
నక్సల్స్ మృతదేహాలను తరలిస్తున్న భద్రతా దళాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ 17 మంది మావోయిస్టులు మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య శనివారం భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ఏకంగా 17 మంది మావోయిస్టులు మృతి చెందగా వీరిలో 11 మంది మహిళలే ఉన్నారు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, దర్భా డివి జన్ కార్యదర్శి, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జగదీశ్ అలియాస్ బుద్రా మరణించినట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఇద్దరు డీఆర్‌జీ జవాన్లు గాయపడగా వారిని ఎయిర్‌లిఫ్ట్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
పక్కా సమాచారంతో..: సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు కేర్లపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోగుండ గుట్టల దగ్గర మావోయిస్టు దర్భా డివిజన్, కేర్లపాల్, నేషనల్ పార్క్ ఏరియా కమిటీలు సమావేశమయ్యాయని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సుక్మా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ), సీఆర్‌పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత గుట్టల వద్దకు చేరుకున్నాయి.
శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటల వరకు అనేకసార్లు కాల్పులు చోటు చేసుకున్నా యి. అనంతరం ఘటనా స్థలిని పరిశీలించగా 17 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తేలింది. మృతదేహాలను సుక్మాకు తరలించారు. ఇందులో ఏడుగురి వివరాలు మాత్రమే తెలిశాయి. ఘటనా స్థలంలో ఏకే 47, ఇన్సాస్, రాకెట్ లాంఛర్లు, ఇతర ఆటోమేటిక్ వెపన్లు లభించాయి.
మిలటరీ ఆపరేషన్లలో దిట్ట జగదీశ్!: సుక్మా జిల్లా లోని పౌర్‌గుండం గ్రామానికి చెందిన బుద్రా కుహరామి చిన్నప్పుడే మావోయిస్టుల్లో చేరాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ దర్భా డివిజన్ కమిటీ కార్యదర్శి స్థాయికి చేరాడు. మరో మావోయిస్టు అగ్రనేత జగదీశ్ మాస్టర్జీ 2011లో అరెస్ట్ అయ్యాక ఆయన పేరును బుద్రా ఉపయోగిస్తున్నాడు.
భద్రతా దళాలే లక్ష్యంగా దాడులు చేయడం, మిలిటరీ ఆపరేషన్లకు వ్యూహాలు రచించడం, పేలుడు పదార్థాలను ఉపయోగించడంలో దిట్టగా జగదీశ్‌కు పేరుంది. ఈ క్రమంలో 2023 ఏప్రిల్ 23న ఆరన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భద్రతా దళాల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని శక్తివంతమైన ఐఈడీ బాంబు పేల్చగా పది మంది డీఆర్‌జీ జవాన్లు మరణించారు. ఈ దాడి వెనుక మాస్టర్ మైండ్ జగదీశ్‌దేనని పోలీసుల విచారణలో తేలింది. అప్పటి నుంచి జగదీశ్ కదలికలపై భద్రతా దళాలు కన్నేసి ఉంచాయి.
డీఆర్‌జీ జవాన్ల సంబరాలు
జగదీశ్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఎదురుకాల్పుల మృతుల్లో ఆయన ఉన్నట్టు తెలియగానే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ (కగార్) చేపడుతున్న జవాన్లు సంబరాలు చేసుకున్నారు. జవాన్లకు బస్తర్ డీఐజీ కమలోచన్ కశ్యప్, సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్‌లు మిఠాయిలు పంచారు. ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ‘ఎక్స్’లో స్పందించారు. ‘అనదర్ స్ట్రైక్ ఆన్ నక్సలిజం’(నక్సలిజంపై మరో దాడి) అని అన్నారు. ‘ఆయుధాలు పట్టుకున్న వారికి నాదొక్కటే విజ్ఞప్తి, హింసతో మీరు ఎలాంటి మార్పు తేలేరు. శాంతితోనే మార్పు సాధ్యం’అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2026 మార్చి చివరి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని పునరుద్ఘాటించారు.
ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట
సుక్మా జిల్లా ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలా ఉండేది. క్షేత్రస్థాయిలో జన మిలీíÙయా మద్దతుతో మావోలు ఇక్కడ గట్టిగా నిలదొక్కుకున్నారు. 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయిన తాడిమెట్ల – చింతల్నార్ దాడి, సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలతో సహా 32 మంది చనిపోయిన జీరామ్‌ఘాట్ దాడులు ఇక్కడే చోటుచేసుకున్నాయి. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ విజయాలు దక్కలేదనే భావన యాంటీ నక్సల్స్ టీమ్స్‌లో ఇంతకాలం ఉండేది. కాగా ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడం సుక్మా జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతున్నారు.
సుక్మా ఎన్‌కౌంటర్ బూటకం
– పౌరహక్కుల సంఘం ఖండన
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్, నారాయణరావులు ఆరోపించారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరుతో 60 ఏళ్లకు పైబడిన వారిని, కదల్లేని వాళ్లను నిరాయుధులుగా పట్టుకుని చిత్రహింసలు పెడుతూ హత్యాకాండ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 14 నెలల హత్యాకాండలో 470 మంది మరణించారని తెలిపారు. ఇప్పటికైనా కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జరిగిన అన్ని ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలన్నారు.