నిరంతరం ఉద్రిక్తతలతో నిండివుండే మధ్య భారతంలో మరోసారి అత్యంత విషాదకర ఉదంతం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్లోని బీజాపూర్–సుకుమా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో శనివారం మావోయిస్టులు జరిపిన దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 31మంది గాయ పడగా, కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఒక జవాన్‌ను వారు అపహరించుకెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా జరిగిన భీకర పోరులో 20 మంది మావోయిస్టులు కూడా మరణించారని అంటు న్నారు. ఇందులో ఇంటెలిజెన్స్ వైఫల్యంగానీ, ఆపరేషన్ సంబంధమైన వైఫల్యంగానీ లేదని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కులదీప్ సింగ్‌లు చెబుతున్నా... దాడి జరిగిన జరిగిన తీరుపై వెలువడుతున్న కథనాలు గమనిస్తే మావోయిస్టులు ఒక పథకం ప్రకారం జవాన్లను పక్కదోవపట్టించి, తాము కోరుకున్న చోటుకు వారిని రప్పించి, ఒక్కుమ్మడిగా దాడిచేసి హతమార్చారని అర్థమవుతుంది. 2010లో చింతల్నార్ ప్రాంతంలో ఇదే తరహాలో దాడిచేసి 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు బలితీసుకున్నారు. 2017లో 25 మంది, 2018లో తొమ్మిదిమంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఈ తరహా దాడుల్లోనే మరణించారు. మొత్తంగా ఇంతవరకూ దాదాపు 180 మంది భద్రతా సిబ్బందిని వారు హతమార్చారని గణాంకాలు చెబుతున్నాయి. పది పదిహేనేళ్లక్రితంతో పోలిస్తే మావోయిస్టుల ప్రాబల్యం దేశంలో క్రమేపీ తగ్గుతూ వస్తోంది. గతంలో వారి ప్రభావం వున్న తెలుగు రాష్ట్రాలు, ఒడిశా వంటిచోట్ల ఇప్పుడు దాదాపు శూన్యం. ఒకప్పుడు మావోయిస్టులదే పైచేయిగావున్న మధ్యభారతంలో కూడా ఇప్పుడు పరిస్థితి మారిందనే చెప్పాలి. వారు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో మారుమూల ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. అడపా దడపా జరిగే ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు చనిపోతుండటంతో భారీ సంఖ్యలో శ్రేణులు పాల్గొనే దాడు లను వారు ఎంచుకుంటున్నారు. ఈ దాడుల్లో అవతలి పక్షానికి భారీగా నష్టం కలిగిస్తే తమ ప్రాబల్య ప్రాంతాల్లో ఆత్మసై్థర్యం నింపవచ్చని వారు భావిస్తున్నట్టు కనబడుతోంది. ఇలాంటి దాడులకు అవకాశం వుందని తెలిసినప్పుడు సీఆర్‌పీఎఫ్ బలగాలు మరింత అప్రమత్తంగా మెలగాల్సింది. కానీ ఛత్తీస్‌గఢ్ ఉదంతం గమనిస్తే తగిన ముందుజాగ్రత్తలు లోపించాయన్న సంశయం కలుగుతుంది.
భౌగోళికంగా మధ్యభారతం చాలా దేశాలతో పోలిస్తే ఎంతో పెద్దది. ముఖ్యంగా బస్తర్, కంకేర్, నారాయణ్‌పూర్, కొండగావ్, దంతేవాడ, సుక్మా, బీజాపూర్‌లతోకూడిన బస్తర్ డివిజన్ దట్టమైన అడవులతోవుంటుంది. దండకారణ్యంగా పిలిచే ఆ ప్రాంతంలోకి ప్రవేశించటం అన్యులకు అంత సులభం కాదు. అక్కడ పాలనాధికార వ్యవస్థ దాదాపు వుండదు. పక్కా రోడ్లుగానీ, పకడ్బందీ కమ్యూనికేషన్ల వ్యవస్థగానీ లేవు. గతంలో మావోయిస్టుల్లో పనిచేసి వెనుదిరిగిన ఆదివాసీల్లో కొందరిని పోలీసులు సల్వా జుడుం పేరుతో చేరదీసి, వారితో దాడులు చేయించేవారు. అయితే ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆదివాసీ గ్రామాలు నిలువునా చీలి పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరింది. సల్వాజుడుం బాధితులు మావోయిస్టులను ఆశ్రయించే స్థితి ఏర్పడింది. అదృష్టవ శాత్తూ సుప్రీంకోర్టు సకాలంలో జోక్యం చేసుకుని చట్టవిరుద్ధమైన సల్వాజుడుంను వెంటనే రద్దు చేయమని ఆదేశా లిచ్చింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నక్సల్ సమస్య భద్రతాపరంగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లలో అతి పెద్దదని వ్యాఖ్యానించారు. తాము ఇకపై కఠిన వైఖరి అవలంబించబోతున్నామని 2014లో అధికారంలోకొచ్చాక ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రకటించారు. కానీ ఆ సమస్యను ఎదుర్కొనటంలో, దానికొక పరిష్కారాన్ని సాధించటంలో ఇన్నే ళ్లుగా వరస వైఫల్యాలు ఎదురుకావటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాస్తవానికి ఎన్‌డీఏ ప్రభుత్వం కూడా మావోయిస్టుల సమస్యలో ఇమిడివున్న ఆదివాసీ హక్కులు తదితరాలపై దృష్టి పెట్టింది. మొదట్లో కేంద్ర హోంమంత్రిగా వున్న రాజ్‌నాథ్ సింగ్ మావోయిస్టులను ఎదుర్కొ నడానికి ప్రకటించిన నాలుగంచెల వ్యూహంలో భద్రతతోపాటు ఆదివాసీ హక్కులు, అభివృద్ధి కూడా వున్నాయి. కానీ అది సక్రమంగా అమలు కాలేదు.
ఆదివాసీల హక్కుల కోసం ఆయుధం పట్టామని చెబుతున్న మావోయిస్టులు తమ చర్యల్లోని నిరర్థకత గురించి ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాన్ని ప్రకటించటానికి, ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేవనుకున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడటానికి ఎప్పుడూ అవకాశం వుంటుంది. అలాంటి ఉద్యమాలకు ప్రజానీకం మద్దతు కూడా లభిస్తుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న రైతు ఉద్యమం అందుకు ఉదాహరణ. ఆ ఉద్యమం తీసుకొచ్చిన ఒత్తిడి పర్యవసానంగా సాగు చట్టాల అమలును సైతం కేంద్రం వాయిదా వేసుకోకతప్పలేదు. ఆమధ్య సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరిగిన ముస్లిం మహిళల ఉద్యమం కూడా అటువంటిదే. ఈ ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కాదు. కానీ జాతీయంగా, అంతర్జాతీయంగా ఆ ఉద్యమాలకు విశాల ప్రజానీకం మద్దతు లభిం చింది. అందుకు భిన్నంగా సాయుధ పోరాట పంథాను ఎన్నుకుని హింసకు పాల్పడటం వల్ల మరిన్ని బలగాలు రంగంలోకి దిగుతాయి. కూంబింగ్ పేరుతో వారు చేపట్టే చర్యల వల్ల సాధారణ పౌరుల జీవనం దుర్భరమవుతుంది. కనుక మావోయిస్టులు ఇటువంటి హింసాత్మక విధానాలకు స్వస్తి పలకాలి.
చదవండి: ఇక సన్యాసమే శరణ్యమా!
Comments
Please login to add a commentAdd a comment