సర్వోన్నత న్యాయస్థానంతో సహా దేశంలో వివిధ హైకోర్టులు అడపా దడపా అక్షింతలు వేస్తున్నా ఎన్‌కౌంటర్ల జాడ్యం పోయేలా లేదు. ఏ పార్టీ ఏలుబడి ఉందన్నదాంతో నిమిత్తం లేకుండా దాదాపు అన్ని రాష్ట్రాల తీరూ ఇదే. కనీసం స్క్రిప్టు మార్చడానికి కూడా పోలీసులు ప్రయత్నించరు. ముద్దాయిని/ముద్దాయిలను నేరస్థలానికి తీసుకెళ్లినప్పుడో, న్యాయస్థానంలో హాజరు పరచడానికి వెళ్తున్నప్పుడో హఠాత్తుగా తిరుగుబాటు చేసి పోలీసుల నుంచి తుపాకి గుంజుకుని కాల్చబోవటం, ఈలోగా పోలీసులు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపడం వీటన్నిటి సారాంశం.
పోలీసులకు స్వల్ప గాయాలు కావటం కూడా అన్నిచోట్లా డిటో. అక్షయ్ షిండే అనే నేరగాడిని మహారాష్ట్ర పోలీసులు హతమార్చిన తీరుపై బొంబాయి హైకోర్టు బుధవారం అనేక సందేహాలు వ్యక్తం చేసింది. వాహనంలో వెళ్తుండగా షిండే తిరగబడి పిస్తోల్ గుంజుకుని కాల్పులు జరిపే సమయంలో నలుగురు పోలీసులున్నా అతగాణ్ణి లొంగదీయలేకపోవటం ఏమిటని ప్రశ్నించింది. అసలు తుపాకులు, పిస్తోళ్లు ఉపయోగించటం తెలియని వ్యక్తి ఆయుధాన్ని అన్‌లాక్ చేసి కాల్పులు జరపటం ఎలా సాధ్యమని అడిగింది. ఈ ప్రశ్నలు సహేతుకమైనవి.
బద్లాపూర్ స్కూల్ ఉదంతం ఘోరమైనది. గత నెల 13న ఒక పాఠశాలలోని మరుగుదొడ్డి వద్ద ఇద్దరు కిండర్‌గార్టెన్ పిల్లలపై నిందితుడు లైంగిక నేరానికి పాల్పడ్డాడని ఆరోపణ. ఘటనపై పిల్లల తల్లిదండ్రులకు తెలిసి ఫిర్యాదుచేస్తే ముద్దాయిని ఆగస్టు 17న అరెస్టు చేశారు. స్కూల్ యాజ మాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించాకగానీ ప్రిన్సిపాల్, సంస్థ చైర్మన్, కార్యదర్శిలపై పోక్సో కేసు పెట్టలేదు.
ఆ స్కూల్ నిర్వహణ ఎంత ఘోరంగా ఉన్నదో చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అసలు ఆడపిల్లలు ఉపయోగించే మరుగుదొడ్డి వద్ద మహిళను నియమించాలని కూడా వారికి తోచలేదు. వీటన్నిటినీ తనిఖీ చేయాల్సిన విద్యాశాఖ పట్టించుకోలేదు.
ఇంతమంది నిర్లక్ష్యం ఫలితంగా ఇద్దరు చిన్నారులు బాధితులుగా మారాక మాత్రం కఠిన చర్య తీసుకున్నట్టు కనబడటం కోసం వక్రమార్గం అనుసరించారు. స్కూల్ నిర్వాహకులు బీజేపీకి కావలసినవారు గనుకే ఎన్‌కౌంటర్ నాటకం ఆడారని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపణ. నిజానిజాల మాటెలా ఉన్నా ప్రభుత్వాధికారులు మెతగ్గా వ్యవహరించారన్నది మాత్రం వాస్తవం.
గత రెండు నెలల్లో మూడు ఎన్‌కౌంటర్లు జరిపి తమిళనాడు పోలీసులు ముగ్గురు నిందితులను హతమార్చారు. మావోయిస్టుల ప్రభావం అధికంగావున్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌లు జరగకపోతే వార్త. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ఎన్‌కౌంటర్ల జోరు అధికమే. గత ఏడున్న రేళ్లలో యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 49 మందిని కాల్చిచంపారు.
గత సోమవారమే మరొకరిని హతమార్చి అర్ధ సెంచరీ పూర్తి చేశారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఎన్‌కౌంటర్ మృతులంతా అమాయకులనీ, సచ్ఛీలురనీ ఎవరూ అనరు. ఎన్నో ఆరోపణలున్నవారే. కానీ నేర గాళ్లను శిక్షించటానికి ఒక విధానం ఏర్పర్చుకున్నప్పుడూ, దానికి అనుగుణంగా భిన్న వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడూ ఇష్టారాజ్యంగా కాల్చిచంపే అధికారం పోలీసులకెక్కడిది? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇలాంటి కేసులను విచారించినప్పుడల్లా న్యాయస్థానాలు నిశితంగా ప్రశ్నిస్తున్నాయి.
కానీ ఎక్కడా ఇవి ఆగుతున్న దాఖలాలు లేవు. 2006లో ఇద్దరు నిందితులను నవీ ముంబైలో పట్టుకుని వారిలో ఒకరిని ఎన్‌కౌంటర్ చేసిన కేసులో 12 మంది పోలీసులకు కిందికోర్టు విధించిన యావజ్జీవ శిక్షను బొంబాయి హైకోర్టు ధ్రువీకరించటంతోపాటు కింది కోర్టు నిర్దోషిగా విడిచిపెట్టిన ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు’ ప్రదీప్ శర్మకు కూడా యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది.
న్యాయవాది అయిన ఎన్‌కౌంటర్ మృతుడి సోదరుడు అతను అరెస్టయ్యాక ఉన్నతాధికారులకూ, న్యాయస్థానానికీ టెలిగ్రామ్‌లు, ఫ్యాక్స్ మెసేజ్‌లు పంపటం, కాల్ రికార్డులు సేకరించటం పర్యవసానంగా ఇదంతా సాధ్యమైంది. కానీ ఎన్ని కేసుల్లో ఎందరు ఇలా చేయగలుగుతారు?
ఎన్‌కౌంటర్లను వ్యతిరేకించే పౌరహక్కుల సంఘాల నేతలనూ, పౌర సమాజ కార్యకర్తలనూ నేరగాళ్లకు వత్తాసు పలుకుతున్నవారిగా ముద్రేయటం పాలకులకూ, పోలీసులకూ అలవాటు. కొన్ని సందర్భాల్లో ఎన్‌కౌంటర్‌లు సాగిస్తున్న పోలీసులను సమాజంలోని భిన్నవర్గాలవారు ప్రశంసించటం కూడా కనబడుతుంది. ‘తక్షణ న్యాయం’ కోరేవారికి ఇది సబబే అనిపించవచ్చు.
కానీ ఈ క్రమంలో ప్రభుత్వాల బాధ్యతనూ, జవాబుదారీతనాన్నీ ఉపేక్షించటం లేదా? అసలు పోలీసు కాల్పుల్లో మరణించినవారే నిజమైన దోషులని ఏ ప్రాతిపదికన నమ్మాలి? ఈ ధోరణివల్ల అసలు దోషులు తప్పించుకునే ప్రమాదంతోపాటు మరిన్ని నేరాలు జరగటానికి ఆస్కారం ఉండదా? కోల్ కతాలోని పీజీ కర్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఉదంతమే తీసుకుంటే సక్రమంగా దర్యాప్తు జరిగింది గనుకే మాఫియాల ఆధిపత్యం, వారి అండతో ఆసుపత్రి ఉన్నతాధి కారులు సాగిస్తున్న తప్పుడు పనులు బయటపడ్డాయి.
నేరాలకు తావులేని వాతావరణం ఏర్పర్చటానికీ, వాటి నియంత్రణకు దోహదపడే చర్యలకూ బదులు నేరగాళ్లను హతమార్చే విధానం సమాజాన్ని బండబారుస్తుంది. అధికారులకు తాము ఏం చేసినా అడిగేవారు లేరన్న భరోసానిస్తుంది. కఠినమైన చట్టాలు, పకడ్బందీ దర్యాప్తు, న్యాయస్థానాల్లో చురుగ్గా విచారణ వంటివి మాత్రమే సమాజ భద్రతకు తోడ్పడతాయి. అది మరిచి ‘తక్షణ న్యాయం’ కోసం వెంపర్లాడటం సరికాదు.
‘తక్షణ న్యాయం’ ప్రమాదకరం
Published Fri, Sep 27 2024 3:09 AM | Last Updated on Fri, Sep 27 2024 3:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment