిలో పనిచేయాలని హైకోర్టు పేర్కొంది. పౌరులు అనవసరంగా వేధింపులకు గురికాకుండా ఉండేందుకు చట్ట అమలు సంస్థలకు సందేశం పంపాల్సిన అవసరం ఉందని జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది.వివరాల్లోకి వెళితే రాకేష్ జైన్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్(Real estate developer)పై నిబంధనల ఉల్లంఘన, మోసం ఆరోపణలపై ఒక ఆస్తి కొనుగోలుదారు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు విలే పార్లే పోలీస్ స్టేషన్లో నమోదైంది. దీని ఆధారంగా రాకేష్ జైన్‌పై మనీలాండరింగ్ కేసును నమోదు చేసి, ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు ఆగస్టు 2014 నాటిది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్‌పై ప్రత్యేక కోర్టు 2014 ఆగస్టులో నోటీసు జారీ చేసింది. తాజాగా మంగళవారం (జనవరి 21) ఈ కేసులో రాకేష్ జైన్‌పై ప్రత్యేక కోర్టు జారీ చేసిన నోటీసును హైకోర్టు రద్దు చేసింది.జస్టిస్ జాదవ్ మాట్లాడుతూ ఇప్పుడు తనముందున్న కేసు.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(Anti-Money Laundering Act) అమలు ముసుగులో వేధింపులకు సంబంధించిన కేసుగా కనిపిస్తోందన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారునితో పాటు ఈడీ కూడా దురుద్దేశంతో చర్యలు చేపట్టిందని స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. ఇందుకు కఠినమైన శిక్ష విధించాలన్నారు. ఈడీ వంటి కేంద్ర సంస్థలు చట్ట పరిధిలోనే వ్యవహరించాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇలా పౌరులను వేధించడం తగదని సూచించింది.ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి బాంబే హైకోర్టు అనుమతి
ముంబై: పదకొండేళ్ల రేప్ బాధితురాలు తన 30 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతించింది. 11 ఏళ్ల చిన్నారి అబార్షన్‌కు మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉందని వైద్య నిపుణుల బృందం చెప్పడాన్ని పరిగణలోకి తీసుకొని 30 వారాల గర్భవిచ్ఛిత్తికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా చిన్నారి పొత్తికడుపు గట్టిపడిందని భావించామని, థానే ఆసుపత్రిలోనూ డాక్టర్లు అలాగే భావించి మందులు రాసిచ్చారని తండ్రి కోర్టుకు తెలిపారు. అయినా బాలిక పరిస్థితిలో మార్పేమీ రాకపోవడంతో అక్టోబరు 24న ముంబై ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ బాలిక గర్భం దాల్చిందనే విషయాన్ని డాక్టర్లు ధ్రువీకరించారని ఆమె తండ్రి కోర్టుకు విన్నవించారు. గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోర్టును కోరడంతో 30 వారాల గర్భాన్ని తొలగించడానికి అనుమతిస్తూ జస్టిస్ షర్మిల దేశ్‌ముఖ్, జస్టిస్ జితేంద్ర జైన్ల ధర్మాసనం తీర్పునిచ్చింది. -
నగ్న చిత్రం ప్రతిదీ అసభ్యకరం కాదు
ముంబై: నగ్నంగా ఉండే ప్రతి పెయింటింగ్ అశ్లీలంగా ఉందని చెప్పలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ప్రముఖ చిత్రకారులు ఎఫ్ఎన్ సౌజా, అక్బర్ పదమ్సీ గీసిన కళాఖండాలను వారికి తిరిగిచ్చేయాలంటూ కస్టమ్స్ విభాగం అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది జూలైలో ముంబై కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ జస్టిస్ ఎంఎస్ సొనక్, జస్టిస్ జితేంద్ర జైన్ డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది. నగ్నంగా అగుపించేంది ఏదైనా సరే అశ్లీలమైనదనే వ్యక్తిగత అవగాహన ఆధారంగా మాత్రమే ఆ అధికారి నిర్ణయం తీసుకున్నారని, నిపుణుల అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని పేర్కొంది. ముంబై వ్యాపారవేత్త ముస్తాఫా కరాచీవాలాకు చెందిన బీకే పాలిమెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2022లో లండన్‌లో జరిగిన రెండు వేర్వేరు వేలాల్లో ఎఫ్ఎన్ సౌజా, అక్బర్ పదమ్సీ గీసిన ఏడు పెయింటింగ్‌లను సొంతం చేసుకుంది. వీటిని 2023 ఏప్రిల్‌లో ముంబైకి తీసుకురాగా కస్టమ్స్ విభాగం స్పెషల్ కార్గో కమిషనరేట్ వీటిని అసభ్యకర వస్తువులని అభ్యంతరం చెబుతూ స్వాధీనం చేసుకుంది. 2024లో అసిస్టెంట్ కమిషనర్ వీటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడంతోపాటు ఆ కంపెనీకి రూ.50వేల జరిమానా సైతం విధించారు. ఈ చర్యలను బీకే పాలిమెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో సవాల్ చేసింది. -
సమాజం పట్ల కరుణతోనే న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నా..
ముంబై: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సైతం సూక్ష్మ పరిశీలనకు గురి కావాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయమూర్తుల పనితీరును చుట్టూ ఉన్న సమాజం పరిశీలిస్తూనే ఉంటుందని అన్నారు. అయితే, సమాజం పట్ల ఉన్న దయ, కరుణ, జాలి, అనురాగం వల్లే తాను అన్ని రకాల పరిశీలనలు, పరీక్షలకు నిలిచి, న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నానని తెలిపారు. సమాజం పట్ల తమ ప్రేమానురాగాలు తమ తీర్పుల ద్వారా వెల్లడవుతాయని వివరించారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెల 10వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముంబైలో ఆయనను ఘనంగా సత్కరించారు. జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను న్యాయవాదులు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ తాను ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ‘‘ఐఐటీ–ధన్బాద్లో చేరేందుకు సకాలంలో అడ్మిషన్ ఫీజు రూ.17,500 చెల్లించలేకపోయిన దళిత విద్యార్థికి మా ఆదేశాలతో ప్రవేశం లభించింది. ఇలాంటి తీర్పులు తనకెంతో సంతృప్తిని ఇచ్చాయి’’ అని తెలిపారు. -
షిర్డీ సాయి ట్రస్టుకు పన్ను మినహాయింపు సబబే
ముంబై: షిర్డీ సాయి బాబా ట్రస్టుకు హుండీ కానుకల రూపంలో వస్తున్న నగదుకు ఆదాయపు పన్ను మినహాయింపు సబబేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గతేడాది అక్టోబరు 25న ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఇచ్చిన తీర్పును సమర్థించింది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు (షిర్డీ) ఒక ధార్మిక సంస్థ అని, ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టడం లేదని ముంబై ఐటీ కమిషనర్ (మినహాయింపులు) వాదించారు. హుండీ రూపంలో గుర్తుతెలియని భక్తులు సమర్పిస్తున్న కానుకలు.. మొత్తం విరాళాల్లో ఐదు శాతాన్ని దాటుతున్నాయి కాబట్టి.. పన్ను పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. 2015–16, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో హుండీ కానుకల రూపంలో షిర్డీ ట్రస్టుకు రూ.400 కోట్లు అందాయని, అందులో కేవలం రూ. 2.3 కోట్లు మాత్రమే మతపరమైన కార్యక్రమాలకు వెచ్చించారని ఐటీ కమిషనర్ హైకోర్టుకు తెలిపారు. అధికభాగం నిధులను విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వైద్య సదుపాయాలకు మళ్లించారని పేర్కొన్నారు. జస్టిస్ జి.ఎస్.కులకర్ణి, జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్‌లు ఈ వాదనతో విభేదించారు. షిర్డీ ట్రస్టు మతపరమైన, చారిటబుల్ ట్రస్టు అని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు కోరడం చట్టబద్ధంగా న్యాయమని, సబబని తీర్పునిచ్చారు. -
పోలీస్ స్టేషన్లో రికార్డింగ్ నేరం కాదు: బాంబే హైకోర్టు
ముంబై: పోలీసు స్టేషన్లో అధికారులతో సంభాషణను రికార్డ్ చేయడం అధికారిక రహస్యాల చట్టం ప్రకారం నేరం కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. పోలీస్ స్టేషన్లో బెదిరింపు సంభాషణను రికార్డ్ చేసినందుకు గూఢచర్యం ఆరోపణలతో ఇద్దరు సోదరులపై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.ఈ కేసు హైకోర్టుకు చేరిన దరిమిలా దీనిపై విచారణ జరిగింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కింద వారిపై నేరపూరిత కుట్ర ఆరోపణలను రద్దు చేయడానికి నిరాకరిస్తూనే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు సోదరులపై గూఢచర్యం ఆరోపణలను కోర్టు రద్దు చేసింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) ప్రకారం ఈ రికార్డింగ్ పోలీస్ స్టేషన్లో జరిగిందని జస్టిస్ విభా కంకన్‌వాడి, జస్టిస్ ఎస్జీ చపాల్గావ్కర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.అధికారిక రహస్యాల చట్టం- 1923లో నిషేధిత ప్రదేశం అంటే ఏమిటో తెలిపారు. అయితే దానిలో పోలీస్ స్టేషన్ అనేది లేదు. అందుకే వారిపై అధికారిక రహస్యాల చట్టం కింద మోపిన అభియోగాలు నిరాధారమైనవని తెలియజేస్తూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. మహారాష్ట్రకు చెందిన సోదరులు సుభాష్, సంతోష్ రాంభౌ అథారేలపై నేరపూరిత కుట్రతో పాటు, అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్లు 2022 జూలై 19న పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. సుభాష్ ఒక పోలీసు అధికారితో జరిపిన సంభాషణను రికార్డ్ చేసిన దరిమిలా వారిపై కేసు నమోదయ్యింది.2022, ఏప్రిల్ 21న ముగ్గురు వ్యక్తులు అథారే ఇంటిలోకి అక్రమంగా చొరబడి, వారి తల్లిపై దాడి చేసిన ఘటనపై ఆ సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిని నాన్-కాగ్నిజబుల్ (ముందస్తు కోర్టు అనుమతి లేకుండా పోలీసులు అరెస్టు చేయలేని నేరాలు) నేరంగా పోలీసులు నమోదు చేయడంపై అథారే సోదరులు అసంతృప్తితో పోలీసులను ప్రశ్నించారు. ఈ కేసులో ఇన్వెస్టిగేటింగ్ అధికారితో జరిగిన సంభాషణను వారు రికార్డ్ చేశారు. ఈ నేపధ్యంలో ఆ అధికారి వారితో ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బెదిరించారు.కాగా ఈ రికార్డింగ్‌ను వారు పోలీసు డైరెక్టర్ జనరల్‌కు పంపారు. ఈ నేపధ్యంలో ఆ సోదరులపై అధికారిక రహస్యాల చట్టం- 1923 ఉల్లంఘన కింద కేసు నమోదయ్యింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ ప్రతీకార చర్యలా ఉందని, కల్పిత సాక్ష్యాధారాల ఆధారంగా కేసు నమోదు చేశారని, అందుకే దానిని రద్దు చేయాలని ఆ సోదరుల తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. దీనిపై ప్రాసిక్యూషన్ తన వాదనలో వారు చేసిన రికార్డింగ్ పోలీసు సిబ్బందిని బెదిరించినట్లుగా ఉందని పేర్కొన్నారు.సెక్షన్ 2(8) కింద నిషేధించబడిన స్థలం అనే నిర్వచనంలో పోలీసు స్టేషన్ లేదని నొక్కి చెబుతూ, అధికారిక రహస్యాల చట్టం దీనికి వర్తించదని హైకోర్టు తెలిపింది. అలాగే ఈ ఉదంతంలో కుట్ర, నేరపూరిత బెదిరింపు ఆరోపణలకు సంబంధించి తదుపరి చర్యలకు సాక్ష్యాధారాలు అవసరమా కాదా అని నిర్ధారించే బాధ్యతను దిగువ కోర్టుకు అప్పగించింది. ఈ కేసులో అధికారిక రహస్యాల చట్టం కింద వచ్చిన ఆరోపణలను కోర్టు రద్దు చేసింది. అథారే సోదరుల తరఫున న్యాయవాది ఏజీ అంబేద్కర్ వాదనలు వినిపించగా, పోలీసు సిబ్బంది తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ఆర్ దయామ వాదనల్లో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మరణశిక్షను ఆపిన సుప్రీంకోర్టు -
‘తక్షణ న్యాయం’ ప్రమాదకరం
సర్వోన్నత న్యాయస్థానంతో సహా దేశంలో వివిధ హైకోర్టులు అడపా దడపా అక్షింతలు వేస్తున్నా ఎన్కౌంటర్ల జాడ్యం పోయేలా లేదు. ఏ పార్టీ ఏలుబడి ఉందన్నదాంతో నిమిత్తం లేకుండా దాదాపు అన్ని రాష్ట్రాల తీరూ ఇదే. కనీసం స్క్రిప్టు మార్చడానికి కూడా పోలీసులు ప్రయత్నించరు. ముద్దాయిని/ముద్దాయిలను నేరస్థలానికి తీసుకెళ్లినప్పుడో, న్యాయస్థానంలో హాజరు పరచడానికి వెళ్తున్నప్పుడో హఠాత్తుగా తిరుగుబాటు చేసి పోలీసుల నుంచి తుపాకి గుంజుకుని కాల్చబోవటం, ఈలోగా పోలీసులు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపడం వీటన్నిటి సారాంశం. పోలీసులకు స్వల్ప గాయాలు కావటం కూడా అన్నిచోట్లా డిటో. అక్షయ్ షిండే అనే నేరగాడిని మహారాష్ట్ర పోలీసులు హతమార్చిన తీరుపై బొంబాయి హైకోర్టు బుధవారం అనేక సందేహాలు వ్యక్తం చేసింది. వాహనంలో వెళ్తుండగా షిండే తిరగబడి పిస్తోల్ గుంజుకుని కాల్పులు జరిపే సమయంలో నలుగురు పోలీసులున్నా అతగాణ్ణి లొంగదీయలేకపోవటం ఏమిటని ప్రశ్నించింది. అసలు తుపాకులు, పిస్తోళ్లు ఉపయోగించటం తెలియని వ్యక్తి ఆయుధాన్ని అన్‌లాక్ చేసి కాల్పులు జరపటం ఎలా సాధ్యమని అడిగింది. ఈ ప్రశ్నలు సహేతుకమైనవి.బద్లాపూర్ స్కూల్ ఉదంతం ఘోరమైనది. గత నెల 13న ఒక పాఠశాలలోని మరుగుదొడ్డి వద్ద ఇద్దరు కిండర్‌గార్టెన్ పిల్లలపై నిందితుడు లైంగిక నేరానికి పాల్పడ్డాడని ఆరోపణ. ఘటనపై పిల్లల తల్లిదండ్రులకు తెలిసి ఫిర్యాదుచేస్తే ముద్దాయిని ఆగస్టు 17న అరెస్టు చేశారు. స్కూల్ యాజ మాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించాకగానీ ప్రిన్సిపాల్, సంస్థ చైర్మన్, కార్యదర్శిలపై పోక్సో కేసు పెట్టలేదు. ఆ స్కూల్ నిర్వహణ ఎంత ఘోరంగా ఉన్నదో చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అసలు ఆడపిల్లలు ఉపయోగించే మరుగుదొడ్డి వద్ద మహిళను నియమించాలని కూడా వారికి తోచలేదు. వీటన్నిటినీ తనిఖీ చేయాల్సిన విద్యాశాఖ పట్టించుకోలేదు. ఇంతమంది నిర్లక్ష్యం ఫలితంగా ఇద్దరు చిన్నారులు బాధితులుగా మారాక మాత్రం కఠిన చర్య తీసుకున్నట్టు కనబడటం కోసం వక్రమార్గం అనుసరించారు. స్కూల్ నిర్వాహకులు బీజేపీకి కావలసినవారు గనుకే ఎన్కౌంటర్ నాటకం ఆడారని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపణ. నిజానిజాల మాటెలా ఉన్నా ప్రభుత్వాధికారులు మెతగ్గా వ్యవహరించారన్నది మాత్రం వాస్తవం. గత రెండు నెలల్లో మూడు ఎన్కౌంటర్లు జరిపి తమిళనాడు పోలీసులు ముగ్గురు నిందితులను హతమార్చారు. మావోయిస్టుల ప్రభావం అధికంగావున్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్లు జరగకపోతే వార్త. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ఎన్కౌంటర్ల జోరు అధికమే. గత ఏడున్న రేళ్లలో యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 49 మందిని కాల్చిచంపారు. గత సోమవారమే మరొకరిని హతమార్చి అర్ధ సెంచరీ పూర్తి చేశారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఎన్కౌంటర్ మృతులంతా అమాయకులనీ, సచ్ఛీలురనీ ఎవరూ అనరు. ఎన్నో ఆరోపణలున్నవారే. కానీ నేర గాళ్లను శిక్షించటానికి ఒక విధానం ఏర్పర్చుకున్నప్పుడూ, దానికి అనుగుణంగా భిన్న వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడూ ఇష్టారాజ్యంగా కాల్చిచంపే అధికారం పోలీసులకెక్కడిది? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇలాంటి కేసులను విచారించినప్పుడల్లా న్యాయస్థానాలు నిశితంగా ప్రశ్నిస్తున్నాయి. కానీ ఎక్కడా ఇవి ఆగుతున్న దాఖలాలు లేవు. 2006లో ఇద్దరు నిందితులను నవీ ముంబైలో పట్టుకుని వారిలో ఒకరిని ఎన్కౌంటర్ చేసిన కేసులో 12 మంది పోలీసులకు కిందికోర్టు విధించిన యావజ్జీవ శిక్షను బొంబాయి హైకోర్టు ధ్రువీకరించటంతోపాటు కింది కోర్టు నిర్దోషిగా విడిచిపెట్టిన ‘ఎన్కౌంటర్ స్పెషలిస్టు’ ప్రదీప్ శర్మకు కూడా యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. న్యాయవాది అయిన ఎన్కౌంటర్ మృతుడి సోదరుడు అతను అరెస్టయ్యాక ఉన్నతాధికారులకూ, న్యాయస్థానానికీ టెలిగ్రామ్‌లు, ఫ్యాక్స్ మెసేజ్‌లు పంపటం, కాల్ రికార్డులు సేకరించటం పర్యవసానంగా ఇదంతా సాధ్యమైంది. కానీ ఎన్ని కేసుల్లో ఎందరు ఇలా చేయగలుగుతారు?ఎన్కౌంటర్లను వ్యతిరేకించే పౌరహక్కుల సంఘాల నేతలనూ, పౌర సమాజ కార్యకర్తలనూ నేరగాళ్లకు వత్తాసు పలుకుతున్నవారిగా ముద్రేయటం పాలకులకూ, పోలీసులకూ అలవాటు. కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్లు సాగిస్తున్న పోలీసులను సమాజంలోని భిన్నవర్గాలవారు ప్రశంసించటం కూడా కనబడుతుంది. ‘తక్షణ న్యాయం’ కోరేవారికి ఇది సబబే అనిపించవచ్చు. కానీ ఈ క్రమంలో ప్రభుత్వాల బాధ్యతనూ, జవాబుదారీతనాన్నీ ఉపేక్షించటం లేదా? అసలు పోలీసు కాల్పుల్లో మరణించినవారే నిజమైన దోషులని ఏ ప్రాతిపదికన నమ్మాలి? ఈ ధోరణివల్ల అసలు దోషులు తప్పించుకునే ప్రమాదంతోపాటు మరిన్ని నేరాలు జరగటానికి ఆస్కారం ఉండదా? కోల్ కతాలోని పీజీ కర్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఉదంతమే తీసుకుంటే సక్రమంగా దర్యాప్తు జరిగింది గనుకే మాఫియాల ఆధిపత్యం, వారి అండతో ఆసుపత్రి ఉన్నతాధి కారులు సాగిస్తున్న తప్పుడు పనులు బయటపడ్డాయి. నేరాలకు తావులేని వాతావరణం ఏర్పర్చటానికీ, వాటి నియంత్రణకు దోహదపడే చర్యలకూ బదులు నేరగాళ్లను హతమార్చే విధానం సమాజాన్ని బండబారుస్తుంది. అధికారులకు తాము ఏం చేసినా అడిగేవారు లేరన్న భరోసానిస్తుంది. కఠినమైన చట్టాలు, పకడ్బందీ దర్యాప్తు, న్యాయస్థానాల్లో చురుగ్గా విచారణ వంటివి మాత్రమే సమాజ భద్రతకు తోడ్పడతాయి. అది మరిచి ‘తక్షణ న్యాయం’ కోసం వెంపర్లాడటం సరికాదు. -
Emergency: కంగనాకు బాంబే హైకోర్టు షాక్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ) సినిమాకు ఎదురుదెబ్బ తగలింది. ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)ని ఆదేశించలేమని బాంబే హైకోర్టు బుధవారం వెల్లడించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని బీపీ కొలబవాలా, ఫిర్దౌస్ పూనావాలాతో కూడిన బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎమర్జెన్సీ చిత్ర సహ నిర్మాత జీ స్టూడియోస్ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారనను 19వ తేదీకి వాయిదా వేసింది.కాగా ఎమర్జెన్సీ చిత్రం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత కాలం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం. ముఖ్యంగా 1975లో ఆమె విధంచిన ఎమర్జెన్సీ కాలాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో కంగనా నటించడమే కాకుండా, దర్శకత్వం, నిర్మతగానూ వ్యవహరించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలోకి రానుంది. అయితే సినిమాను వ్యతిరేకిస్తూ అనేక సిక్కు సంస్థలు ఆందోళనలు చేయడంతో వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎమర్జెన్సీ విడుదలను నిలిపివేయాలంటూ సిక్కు సంస్థలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సిక్క సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి వ్యతిరేకంగా జబల్పూర్ హైకోర్టులో(మధ్యప్రదేశ్) పిటిషన్ దాఖలు చేసి, దాని ప్రదర్శనపై నిషేధం విధించాలని కోరారు. దానిని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. ‘ఎమర్జెన్సీ’ని విడుదల చేయాలని, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కంగనా, చిత్ర సహ నిర్మాణ సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. . ఈ క్రమంలోనే తాజాగా తీర్పు వెలువడింది. -
అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు తప్పొప్పులు నేర్పించాలి: బాంబే హైకోర్టు
ముంబై: బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధంపుల కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అబ్బాయిలకు చిన్నతనం నుంచే వారి ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకురావాలని తెలిపింది. అమ్మాయిలను, మహిళలను గౌరవించడం నేర్పంచాలని సూచించింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని.. అందుకే మగపిల్లలకు చిన్నప్పటి నుంచే చెడు ప్రవర్తనపై అవగాహన కల్పించాలని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథివీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది.ద్లాపూర్లోని తమ పాఠశాలలో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుపై సుమోటోగా స్వీకరించిన బాంబే హైకోర్టు..తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. బాలురకు లింగ సమానత్వం, సున్నితత్వం గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని, పిల్లలకు సమానత్వం గురించి బోధించే వరకు ఏదీ మారదని పేర్కొంది.‘సమాజంలో పురుషాధిక్యత ఇప్పటికీ ఉన్నాయి. మన ఇంట్లో పిల్లలకు సమానత్వం గురించి చెప్పేంత వరకు ఏమీ జరగదు. అప్పటి వరకు నిర్భయ వంటి చట్టాలన్నీ పని చేయవు. మనంం ఎప్పుడూ అమ్మాయిల గురించే మాట్లాడుతుంటాం. అబ్బాయిలకు ఏది ఒప్పు, తప్పు అని ఎందుకు చెప్పకూడదు? అబ్బాయిల ఆలోచనా ధోరణిని చిన్నతనంలోనే మార్చాలి. మహిళలను గౌరవించడం నేర్పించాలి’ అని పేర్కొంది.కాగా గత వారం బద్లాపూర్‌లో కిండర్ గార్టెన్ విద్యార్థినులపై పాఠశాల అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. రిటైర్డ్ పోలీసు, రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ అధ్యాపకుడు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. పాఠశాలల్లో ఈ ఘటనలను ఎలా అరికట్టాలనే దానిపై కమిటీ సిఫారసులతో ముందుకు రావలని తెలిపింది. -
పతంజలికి రూ.4 కోట్లు జరిమానా: బాంబే హైకోర్టు
పతంజలి సంస్థకు బాంబే హైకోర్టు సోమవారం రూ.4 కోట్ల జరిమానా విధించింది. మంగళం ఆర్గానిక్స్ లిమిటెడ్ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసుకు సంబంధించి.. కంపెనీ కర్పూరం ఉత్పత్తులను విక్రయించకుండా నిషేధిస్తూ 2023 నాటి మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కోర్టు ఈ జరిమానా విధించింది.పతంజలి కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని జస్టిస్ ఆర్ఐ చాగ్లా బెంచ్ పేర్కొంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే ఉద్దేశం పతంజలికి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని ధర్మాసనం పేర్కొంది. కోర్టు గతంలో ఆదేశించినప్పటికీ కంపెనీ ఉత్పత్తి విక్రయాలు, తయారీని కొనసాగించడాన్ని గమనించిన బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.పతంజలి కంపెనీ మునుపటి డైరెక్టర్‌కు న్యాయవాది జల్ అంధ్యారుజిన కోర్టు ఆదేశాలను తెలియజేసినప్పటికీ.. ఆయన అనుసరించలేదని ప్రస్తుత డైరెక్టర్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు.. పాత డైరెక్టర్ తరపున ప్రస్తుత డైరెక్టర్ క్షమాపణలు చెప్పారు. అయితే జస్టిస్ చాగ్లా పతంజలికి రూ. 4 కోట్లు జరిమానా విధించింది. -
హిజాబ్ బ్యాన్.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ కళాశాల యాజమాన్యం తీసుకున్న హిజాబ్ నిషేధ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ నిషేధిస్తూ కాలేజీ యాజమన్యం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తొమ్మిది మంది విద్యార్థినులు వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఏఎస్ చందుర్కర్, జస్టిస్ రాజేష్ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం (జూన్26) విచారించింది. కాలేజీ నిర్ణయం రాజ్యాంగం తమకు ఇచ్చిన ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తోందని విద్యార్థినులు పిటిషన్లో పేర్కొన్నారు. అయితే కాలేజీ యాజమాన్యం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ డివిజన్ బెంచ్ పిటిషన్‌ను కొట్టివేసింది.చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని ఎన్జీ ఆచార్య, డీకే మరాఠే కళాశాలల్లో విద్యార్థినులు హిజాబ్, నఖాబ్, బుర్ఖా, క్యాపులు, బ్యాడ్జీలు ధరించడానికి వీల్లేదని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. తాము ఏ మతానికి వ్యతిరేకంగా ఎలాంటి డ్రెస్ కోడ్ పెట్టలేదని, కేవలం యూనిఫాం వేసుకుని విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కాలేజీ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. -
బాంబే హైకోర్టు షాక్.. జైలుకు చంద్రబాబు?
-
చంద్రబాబుకు బాంబే హైకోర్టు షాక్
ముంబయి: టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.. 2010 జూలైలో మహారాష్ట్రలో పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టేయాలని చంద్రబాబు, టీడీపీ నేత నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ తోసిపుచ్చింది.. ఈ మేరకు న్యాయమూర్తులు మంగేష్ పాటిల్, శైలేష్ బ్రహ్మేలతో కూడిన డివిజన్ బెంచ్ మే 10న తీర్పు వెలువరించింది.పోలీసులతో చంద్రబాబు, నక్కా ఆనంద్ బాబు అనుచితంగా వ్యవహరించారనడానికి ఆధారాలున్నాయని పేర్కొంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పోలీసులు తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లను హైకోర్టు బెంచ్ కొట్టేసింది. పోలీసులపై చంద్రబాబు దాడి ప్రభుత్వోద్యోగిపై దాడి చేయడం, ప్రమాదకరమైన ఆయుధాలతో హాని కలిగించడం, ప్రాణాలకు హాని కలిగించే చర్యలు, శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో పోలీసులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం వంటి వాటిపై చంద్రబాబు, నక్కా ఆనంద్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ మొదటి నిందితుడైన చంద్రబాబు పోలీసులపై దాడికి తన అనుచరులను ప్రోత్సహించారని పేర్కొంది.మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించారని వెల్లడించింది. సాక్షులు సైతం పోలీసులపై దాడిలో చంద్రబాబు, నక్కా ఆనంద్‌బాబుల పాత్ర ఉందని తెలిపారని ధర్మాసనం గుర్తు చేసింది. ఆ ఘటనలో అనేకమంది పోలీసు అధికారులు గాయపడినట్లు మెడికల్ సరి్టఫికెట్లు కూడా ధ్రువీకరిస్తున్నాయని పేర్కొంది. పోలీసు సిబ్బందిపై దాడి చేయాలనే ఈ నేరం చేసినట్లు తెలుస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు ఇదీ.. 2010 జూలైలో చంద్రబాబు, ఆనంద్ బాబు తదితరులను కలిపి మొత్తం 66 మందిని రిమాండ్‌కు తరలించి ధర్మాబాద్‌లోని ప్రభుత్వ విశ్రాంతి గృహంలోని తాత్కాలిక జైలులో ఉంచారు. వారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడంతో మహారాష్ట్ర జైళ్ల డీఐజీ వారిని ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే, చంద్రబాబు, ఆనంద్ బాబు దీన్ని అడ్డుకోవడంతోపాటు తెలుగు, ఇంగ్లి‹Ùలో పోలీసు అధికారులను దూషించారు.అంతేకాకుండా బస్సు ఎక్కడానికి నిరాకరించడంతోపాటు పోలీసులపై దాడి చేశారు. దీంతో అదనపు బలగాలను రప్పించి చంద్రబాబు, ఆనంద్ బాబు తదితరులను ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తమపై దాఖలైన కేసును కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం రద్దు చేసింది. అయితే చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూద్రా విన్నపం మేరకు గతంలో వారికిచి్చన మధ్యంతర రక్షణను జూలై 8 వరకు పొడిగించింది.నిబంధనల ప్రకారమే కేసులు: ధర్మాసనం అంతకుముందు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ ఆందోళనలు, నిరసనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను పోలీసులు ఉపసంహరించుకున్నారని, ఆ కేసులో నిందితులందరినీ మేజి్రస్టేట్ వెంటనే విడుదల చేశారన్నారు. అయితే, దాడి కేసులో పోలీసులు చంద్రబాబును, నక్కా ఆనంద్ బాబును ఇరికించారని ఆరోపించారు. జైళ్ల చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్లు నమోదు చేసే అధికారం జైళ్ల సూపరింటెండెంట్‌కు మాత్రమే ఉందన్నారు.ప్రస్తుత కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీనియర్ జైలర్ అని, ఆయనకు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం లేదని లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కోర్టు ఈ వాదనలను తిరస్కరించింది. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధనల ప్రకారమే కేసులు నమోదు చేశారని స్పష్టం చేసింది. జైలు ప్రాంగణంలో నేరాలకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి జైళ్ల చట్టం ఎలాంటి యంత్రాంగాన్ని లేదా విధానాన్ని నిర్దేశించలేదని ధర్మాసనం పేర్కొంది. -
పెంపుడు కుక్క కోసం కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హీరోయిన్
చాలామంది సెలబ్రిటీల దగ్గర పెట్ డాగ్స్ ఉంటాయి. వాటిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. సొంత పిల్లల్లా చూసుకుంటూ ఉంటారు. బాలీవుడ్ నటి ఆయేషా జుల్క దగ్గర కూడా అలానే శునకాలు ఉన్నాయి. అందులో ఓ శునకాన్ని అన్యాయంగా చంపేశారని ఈమె ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది. ఇంతకీ అసలేం జరిగింది? ఈ కేసు సంగతేంటి? (ఇదీ చదవండి: హీరోయిన్ దివ్య భారతి చనిపోవడానికి కారణమదే.. హీరో షాకింగ్ కామెంట్స్) హిందీతో పాటు కన్నడ, తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి ఆయేషా జుల్కా. ఈమె టాలీవుడ్ లోనూ 'నేటి సిద్ధార్థ', 'జై' చిత్రాల్లో నటించింది. ఇకపోతే ఈ నటి.. వీధి కుక్కల్ని సంరక్షిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాటిని పెంచుకుంటూ ఉంటుంది. అలా రాఖీ అనే శునకాన్ని ఇంటికి తెచ్చుకుంది. అయితే 2020 సెప్టెంబరులో ఇది అనుమానస్పద రీతిలో చనిపోయింది. అయితే దీని చావుకి కారణం తమ కేర్ టేకర్ రామ్ ఆండ్రే అని అతడిపై పోలీస్ కేసు పెట్టింది. దీంతో 2021లో ఛార్జ్ షీట్ నమోదు చేసిన పోలీసులు.. ఆయేషా ఇంట్లో పని చేసే రామ్ ఆండ్రేని అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత అతడు బెయిల్ పై బయటకొచ్చేశాడు. అప్పటి నుంచి ఈ కేసు అలానే ఉండిపోయింది. తాజాగా ఈ విషయమై బొంబే హైకోర్టు మెట్లెక్కిన ఆయేషా.. తన సత్వరమే న్యాయం చేయాలని కోరింది. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. (ఇదీ చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి) -
‘ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్’పై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఆధ్వర్యంలో ఫ్యాక్ట్–చెకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణకు సంబంధించిన అంశమని వెల్లడించింది. ప్రభుత్వంపై మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను, ఆన్లైన్లో నకిలీ కంటెంట్‌ను గుర్తించడానికి ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021లో సవరణలు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఇండియాతోపాటు పలువురు బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ఫ్యాక్ట్–చెకింగ్ యూనిట్ ఏర్పాటుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ మార్చి 11న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. మార్చి 11 నాటి బాంబే హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. -
ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషిన్‌ను భారత అత్యున్నత తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పు చాలా హేతుబద్ధంగా ఉన్నట్లు తాము ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపింది. తీర్పును వెనక్కి తీసుకోవడంలో ఎటువంటి తొందరపాటు ఉండకూడదని, అది వేరేలా ఉంటే పరిగణనలోకి తీసుకునేవాళ్లమని పేర్కొంది. ఇది నిర్దోషిత్వం రుజువు చేసుకోవడానికి ఎంతో కష్టపడిన కేసు అని.. సాధారణంగా ఇటువంటి అప్పీల్‌ను ఈ న్యాయస్థానం గతంలోనే కొట్టివేసి ఉండాల్సిందని జస్టిస్‌లు మెహతా, గవాయిలు పేర్కొన్నారు. చదవండి: మిషన్ దివ్యాస్త్ర విజయవంతం.. అభినందించిన ప్రధాని మోదీ కాగా 90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబా.. మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయనతో పాటు మరో ఐదుగురికి మహారాష్ట్ర, గడ్చిరోలి ట్రయిల్ కోర్టు జీవిత ఖైదు విధించడంతో 2017 నుంచి నాగ్‌పూర్ జైలులోనే ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన 2014 నుంచి 2016 వరకు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు. సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపినబాంబే హైకోర్టు 2022 అక్టోబరులోనే సాయిబాబాతోపాటు అయిదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. వెంటనే జైలు నుంచి విడుదలకు ఆదేశించింది. ఈ తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిందితుల విడుదలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు తీర్పును 2023 ఏప్రిల్‌లో పక్కనపెట్టింది. నిందితుల అప్పీళ్లపై మళ్లీ మొదట్నుంచీ విచారణ జరపాలని ఆదేశించడంతో మళ్లీ విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ మార్చి 5న తీర్పు వెలువరించింది. దీంతో ప్రొఫెసర్ సాయిబాబా విడుదలయ్యారు. -
ప్రాణాలతో బయటపడడం అద్భుతమే
నాగపూర్: జైలు నుంచి ప్రాణాలతో బయటపడతానని ఏనాడూ అనుకోలేదని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా(54) చెప్పారు. సజీవంగా బయటకు రావడం నిజంగా అద్భుతమేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. జైలులో శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు అనుభవించానని చెప్పారు. అక్కడ జీవితం అత్యంత దుర్భరమని పేర్కొన్నారు. మావోలతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా గుర్తిస్తూ మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆయన గురువారం నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి చక్రాల కురీ్చలో బయటకు వచ్చారు. ఈశాన్య భారతదేశంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారని సాయిబాబా అన్నారు. జైలులోనే ప్రాణాలు పోతాయనుకున్నా.. ‘‘నా ఆరోగ్యం క్షీణించింది. ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. మొదట చికిత్స తీసుకోవాలి. ఆ తర్వాతే మాట్లాడగలను. త్వరలో డాక్టర్లను కలిసి చికిత్స తీసుకుంటా. విలేకరు లు, లాయర్లు కోరడం వల్లే ఇప్పుడు స్పందిస్తున్నా. జైలులో నాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. అత్యంత కఠినమైన, దుర్భర జీవితం అనువించా. చక్రాల కుర్చీ నుంచి పైకి లేవలేకపోయా. ఇతరుల సాయం లేకుండా సొంతంగా టాయిలెట్‌కు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇతరుల సాయం లేనిదే స్నానం కూడా చేయలేపోయా. జైలులోనే నా ప్రాణాలు పోతాయని అనుకున్నా. ఈరోజు నేను ఇలా ప్రాణాలతో జైలు నుంచి బయటకు రావడం అద్భుతమే చెప్పాలి. నాపై నమోదైన కేసులో సాక్ష్యాధారాలు లేవని ఉన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. చట్టప్రకారం ఈ కేసు చెల్లదని స్పష్టం చేసింది. నాకు న్యాయం చేకూర్చడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? నాతోపాటు నా సహచర నిందితులు పదేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయారు. ఈ జీవితాన్ని ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇస్తారు? జైలుకు వెళ్లినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. అప్పుడు పోలియో మినహా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కానీ, ఇప్పుడు గుండె, కండరాలు, కాలేయ సంబంధిత వ్యాధుల బారినపడ్డాను. నా గుండె ప్రస్తుతం కేవలం 55 శాతం సామర్థ్యంతో పనిచేస్తోంది. డాక్టర్లే ఈ విషయం చెప్పారు. నాకు పలు ఆపరేషన్లు, సర్జరీలు చేయాలని అన్నారు. కానీ, ఒక్కటి కూడా జరగలేదు. జైలులో సరైన వైద్యం అందించలేదు. పదేళ్లపాటు నాకు అన్యా యం జరిగింది. ఆశ ఒక్కటే నన్ను బతికించింది. ఇకపై బోధనా వృత్తిని కొనసాగిస్తా. బోధించకుండా నేను ఉండలేను’’ అని ప్రొఫెసర్ సాయిబాబా స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా, భారత రాజ్యాంగాన్ని 50 శాతం అమలు చేసినా సరే సమాజంలో అనుకున్న మార్పు వస్తుందని బదులిచ్చారు. సాయిబాబా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణం సమీపంలోని జనుపల్లె. ఆయన పాఠశాల, కళాశాల విద్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కొనసాగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించిన ఆయన అక్కడే ప్రొఫెసర్ అయ్యారు. -
ఆలస్యంగా దక్కిన న్యాయం
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టయిన ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా పదేళ్ల సుదీర్ఘ కారాగారవాసం నుంచి గురువారం నిర్దోషిగా విడుదలయ్యారు. ఇదే అభియోగాలతో ఆయనతోపాటు అరెస్టయిన మరో అయిదుగురికి కూడా విముక్తి లభించింది. ఒకరు విచారణ సమ యంలో మరణించారు. అభియోగాలను రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చెబు తూనే, అసలు తగిన అనుమతులు లేకుండా సాగించిన ఈ కేసు చెల్లుబాటు కాదని బొంబాయి హైకోర్టు నాగపూర్ ధర్మాసనం వ్యాఖ్యానించటం మన నేర న్యాయవ్యవస్థ పనితీరును పట్టిచూపుతోంది. యూఏపీఏ కింద ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించాలంటే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిందితులపై పకడ్బందీ సాక్ష్యాధారాలున్నాయని వారు విశ్వసించాకే ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలి. కానీ ఈ కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను 2014లో అరెస్టు చేయగా ఏడాది తర్వాతగానీ అనుమతులు రాలేదు. ఇతర నిందితులు వాస్తవానికి 2013లోనే అరెస్టయ్యారు. ఈ సంగతి పట్టని మహారాష్ట్రలోని గఢ్చిరోలి సెషన్స్ కోర్టు కేసును పరిగణనలోకి తీసుకుని ఈలోగా ఒక సాక్షిని కూడా విచారించింది! చివరకు 2017లో వీరిని దోషులుగా పేర్కొంటూ యావజ్జీవ శిక్ష విధించింది. అటు ప్రభుత్వ యంత్రాంగం సరే... ఇటు న్యాయవ్యవస్థ సైతం ఇంత యాంత్రికంగా పనిచేయటం సరైందేనా? బొంబాయి హైకోర్టు 2022లో ఈ అవక తవకలను గుర్తించి కేసు కొట్టేసింది. కానీ ఆ వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర అప్పీల్‌ను స్వీకరించి బొంబాయి హైకోర్టు తీర్పును నిలుపుదల చేయటం, తిరిగి దీన్ని విచారించాలంటూ ఆదేశాలు జారీచేయటంవల్ల సాయిబాబా తదితరులకు స్వేచ్ఛ లభించటానికి మరికొన్ని నెలలు పట్టింది. ఇలా కనీస సాక్ష్యాధారాలు కొరవడిన, ముందస్తు అనుమతులు తీసుకోని కేసులో నింది తులను పదేళ్లపాటు జైలు గోడలమధ్య బంధించి వుంచారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది వ్యవస్థల సమష్టి వైఫల్యం కాదా? ఇందుకు జవాబుదారీతనం వహించాల్సిందెవరు? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ఈయూ కమిషన్, అమెరికన్ కాంగ్రెస్, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభా గంలో ఈ కేసు ప్రస్తావనకొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని వివిధ సంస్థల వరకూ అందరికందరూ ఇది అన్యాయంగా బనాయించిన కేసు అనీ, వెంటనే ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేస్తూ వచ్చారు. టీఆర్ఎస్ సభ్యుడు కె. కేశవరావు 2015లో జీరో అవర్‌లో దీన్ని రాజ్య సభలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ కూడా రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కనీసం కేసు తేలేవరకూ నిందితులను బెయిల్‌పై విడుదల చేసివుంటే కొంతలో కొంతైనా న్యాయం చేసినట్టయ్యేది. బెయిల్ అనేది హక్కు, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జైలుకు పంపాలన్నది మౌలిక న్యాయసూత్రం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈమధ్యకాలంలో కూడా పదే పదే ఈ సంగతిని గుర్తుచేస్తున్నారు. అయినా ఆచరణకొచ్చేసరికి జరిగేది వేరుగా వుంటోంది. నిందితులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపట్ల విరోధభావాన్ని వ్యాప్తిచేసేందుకు కుట్రపన్నారని తెలిపింది. ఆ విషయంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర పత్రాలువంటి సాక్ష్యాధారాలు అత్యంత బలహీనమైన వని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా వెబ్సైట్ నుంచి వీడియోలు, ఇతర సమాచారం డౌన్లోడ్ చేసుకోవటం దానికదే నేరమెలా అవుతుందన్నది ధర్మాసనం సందేహం. ఫలానా ఉగ్ర వాద చర్యకూ, దానికీ సంబంధం వున్నదని నిరూపిస్తే తప్ప ఆ సాక్ష్యానికి ఎలాంటి విలువా వుండ దని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ సాయిబాబా అభిప్రాయాలు ఎవరికీ తెలియ నివి కాదు. ఆయన వృత్తిరీత్యా ఇంగ్లిష్ అధ్యాపకుడు. కవి, రచయిత కూడా. ఆదివాసీ ప్రాంతాల్లో సహజవనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రచనలు చేశారు. అరెస్టయిన సమయానికి విప్లవ ప్రజాస్వామిక వేదిక (ఆర్డీఎఫ్) బాధ్యుడు. ఆయన హింసాత్మక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే, విధ్వంసానికి పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ 90 శాతం అంగవైకల్యం వున్న సాయిబాబా మరొకరి సాయం లేనిదే తన పని తాను చేసుకోవటం కూడా అసాధ్యం. బయటకు వెళ్లాలంటే చక్రాల కుర్చీ తప్పనిసరి. అటు వంటి వ్యక్తిని ఉగ్రవాదిగా జమకట్టడం సబబేనా? కేవలం అసమ్మతిని వ్యక్తం చేయటమే ఒక మనిషిని పదేళ్లపాటు జైల్లోకి నెట్టడానికి కారణం కావటం మనం నమ్మే ప్రజాస్వామిక విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉగ్రవాద చర్యలు సమాజ క్షేమానికి ముప్పుగా పరిణమిస్తాయనటంలో సందేహం లేదు. అటువంటివారిని అదుపు చేయాలంటే యూఏపీఏ వంటి కఠిన చట్టాల అవసరం వుందని ప్రభుత్వాలు భావిస్తే తప్పుబట్టనవసరం లేదు. కానీ మన రాజ్యాంగమే అనుమతించిన సహేతుకమైన అసమ్మతిపై లేనిపోని ముద్రలేసి దాన్ని తుంచివేయాలనుకోవటం, భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవటం ఏరకంగా చూసినా సబబు కాదు. ఇప్పుడు సాయిబాబా కోల్పోయిన విలువైన పదేళ్ల కాలాన్ని ప్రభుత్వం వెనక్కివ్వలేదు. కనీసం ఉద్యోగమైనా చేసుకోనివ్వాలి. ఇతర క్రిమినల్ కేసుల మాట అటుంచి యూఏపీఏ వంటి దారుణ చట్టాలకింద అరెస్టయి నిర్దోషులుగా తేలినవారికైనా తగిన పరిహారం చెల్లిస్తే కాస్తయినా ఉపశమనం ఇచ్చినట్టవుతుంది. పాలకులు ఆలోచించాలి. -
ప్రొఫెసర్ సాయిబాబా కేసు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
నాగ్‌పూర్: మావోయిస్టులతో లింకు ఉందన్న కేసులో జీవిత ఖైదు పడిన ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. ఈ మేరకు బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్ధోషులుగా పేర్కొంటూ మంగళవారం తీర్పిచ్చింది. తమకు ఈ కేసులో జీవిత ఖైదు విధిస్తూ గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సాయిబాబాతో పాటు మరో ఐదుగురు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌ను విచారించిన హైకోర్టు కింది కోర్టు తీర్పును కొట్టివేసింది. దీంతో మావోయిస్టులతో సంబంధాల కేసులో సాయిబాబాతో పాటు శిక్షపడిన మరో ఐదుగురు జైలు నుంచి విడుదలవనున్నారు. కేసు వివరాలు ఇలా.. మావోయిస్టులతో లింకు ఉందన్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు 2014లో ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌లాల్‌ఆనంద్ కాలేజీ ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేశారు. ఐపీసీతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)సెక్షన్ల కింద ఆయనపై ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. 2017 వరకు ఈ కేసు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన తర్వాత ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తొలగించింది. సెషన్స్‌కోర్టు ఇచ్చిన జీవితఖైదు తీర్పుపై సాయిబాబా అప్పీల్‌కు వెళ్లగా యూఏపీఏ కేసులో ప్రొసీజర్‌ను పోలీసులు సరిగా పాటించలేదన్నా కారణంగా బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా అత్యున్నత కోర్టు సాయిబాబా విడుదలపై స్టే ఇచ్చింది. కేసును తిరిగి వినాలని బాంబే హైకోర్టుకే రిఫర్ చేసింది. దీంతో తాజాగా అప్పీల్ విచారించిన బాంబే హైకోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్ధోషులుగా విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. ఇదీ చదవండి.. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు -
చందా కొచ్చర్ అరెస్టుపై.. సీబీఐకి కోర్టు మొట్టికాయలు!
ముంబై: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)పై బాంబే హైకోర్టు మెట్టికాయలు వేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అరెస్ట్ అంశంలో సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్, జస్టిస్ ఎన్. ఆర్.బోర్కర్ డివిజన్ బెంచ్ 2024 ఫిబ్రవరి 6న కొచ్చర్ దంపతుల అరెస్టును చట్టవిరుద్ధమని పేర్కొంది. జనవరి 2023లో మరొక బెంచ్ వారికి బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వును ధృవీకరించింది. కోర్టు జారీ చేసిన సంబంధిత ఉత్తర్వుల్లో.. కొచ్చర్ దంపతులను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అందుకు తగ్గ ఆదారాల్ని చూపించలేకపోయారని, కాబట్టే సీబీఐ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని భావిస్తున్నట్లు అనూజా ప్రభుదేశాయ్, ఎన్ఆర్ బోర్కర్ల ధర్మాసనం తెలిపినట్లు వెలుగులోకి వచ్చిన కోర్టు ఉత్తర్వులు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార దుర్వినియోగం తగదు ‘చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇటువంటి సాధారణ అరెస్టులు అధికార దుర్వినియోగానికి సమానం’ అని కోర్టు పేర్కొంది. కానీ కొచ్చర్ దంపతులు విచారణకు సహకరించనందున అరెస్ట్ చేశామని సీబీఐ కోర్టుకు విన్నవించుకుంది. అయితే, విచారణ సమయంలో మౌనంగా ఉండే హక్కు నిందితులకు ఉందని.. సీబీఐ వాదనను అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. కాగా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ప్రకారం ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్భంధం చేయకూడదు. విచారణ చేస్తున్న సమయంలో అలా చేస్తున్నట్ల మౌనంగా ఉండే హక్కును కల్పిస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. -
చందా కొచ్చర్ దంపతులకు భారీ ఊరట!
ఐసీఐసీఐ బ్యాంక్ - వీడియో కాన్ లోన్ కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ దంపతులకు భారీ ఊరట లభించింది. చందా కొచ్చర్ దంపతులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ సబబేనని స్పష్టం చేసింది. రుణాల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తమని అక్రమంగా అరెస్ట్ చేసిందని, తమకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చార్‌లు కోర్టు మెట్లెక్కారు. విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ మధ్యంతర బెయిల్‌ను జారీ చేసింది. తాజాగా, మధ్యంతర బెయిల్‌పై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బాంబే హైకోర్టు న్యాయమూర్తులు అనూజా ప్రభుదేశాయ్,ఎన్ఆర్ బోర్కర్లతో కూడిన ధర్మాసనం.. ‘చందా కొచ్చర్ దంపతులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఆర్డర్‌ను ధృవీకరించాం’ అని తెలిపారు. అంతేకాదు, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సీబీఐ అరెస్ట్ చేయడం అక్రమమని బాంబే హైకోర్టు పేర్కొంది. 2023 జనవరి 9న కొచ్చర్ దంపతులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ సబబేనని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ విధానాలను ఉల్లంఘించి వీడియోకాన్ సంస్థకు రుణాలు ఇచ్చారన్న కేసులో కొచ్చర్ దంపతులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. నేరం అంగీకరించకపోవడమంటే విచారణకు సహకరించడం లేదని అర్థం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కొచ్చర్ దంపతులకు బాంబే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. 2022లో అరెస్ట్ వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంకు రుణం కేసుకు సంబంధించి చందా కొచ్చర్ దంపతులను 2022 డిసెంబర్ 23న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కొచ్చర్తో పాటు వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌ను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. చందా కొచ్చర్ దంపతులతో పాటు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు, బ్యాంక్ క్రెడిట్ పాలసీలను ఉల్లంఘించి ధూత్ ప్రమోట్ చేసిన వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల క్రెడిట్ మంజూరు చేసిందని సీబీఐ ఆరోపించింది. నేరపూరిత కుట్రకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద 2019లో నమోదైన ఎఫ్ఐఆర్లో వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తోపాటు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఐసీఐసీ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆయన భర్త దీపక్ కొచ్చర్లను సీబీఐ నిందితులుగా చేర్చింది. -
మహారాష్ట్ర స్పీకర్‌కు బాంబే హైకోర్టు నోటీసులు
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాను పెట్టుకున్న పిటిషన్లను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కొట్టేయడాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం నేత, చీఫ్ విప్ భరత్ గోగావాలే బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ విషయంలో మీ స్పందన తెలపాలంటూ స్పీకర్, 14 మంది ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు పంపింది. అసెంబ్లీ సచివాలయానికీ కోర్టు నోటీసులిచి్చంది. నోటీసులు అందుకున్న వారు తమ స్పందనను అఫిడవిట్ల రూపంలో సమరి్పంచాలని కోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదో 8కి వాయిదావేసింది. -
అది ప్రేమే..కామం కాదు: పోక్సో కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ముంబై: పోక్సో కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. యువకుడు, మైనర్ రిలేషన్లో ఉన్నారని, వారి మధ్య ఏర్పడిన లైంగిక సంబంధం ప్రేమ కారణంగా కలిగినదే తప్ప.. కామం వల్ల కాదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఊర్మిళ జోషి పార్కే తీర్పు వెల్లడించింది. ‘బాలిక మైనర్యే కావచ్చు. కానీ ఆమె తన ఇష్టం మేరకే ఇంటిని వదిలి నిందితుడు నితిన్ ధబేరావుతో కలిసి ఉంటున్నట్లు పోలీసులతో చెప్పింది. ధబేరావు వయసు కూడా 26 ఏళ్లు. వారి ఇద్దరు ప్రేమ వ్యవహారం కారణంగానే కలిసి ఉండాలని అనుకున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం వల్లే లైంగికంగా ఒకటయ్యారు. అంతేగానీ నిందితుడు ఆమెను కామంతో లైంగిక వేధింపులకు గురిచేయలేదు. ఆమెపై బలవంతంగా జరిగిన దాడి కాదు’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి ఆంక్షలతో కూడి బెయిల్ మంజూరు చేసింది. కాగా 13 ఏళ్ల మైనర్ తన ఇంటి పక్కన నివసించే నితిన్ దామోదర్ ధబేరావ్ను ప్రేమించింది. 2020 ఆగస్టులో అతనితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కొన్ని రోజులు ఇద్దరు ఒకచోట నివసించారు. బాలిక తండ్రి కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వెతికి పట్టుకున్నారు. 2020 ఆగస్టు 30న దామోదర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. అక్టోబర్‌లో అతనిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ధబేరావ్తో ప్రేమించడం కారణంగానే.. తన ఇష్టపూర్వకంగా ఇంటిని వదిలి బయటకు వచ్చినట్లు బాలిక తెలిపింది. అతడు తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చినట్లు పేర్కొంది. అతనితో కలిసి జీవించేందుకే తన ఇంట్లో నుంచి బంగారం, డబ్బులు దొంగిలించినట్లు వెల్లడించింది. చదవండి: Divya Pahuja: ఎట్టకేలకు కాలువలో మృతదేహం లభ్యం -
దత్తత ఇచ్చిన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష వద్దు
ముంబై: అత్యాచారానికి గురైన బాధితురాలికి జన్మించిన బిడ్డను ఇతరులు దత్తత తీసుకున్న తర్వాత ఆ బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలనుకోవడం సమంజసం కాదని బాంబే హైకోర్టు తేలి్చచెప్పింది. బిడ్డ ప్రయోజనాలను కాపాడాలని, ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డీఎన్ఏ పరీక్ష నిర్వహించవద్దని పోలీసులను ఆదేశించింది. బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఈ నెల 10న తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2020లో ఓ వ్యక్తి 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చింది. బిడ్డకు జన్మనిచి్చంది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని జైలుకు పంపించారు. మైనర్ బాలికకు జన్మించిన బిడ్డను గుర్తుతెలియని దంపతులు దత్తత తీసుకున్నారు. నిందితుడు 2 సంవత్సరాల 10 నెలలుగా జైల్లోనే ఉన్నాడు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది. బాధితురాలి బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేశారా? అని ఆరా తీసింది. బిడ్డను ఇతరులు దత్తత తీసుకున్నారని పోలీసులు బదులివ్వడంతో ఇక డీఎన్ఏ పరీక్ష అవసరం లేదని ఆదేశించింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. -
రోజు రోజుకు దిగజారుతోంది..పట్టించుకోరా: బాంబే హైకోర్టు సీరియస్
ముంబై: నగరంలోని గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) క్షీణించడంపై బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ, జస్టిస్ ఆరిఫ్ డాక్టర్లతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)ల వివరణ కోరింది. ముంబైలో వాయు కాలుష్యం పెరిపోవడంపై నగరవాసులు ముగ్గురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ, జస్టిర్ ఆరిఫ్ డాక్టర్లతో కూడిన బెంచ్ ఈ అంశంపై విచారించింది. ‘‘నగరంలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో సంబంధిత అధికారులందరూ తెలియ జేయాలి’’ అని కోర్టు ఆదేశించింది తదుపరి విచారణను నవంబర్ ఆరవ తేదీకి వాయిదా వేసింది. నగరంలో కాలుష్యాన్ని అరికట్టడానికి, గాలి నాణ్యతను పెంచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, బృహన్ముంబై పాలక సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్లు – అమర్ బాబాన్ టికే, ఆనంద్ ఝా మరియు సంజయ్ సర్వే – తమ వాజ్యంలో కోరారు. ముంబైలో విచ్చలవిడిగా నిర్మాణ కార్యకలాపాలు, తగినంత పచ్చదనం లేకపోవడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని, ఇది నివాసితులపై, పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు.