
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం భద్రతా బలగాలు-మావోయిస్టులు మధ్య భీకర కాల్పులతో గురువారం మారుమోగింది. ఉదయం నుంచి జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో 30 మంది నక్సలైట్లు మరణించగా.. ఓ డీఆర్‌జీ(District Reserve Guard) జవాన్ సైతం వీరమరణం చెందారు. ప్రస్తుతం రెండు చోట్లా.. పోలీస్ కూంబింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లోని.. గంగలూరు పరిధి ఆండ్రి దండకారణ్యంలో నక్సలైట్లు దాగినట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. గురువారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులకు దిగారు. ప్రతిగా జరిపిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించారు. ఈ కాల్పుల్లో డీఆర్‌జీ జవాన్ రాజు మరణించినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఇక.. కాంకేర్ జిల్లా(Kanker Encounter) ఛోటెబేథియా కోరోస్కోడో గ్రామంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా జరిపిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఇక్కడ కూడా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఈ మధ్య జరుగుతున్న ఎదురు కాల్పులు, దాడుల్లో రక్తపు టేరులు ప్రవహిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీజాపూర్ జిల్లాలోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. జనవరిలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. అదే నెల చివర్లో.. కూంబింగ్ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment