
రాయ్‌గఢ్: మరో భారీ ఎన్‌కౌంటర్‌తో ఛత్తీస్‌గఢ్ ఉలిక్కిపడింది. సుక్మా జిల్లాలో ఈ ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకోగా.. ఇప్పటిదాకా 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
సుక్మా-దంతేవాడ సరిహద్దులో ఉప్పనల్లి వద్ద గోగుండ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లింది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు. ఘనటలో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే కాల్పుల్లో మావోయిస్టు కమాండర్ డీవీసీఎం జగదీష్ మృతి చెందాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది.


ప్రస్తుతం అక్కడ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ పర్యవేక్షణలో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. గత మూడు నెలల్లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్‌లలో 100 మంది దాకా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టడం గమనార్హం.
- ఈ ఏడాది జనవరిలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. అదే నెల చివర్లో.. కూంబింగ్ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు.
- ఫిబ్రవరిలో బీజాపూర్ జిల్లాలోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు.
- బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లోని.. గంగలూరు పరిధి ఆండ్రి దండకారణ్యంలో మార్చి 20వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు, ఓ డీఆర్‌జీ జవాన్ రాజు మరణించారు. అదే రోజున కాంకేర్ జిల్లా(Kanker Encounter) ఛోటెబేథియా కోరోస్కోడో గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా ఆపరేషన్ కగార్(Operation Kagar) పేరిట హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన అనేక ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో.. ఆపరేషన్ కగార్ చర్యను ఖండిస్తూ మావోయిస్టులు స్పందించారు. మావోయిస్టు పశ్చిమ బస్తర్ కమిటి అధికార ప్రతినిధి మోహన్ పేరిట ఓ లేఖ విడుదల చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ దాడులతో 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు మావోయిస్టులు, ఆదివాసీలను కలిపి మొత్తం 78 మందిని హతమార్చారని అందులో పేర్కొన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు ఏయే ప్రాంతాల్లో, ఎప్పుడు ఎన్‌కౌంటర్లు జరిగాయి.. ఎంతమంది చనిపోయారు.. వారి వివరాలను తెలుపుతూ మావోయిస్టు పశ్చిమ బస్తర్ కమిటి అధికార ప్రతినిధి మోహన్ లేఖను విడుదల చేశారు. పోరాటం విషయంలో రాజీపడబోమని వెల్లడించారు. మావోయిస్టుల ప్రభుత్వ హత్యలను ఖండిస్తూ ఏప్రిల్ 4వ తేదీన బీజాపూర్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ఈ లేఖ విడుదలైన మరుసటిరోజే మరో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం.